పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ
2024 వార్షిక సమీక్షలో కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టీకరణ
అక్టోబర్‌లో ‘సాక్షి’ చెప్పింది అక్షర సత్యం
నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల
ఆగస్టు 28న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఆ పనులకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం
మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
ఇప్పటిదాకా ప్రాజెక్టుకు రూ.18,348.84 కోట్లు వ్యయం
ఇందులో రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని వెల్లడి
ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కారు అంగీకరించినట్లే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది.
ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.
ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్‌తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది.
పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్‌సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment