
డా.కె.లక్ష్మణ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు
ముషీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. దసరా వేడుకలు కూడా లేకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మద్దతుగా శనివారం బస్‌భవన్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రోడ్డుపైకి వచ్చిందని, ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని కాపాడుకునేందుకే తాము సమ్మె కొనసాస్తున్నామన్నారు. ఈ ధర్నాలో బీజేపీతో పాటు తెలంగాణ జన సమితి, పలు ప్రజా, మహిళా, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. బస్‌భవన్ ప్రాంగణం అంతా కార్మికులతో కిటకిటలాడింది. మరోవైపు ధర్నా నేపథ్యంలో ఉదయం నుంచే భారీ బందోబస్తు చేపట్టిన పోలీసులు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి వీఎస్‌టీ వరకు ప్రధాన రహదారి మొత్తం బారికేడ్లతో మూసివేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలతో పాటు వివిధ జిల్లాల బీజేపీ నాయకులతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి భారీ ర్యాలీగా బస్ భవన్‌కు తరలివచ్చారు. డా.కె.లక్ష్మణ్ బస్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బలవంతంగా అరెస్టు చేశారు. కాగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో బస్‌భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో లక్ష్మణ్ డిశ్చార్జ్ అయ్యారు.