
ఏపీ జలవనరుల శాఖ అధికారులకు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ ఆదేశం
జలాశయం భద్రతపై ఏపీ, తెలంగాణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
2009లో భారీ వరద రావడంతో ఫ్లంజ్ పూల్ కోతకు..
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం ఫ్లంజ్ పూల్‌లో ఏర్పడిన భారీ గొయ్యిని మేలోగా పూడ్చి, మరమ్మతులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఎన్‌డీఎస్‌ఏ(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) చైర్మన్ అనిల్ జైన్ ఆదేశించారు. గొయ్యిపై తక్షణమే సీడబ్ల్యూపీఆర్‌ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణులతో అధ్యయనం చేయించి, పూడ్చివేత, మరమ్మతుల విధానాన్ని తయారుచేసి తమకు పంపాలన్నారు.
దానిపై తాము అధ్యయనం చేసి మరమ్మతు చేయాల్సిన విధానాన్ని ఖరారు చేసి పంపుతామని తెలిపారు. జలాశయం భద్రతపై అనిల్ జైన్, నిపుణుల కమిటీ చైర్మన్ వివేక్ త్రిపాఠి గురువారం ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్‌డీఎస్‌వో) చీఫ్ కుమార్, శ్రీశైలం ప్రాజెక్టు సీఈ కబీర్‌బాషా, ఎస్‌ఈ మోహన్, తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్, ఆ రాష్ట్ర ఎస్‌డీఎస్‌వో సీఈ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయంలోకి 2009, అక్టోబర్ 2న 26.08 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ఫ్లంజ్ పూల్ కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టును తనిఖీ చేసిన ఎన్‌డీఎస్‌ఏ.. తక్షణమే గొయ్యిని పూడ్చి, మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది.
ఇదే అంశాన్ని సమావేశంలో గుర్తుచేస్తూ ఇప్పటికీ మరమ్మతులు ఎందుకు చేయలేదని అనిల్ జైన్ నిలదీశారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఆ గొయ్యిపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్టు వెంకటేశ్వరరావు వివరించారు.
శ్రీశైలం డ్యాం సేఫ్టీ బాధ్యత ఏపీదే..
డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం జలాశయాల భద్రత బాధ్యత వాటి ఓనర్ల(యజమానులు)దేనని తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ తెలిపారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ ఏపీ పరిధిలో ఉన్నందున.. ఆ జలాశయం భద్రత బాధ్యత ఆ రాష్ట్ర అధికారులదేనని స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ పర్యవేక్షణ తమ రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఆ ప్రాజెక్టు భద్రతకు తాము బాధ్యత వహిస్తామని చెప్పారు. దీనిపై వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉందని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఈఎన్‌సీ చేసిన ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున.. దానితో ముడిపెట్టకూడదని తెలంగాణ ఈఎన్‌సీ చెప్పారు. దీనిపై అనిల్ జైన్ స్పందిస్తూ.. శ్రీశైలం జలాశయం నిర్వహణను చూస్తున్న ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరే(ఏపీ) ఓనర్ అవుతారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment