
పెను ప్రమాదంలో శ్రీశైలం జలాశయం
తక్షణమే అధ్యయనాలు, మరమ్మతులు చేపట్టాలన్న ఎన్డీఎస్‌ఏ కమిటీ
గుంతతో ఇప్పటికే షీర్‌జోన్ ప్రభావితమై ఉండవచ్చు
డ్యామ్ భద్రతకు ఇది అత్యంత ప్రమాదకరమన్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ‘ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం భద్రత పెను ప్రమాదంలో ఉంది. డ్యామ్ పునాదుల కింద భూగర్భంలోని భారీ రాతిఫలకాల మధ్య పెళుసుతో కూడిన బలహీన అతుకులున్నట్టు జియలాజికల్ సమాచారం స్పష్టం చేస్తోంది. నిలువుగా రెండు భారీ జాయింట్లు, వాటికి అనుబంధ జాయింట్లూ ఉన్నట్టు తెలుపుతోంది.
అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయి జారిపోయే ప్రమాదం ఉంది. ఇది డ్యామ్ భద్రతకు అత్యంత ప్రమాదకరం. డ్యామ్ దిగువన ఏర్పడిన భారీ గుంత (ప్లంజ్‌పూల్) 120 మీటర్ల లోతైనదని 2018 జూలైలో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో తేలింది. గుంత లోతు డ్యామ్ పునాదుల లోతుకు మించిపోయినట్టు తెలుస్తోంది. గుంత.. డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెళుసుతో ఉన్న జాయింట్ల (షీర్ జోన్)ను ప్రభావితం చేసి ఉండవచ్చు.
డ్యామ్ జారిపోకుండా రక్షణ కల్పించే పునాదుల మందం గణనీయంగా తగ్గిపోయి ఉండవచ్చు..’ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి చెందిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే పలు అధ్యయనాలు, మరమ్మతులు చేపట్టాలని సిఫారసు చేసింది.
2009 వరదలతో పెరిగిన ముప్పు
ఎన్డీఎస్‌ఏ సభ్యులు (విపత్తుల నిర్వహణ) వివేక్ త్రిపాఠి నేతృత్వంలో డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్, కన్సల్టెంట్ కమలేశ్ జైన్‌తో సంస్థ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు, సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల నిపుణులు కూడా కమిటీలో ఉ న్నారు. ఈ కమిటీ గత ఏడాది శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. అనంతరం తన నివేదికను సమర్పించింది. తాజాగా వెలుగు చూసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి.
78 గంటల భీకర వరదతో తీవ్ర నష్టం
శ్రీశైలం జలాశయం నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తైంది. 1975–76లో జలాశయం దిగువన బకెట్ ఏరియా కోతకు గురైనట్టు గుర్తించి, నిపుణుల కమిటీ సూచన మేరకు రక్షణగా ఆప్రాన్ ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. మళ్లీ కమిటీ సూచన మేరకు 1984–85లో కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను ఆప్రాన్‌కు రక్షణకు పాతిపెట్టగా, అవీ కోతకు గురయ్యాయి.
శ్రీశైలం జలాశయాన్ని గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించగా, 2009 అక్టోబర్‌లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీటర్లకు పెరిగిపోవడంతో జలాశయం పొంగిపొర్లింది. 78 గంటల పాటు భీకర వరద కొనసాగడంతో జలాశయానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్లంజ్‌పూల్‌పై కమిటీ సిఫారసులు
⇒ శ్రీశైలం జలాశయం దిగువన డైక్/కాఫర్ డ్యామ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. దీంతో దిగువ భాగంలో నీటి నిల్వల స్థాయి పెరిగి గుంత మరింతగా కోతకు గురికాకుండా
ఉంటుంది.
⇒ గుంత కారణంగా జలాశయం పునాదుల కింద రాతిపొరల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి ఆధునిక పద్ధతుల్లో సిమ్యూలేషన్ అధ్యయనాలు చేయాలి. వేర్వేరు వరద తీవ్రతలను ప్రామాణికంగా తీసుకుని జలాశయానికి ఉండే ముప్పును, స్థిరత్వాన్ని, జారిపోయే ప్రమాదాన్ని అంచనా వేయాలి.
⇒ జలాశయం దిగువన దెబ్బతిన్న కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను పునరుద్ధరించాలి.
⇒ ప్లంజ్‌పూల్‌కి రెండువైపులా స్థిరత్వం కోసం రాతిఫలకాలకు బోల్టులు అమర్చి కాంక్రీట్‌తో రీఎన్‌ఫోర్స్ చేయాలి.
⇒ దిగువన గుంత పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాలి.
⇒ జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా? లేదా? అనే అంశాన్ని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించాలి.
⇒ జలాశయం ఎగువన ఎడమగట్టుకు రక్షణగా నిర్మించిన గోడకు మరమ్మతులు జరపాలి. పియర్, స్పిల్‌వే ఎగువ భాగానికి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ మరమ్మతులు చేపట్టాలి.
ఇతర సిఫారసులు
⇒ జలాశయం 17/18 బ్లాకులకు రెండుచోట్ల అడ్డంగా వచ్చిన పగుళ్లకు మరమ్మతులు చేయాలి. భవిష్యత్తులో మళ్లీ ఏర్పడకుండా నివారించేందుకు వీలుగా పగుళ్లకు కారణాలను శోధించాలి.
⇒ డ్యామ్ దిగువన 4, 9, 10 నంబర్ల గేట్ల వద్ద ఏర్పడిన గుంతల లోతును అధ్యయనం చేసి, దాని ఆధారంగా మరమ్మతులను నిర్వహించాలి.
⇒ 16, 17వ బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన రివర్ స్లూయిస్‌ల నుంచి లీకేజీని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యతతో మరమ్మతులు చేయాలి.
⇒ డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో ఆందోళనకర రీతిలో పెద్దమొత్తంలో సీపేజీ జరుగుతోంది. సీపేజీ అధికంగా ఉన్న బ్లాకులకు కర్టైన్ గ్రౌటింగ్ నిర్వహించాలి.
⇒ భూకంపాల ముప్పుపై ఎప్పుడో జలాశయం నిర్మాణ సమయంలో అధ్యయనాలు చేశారు. ఇప్పుడు అత్యాధునిక సమాచారం లభ్యతగా ఉన్న నేపథ్యంలో మళ్లీ కొత్తగా అధ్యయనం జరపాలి.
⇒ జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment