
హైదరాబాద్‌లోని బస్ భవన్ ఎదుట ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు ఇక వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచి కార్మికుల డిమాండ్ల సాధనకు తోడ్పాటు అందిస్తుండడంతో సమ్మె తీవ్రత బలంగా మారుతోంది. ఇదిలావుండగా ఖమ్మం బస్ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడం, నగరంలోని ఆస్పత్రికి తరలించడం, శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం... తదితర అంశాలు సమ్మెను మరింత వేడెక్కించాయి.
మరోవైపు కార్మికుల చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శని వారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. గడువులోగా విధుల్లో చేరని వారు కార్మికులే కాదని, వారితో చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మూడ్రోజుల్లోగా నూరుశాతం బస్సులు నడపాలని, కొత్త విధానం ప్రకారం బస్సుల నోటిఫికేషన్లు తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా పట్టు వీడకపోవడం... కార్మికులు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
ఏడు రోజుల కార్యాచరణ విడుదల...
సమ్మె పట్ల వెనక్కు తగ్గని కార్మిక సంఘాలు ఏకంగా వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక కార్యాచరణ ఏదీ లేకుండా రోజు వారీగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖి లపక్ష పార్టీ నేతల సమావేవంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 19వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వెల్లడించింది. ఈ నెల 13న అన్ని డిపోల వద్ద వంటా–వార్పు చేపట్టాలి. ఈ నెల 14న బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహా ధర్నాలు నిర్వహించాలి.
అదేవిధంగా ఇందిరాపార్క్ వద్ద సమ్మెకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో మహా ధర్నా. ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, చౌరస్తాల వద్ద ఆర్టీసీ కార్మికులతో పాటు రాజకీయ, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు, సబ్బండ వర్ణాల భాగస్వామ్యం తో రాస్తారోకోలు. 16న విద్యార్థి సంఘాలతో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై ర్యాలీలు. 18న బైక్ ర్యాలీలు. ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్. జేఏసీ కార్యాచరణ ప్రకటించిన గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేయనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment