nandishwar goud
-
తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ‘కోవర్టుల’అంశం కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయపార్టీల కార్యకలాపాలు ఊపందుకోగా, కోవర్టుల అంశాన్ని బీజేపీ మరోసారి చర్చకు తెరలేపింది. బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ కోవర్టులే తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నానని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తాజాగా చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కోవర్టులెవరో జాతీయ, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీలో కోవర్టులు ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు పార్టీ నాయకుల్లో సాగుతున్నాయి. ఇప్పటికే కోవర్టులపై ఈటల వ్యాఖ్యలు.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. బహిరంగంగా మాత్రం తమ పార్టీలో ఎవరూ లేరని గంభీరంగా చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఫలానా నేత అయ్యి ఉండొచ్చా.. సదరు నాయకుడి ప్రకటనలు, ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది’అనే దాకా చర్చలు వెళ్లాయి. ఇప్పుడు నందీశ్వర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. గత కొన్నిరోజుల్లో ముఖ్యనేతలు నాలుగైదు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలు పేర్లు ప్రస్తావించకుండా పత్రికల్లో ప్రచురితమవ్వడం, టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? మళ్లీ ఇప్పుడెందుకు ? నందీశ్వర్‌గౌడ్ వ్యాఖ్యలతో మళ్లీ కోవర్టుల పంచాయితీ ముందుకొచ్చింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో అధినాయకత్వం మేధోమథనం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని.. సంస్థాగతంగా అధ్యక్షుడి మార్పు, ఎన్నికల కమిటీ నియామకం వంటి మార్పుచేర్పులపై నాయకత్వం దృష్టి పెట్టిన సందర్భంలో ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఇవి ఎవరిని ఉద్ధేశించి చేసినవి? అనే చర్చ సాగుతోంది. ఈ కోవర్టుల గోలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు
సాక్షి, హైదరాబాద్ : వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఖండించారు. నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్ గౌడ్ చెప్పారు. మరోవైపు ఆశీష్ గౌడ్ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి...మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన -
సొంతగూటికి నందీశ్వర్‌గౌడ్!
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సొంతగూటికి చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యులను నందీశ్వర్‌గౌడ్ కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ ముఖ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిక లాంఛనప్రాయం కానుంది. సోమవారమే పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరాల ని నందీశ్వర్‌గౌడ్ నిర్ణయించుకున్నారు. డీఎస్ శిష్యుడు: నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్‌లో ఉన్నపుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్‌కు అనుంగు శిష్యుడిగా గుర్తింపు పొందారు. డీఎస్ టీఆర్ఎస్లోకి వెళ్లినపుడు ఆయన బీజేపీలో చేరారు. అయితే డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే సంకేతాల నేపథ్యంలో ఆయన సూచన మేరకే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నెల 12న రాహుల్ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. -
ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిషేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు అభిషేక్ గౌడ్‌పై కేసు నమోదు చేసి, పటాన్ చెరువు పీఎస్‌కు తరలించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వీరేందర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
నందీశ్వర్ షికారు
నేడు టీఆర్‌ఎస్‌లోచేరేందుకు నిర్ణయం తొలి జాబితాలోనే చోటు కల్పించనున్న గులాబీబాస్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ‘కారు’ఎక్కేందుకే సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఆదివారం మధ్యాహ్నం ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని, అదేరోజు, లేదా ఆ మరుసటి రోజు కేసీఆర్ విడుదల చేసే తొలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో నందీశ్వర్ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. వేధించారు..అందుకే పోతున్నా రాజకీయ గురువు డి.శ్రీనివాస్‌తో పాటు, రాహుల్‌గాంధీ దూత ఒకరు నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేసి పార్టీ వదిలి వెళ్లొద్దని వారించినా.. ఆయన మెత్తబడనట్టు సమాచారం. అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ పెద్దలు....జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేనైన ఠమొదటిపేజీ తరువాయి తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని రాహుల్ దూతతో నందీశ్వర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంతగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్‌లో కొనసాగితే తన రాజకీయ మనుగడకే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని బాధపడ్డట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన నందీశ్వర్..అనంతరం కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో వేర్వేరుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ఎక్కువ మంది కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వెళ్లడమే మంచిదని సూచించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేగా ఉన్న నందీశ్వర్ ఈ పర్యాయం గెలిస్తే దాదాపు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన ఆయనకు సన్నిహితులు కూడా సలహాలిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల వర్గాల నుంచి మంత్రి పదవి అడగాలని వారంతా ఆయనకు సూచించినట్లు సమాచారం. ఈ పరిమాణాలపై నందీశ్వర్‌గౌడ్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు