
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్సెల్బీసీ) టన్నెల్–1, 2 పనులపై గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న పనులను చూస్తుంటే ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని టన్నెల్–1 ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులతోపాటు నల్లగొండ జిల్లాలోని నక్కలగండి రిజర్వాయర్ పనులు, జరుగుతున్న తీరును బీజేపీ శాసన మండలి బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజల ఆశలసౌధం ఎస్సెల్బీసి పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయో ప్రభుత్వం, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ కూడా చెప్పడం లేదన్నారు. 2020 నాటికి పనులు పూర్తయితే ఈ ప్రాజెక్టు కాలం 15 ఏళ్లవుతుందని అన్నారు. ప్రపంచంలోనే ఇది పెద్ద ప్రాజెక్టని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నిధుల కొరత లేదని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా ఎందుకు పనుల విషయంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇది పూర్తయితే నల్లగొండ జిల్లాకు సాగునీరు అందడంతో పాటు 516 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పనుల పట్ల అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సెల్బీసీపై ప్రగతి భవన్‌లోనైనా సమీక్ష చేసి వేగవంతం చేయించాలన్నారు. అనుమతి లేని ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి అన్ని అనుమతులు వచ్చి నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టును మూడున్నరేళ్లలో ఒక్కసారైనా ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ ఇన్‌లెట్ టన్నెల్ మిషన్ మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం త్వరితగతిన కొత్త మిషన్లను తెప్పించడంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.కోట్లలో పెంచుతూ పోతున్నారే తప్ప, ఆ స్థాయిలో పనులు జరగడం లేదన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహ్మరెడ్డి, నాయకులు నూకల వెంకటనారాయణ, పాపయ్య, రాములు, కొండయ్య, సాంబయ్య, నక్క వెంకటేశ్‌యాదవ్, బెజవాడ శేఖర్, నేతాళ్ల వెంకటేశ్‌యాదవ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, గుండాల అంజయ్యయాదవ్, వస్కుల సుధాకర్, కళ్యాణ్‌నాయక్, అంకూరి నర్సింహ పాల్గొన్నారు.
2019లో బీజేపీదే అధికారం
చందంపేట (దేవరకొండ) : 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం చందంపేట మండలంలోని ముడుదండ్ల గ్రామంలో బీజేపీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంభమూర్తి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, నేతలు నూకల వెంకటనారాయణ, పాపయ్య, రాములు, కొండయ్య, సాంభయ్య, నక్క వెంకటేశ్‌యాదవ్, బెజవాడ శేఖర్, నేతాళ్ల వెంకటేశ్‌యాదవ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్యయాదవ్, వస్కుల సుధాకర్, కళ్యాణ్‌నాయక్, నర్సింహ పాల్గొన్నారు.