సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ‘కోవర్టుల’అంశం కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయపార్టీల కార్యకలాపాలు ఊపందుకోగా, కోవర్టుల అంశాన్ని బీజేపీ మరోసారి చర్చకు తెరలేపింది. బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ కోవర్టులే తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నానని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తాజాగా చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కోవర్టులెవరో జాతీయ, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీలో కోవర్టులు ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు పార్టీ నాయకుల్లో సాగుతున్నాయి.
ఇప్పటికే కోవర్టులపై ఈటల వ్యాఖ్యలు..
పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. బహిరంగంగా మాత్రం తమ పార్టీలో ఎవరూ లేరని గంభీరంగా చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఫలానా నేత అయ్యి ఉండొచ్చా.. సదరు నాయకుడి ప్రకటనలు, ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది’అనే దాకా చర్చలు వెళ్లాయి. ఇప్పుడు నందీశ్వర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. గత కొన్నిరోజుల్లో ముఖ్యనేతలు నాలుగైదు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలు పేర్లు ప్రస్తావించకుండా పత్రికల్లో ప్రచురితమవ్వడం, టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే?
మళ్లీ ఇప్పుడెందుకు ?
నందీశ్వర్‌గౌడ్ వ్యాఖ్యలతో మళ్లీ కోవర్టుల పంచాయితీ ముందుకొచ్చింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో అధినాయకత్వం మేధోమథనం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని.. సంస్థాగతంగా అధ్యక్షుడి మార్పు, ఎన్నికల కమిటీ నియామకం వంటి మార్పుచేర్పులపై నాయకత్వం దృష్టి పెట్టిన సందర్భంలో ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఇవి ఎవరిని ఉద్ధేశించి చేసినవి? అనే చర్చ సాగుతోంది. ఈ కోవర్టుల గోలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment