సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్‌కు అందుతున్నాయి .
గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది.
‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’
డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు.
దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment