సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో నిలదీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా లేఖలు రాయగా.. నెలాఖరు నుంచి కేంద్ర బడ్జెట్ సమా వేశాలు మొదలవుతుండటంతో మరిన్ని లెటర్లు రాసేందుకు సిద్ధమైంది. తద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు నిధు లివ్వడంలో వివక్ష వంటి అంశాలపై కేంద్రం వైఖరిని ఎత్తిచూపాలని భావిస్తోంది. అదే సమయంలో.. బీజేపీ రాష్ట్ర ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం చేస్తున్నదేమీ లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి నేతృత్వంలో..
ఎరువుల ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహ రించుకోవాలంటూ ఈ నెల 12న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. తాజాగా ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు కేంద్రం ప్రతిపాదిం చిన సవరణలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయంటూ మరో లేఖ రాశారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్‌లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా కేంద్ర మంత్రులకు అరడజను లేఖలు రాశారు.
గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తామం టూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మేడారం జాతరకు జాతీ య హోదాపై మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఇక రాష్ట్ర విభ జన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ.. బడ్జెట్ సమావేశాల సమయంలో మరిన్ని లేఖలు రాసేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. గిరిజన యూని వర్సిటీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు, కాళేశ్వరం లేదా పాలమూరు పథకానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే వేగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్రానికి గుర్తు చేయాలని భావిస్తున్నారు.
బీజేపీ వైఖరిని ఎత్తిచూపేందుకే!
ఓవైపు లేఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు, మీడియా సమావేశాల ద్వారా బీజేపీ వైఖరిని నిలదీసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అనుసరిస్తోంది. ఖాళీగా ఉన్న 15.62 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి అంశాల్లో కేంద్రం వైఖరిపై ప్రశ్నలు సంధిస్తోంది. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం, పసుపుబోర్డు ఏర్పాటు, మేడారం జాతర నిర్వహణకు కేంద్ర నిధులు వంటి అంశాలను టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తరచూ వివిధ రూపాల్లో లేవనెత్తుతున్నారు.
‘‘ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ.. ఇతర అంశాల్లోనూ అదే రీతిలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఎంపీల పనితీరును ప్రజలను వివరించేందుకు టీఆర్‌ఎస్ వ్యూహం పన్నింది. అందులో భాగంగానే లేఖల ద్వారా రాష్ట్ర అంశాలను కేంద్రంతోపాటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం’’ అని టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment