యశ్వంత్ సిన్హాకు నమస్కరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయి. దేశంలో వంద ఏళ్లకు సరిపడే ఖనిజ సంపద ఉన్నా, సింగరేణి బొగ్గు టన్ను రూ.4 వేలకు దొరుకుతున్నా.. మీ షావుకారు దోస్తులకు మేలు చేసేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు చెల్లించి దిగుమతి చేసుకోవాలా? మీరు ప్రధాని కాదు. మీ షావుకారు దోస్తులకు సేల్స్‌మన్. ‘అవినీతి రహిత భారతం.. తినను.. తిననివ్వను..’అంటూనే లక్షల కోట్ల రూపాయల అవినీతితో మీరు, మీ షావుకార్లు తింటున్నారు. మీ పాలనలో అవినీతి, బ్యాంకు మోసాలతో నిరర్ధక ఆస్తులు రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.18.6 లక్షల కోట్లకు పెరిగాయి.
భారతదేశ చరిత్రలో తొలిసారి రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారింది..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ గంటసేపు ప్రసంగించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో దేశ ప్రజలకు అనేక అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు, తప్పుడు విధానాలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
శ్రీలంకలో ఏం జరిగిందో చెప్పాల్సిందే..
మోదీ దేశానికి 15వ ప్రధాని, అంతకుముందు 14 మంది ప్రధానులుగా చేశారు. ఎవరి పాలనలోనూ దేశ పరిస్థితి ఇంతగా దిగజారలేదు. మీ రక్తంలో ఒక్క బొట్టు నిజాయితీ ఉన్నా రేపటి (ఆదివారం) హైదరాబాద్ సభలో శ్రీలంకలో మీకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు జరుగుతున్నాయో చెప్పండి. ఒక వ్యాపారి కోసం మీరు సేల్స్‌మన్‌గా మారడంతో అంతర్జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. గత ప్రధానులు ఎవరిపైనా ఇలాంటి ఆరోపణలు రాలేదు. వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో విరోధం లేదు. కానీ తన విధానాల్లో ప్రజాస్వామ్య వ్యతిరేక తానాషాహీ జులుం, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగాన్నే మేము ప్రశ్నిస్తున్నాం. శ్రీలంకలో ఏం జరిగిందో సభలో ప్రజలకు సమాధానం చెప్పకుంటే మిమ్మల్ని దోషులుగానే భావిస్తాం.
దేశ దుస్థితికి మోదీ సిగ్గుపడాలి
మోదీ గొంతు పెంచి ఏది పడితే అది మాట్లాడటం ఇకపై దేశంలో నడవదు. ఇచ్చిన హమీలు నెరవేర్చకపోగా తనకు తాను పొగుడుకుంటూ ప్రతి విషయంలో దేశ మానమర్యాదలు మంటగలుపుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న తానాషాహీ దేశానికి మంచిది కాదు. అనేకమంది ప్రధానులుగా పనిచేసినా మోదీ తాను పర్మినెంట్ అనే భావనలో ఉన్నారు. ఎవరూ శాశ్వతం కాదు, రాజకీయ పరివర్తన జరుగుతుంది. ప్రజాస్వామ్య దేశంలో మార్పు సాధ్యమే. మోదీని భగవంతుడు అంటున్నారు. ఆయన గొప్పతనమేంటి? రెండు పర్యాయాలు కలుపుకొని దేశ ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చినా దేశ రాజధాని ఢిల్లీతో సహా ఎక్కడా కనీసం మంచినీళ్లు ఇవ్వలేని దుస్థితికి సిగ్గుపడాలి. కరెంటు, నీళ్లతో పాటు వనరులు దేశ ప్రజలకు పంచకుండా విద్వేషం, అధికార దుర్వినియోగంతో దేశ ప్రజలను అవమానిస్తున్నారు. తిరోగమన విధానాలతో పారిశ్రామిక పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. ధరల నియంత్రణ సహా అన్నింటా విఫలం. దేశంలో మంచి జరగడం లేదు, మంచి చేయడం లేదు.
తెలంగాణ ప్రజలు యుద్ధానికి సిద్ధం
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోదీ విజయవంతంగా హత్య చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం, లేదంటే కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. మోదీ తరగతులు విన్న కేంద్రమంత్రి ఒకరు 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో 110 మంది సభ్యుల మద్దతు ఉన్న మా ప్రభుత్వాన్ని మహారాష్ట్ర తరహాలో కూల్చివేస్తాడట. మంచిదే.. మా ప్రభుత్వాన్ని కూల్చండి. మేమూ ఎదురుచూస్తున్నాం. మాకు ఫ్రీ టైమ్ దొరుకుతుంది. మిమ్మల్ని ఢిల్లీ నుంచి దించేస్తాం. సంక్షోభం నుంచే విప్లవం వస్తుంది. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రాన్ని సాధించుకుని ముందుకు సాగుతున్నారు. వారు వెనక్కి వెళ్లరు. మళ్లీ యుద్ధానికి వారు సిద్ధం.
విద్వేషం మంచిది కాదు..
అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటి దేశాల్లోనూ భారతీయులు ఉన్నారు. ఈ తరహా విద్వేషం యువత మనసులో నింపి విషపూరితం చేయడం దేశానికి మంచిదా? కాదు. మనది సహనశీల దేశం. ‘బతుకు.. బతకనివ్వు సిద్ధాంతం’. ప్రపంచానికి అహింసా సందేశాన్ని ఇచ్చిన జాతిపితను కూడా అవమానిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లో గాంధీ అద్దాలు పెట్టి, ఆయన సమాధి వద్ద మీరు (మోదీ) డ్రామా చేస్తుంటే, మీ వాళ్లు ఆయనను అవమానిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు తెస్తున్న వారిపై చర్య తీసుకోలేరా? బయట నాటకాలు, లోపల నుంచి ప్రోత్సాహం. దేశ ప్రజలు మీ నాటకాలను గమనిస్తున్నారు.
ప్రభుత్వాలను కూల్చడంలో రికార్డు
మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. గొంతు చించుకుని మా గురించి చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి తోచింది వారు మాట్లాడవచ్చు. కానీ ప్రధాని గారూ.. విపక్ష నేతలపై గొంతు చించుకుని తప్పుడు ఆరోపణలు చేస్తారా? హైదరాబాద్‌లో ఆదివారం జరిగే సభలో మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు మొదటిసారి గెలిచినపుడు దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? టార్చ్‌లైట్ వేసి వెతికినా ఒక్కటీ కనిపించడం లేదని దేశ ప్రజలు అంటున్నారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో బిజీగా ఉన్నారు. తొమ్మిది ప్రభుత్వాలను కూల్చారు. ఇదీ మీ రికార్డు. మీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.
సాయం చేస్తే హేళన చేస్తారా?
పన్నులను సెస్సులుగా మార్చి రూ.3 లక్షల కోట్లు మింగేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 700 వందల రైతు కుటుంబాలకు మేము సాయం చేస్తే హేళన చేశారు. మీరు చేసిన చట్టాలు సరైనవే అయితే దేశం ముందు మీరు తలవంచి క్షమాపణ కోరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నికల సమయంలో తీయని మాటలు, ఆ తర్వాత అబద్ధాల ముచ్చట్లు ప్రధానికి అలవాటు. రైతులను ఎందుకు క్షమాపణ కోరి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు?
అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికలనుకున్నారా?
ఏ ప్రధాని కూడా వేరే దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోరు. ప్రపంచంతో మంచి సంబంధ బాంధవ్యాలు అవసరమే. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీరు ‘అబ్‌కీ బార్.. ట్రంప్ సర్కార్’అని నినాదాలు చేశారు. ఏదేశ ప్రధాని అయినా ఇలా చేస్తారా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్నారా లేక అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుకున్నారా? ఇవన్నీ సరైన సమయంలో దేశ ప్రజల ముందు పెడతాం.
మరో పోరాటం అవసరం..
దేశం మౌనంగా ఉండకుండా ఏకమై గొంతెత్తితే భారతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది. ఇదే ప్రస్తుతం భరత జాతికి అవసరం. నీతి, నిజాయితీతో కూడిన నవ భారత్ కోసం నేటి నుంచే పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వినతి. మనది ప్రజాస్వామ్య దేశం. గతంలో వీవీ గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినపుడు ‘ఆత్మ ప్రబోధం’మేరకు ఓట్లు వేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరి అభ్యర్థిత్వాలను బేరీజు వేసి ఆత్మ ప్రబోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయండి. సిన్హా గెలిస్తే దేశ గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు దేశ ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment