
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు (సోమవారం) కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన మరమ్మతు పనులను నిర్దేశిత కాలపరిమితిలోపు చేపట్టకపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆప్రాన్ దిగువన 50 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో భారీ గుంత పడింది. ఈ గుంత పునాది కింద వరకు విస్తరించిందన్నది నిపుణుల కమిటీ అనుమానం. కృష్ణా వరదల ఉద్ధృతికి స్పిల్ వే ఎగువన కటాఫ్ దెబ్బతినడం వల్ల స్పిల్ వేలో 490 అడుగుల వద్ద ఉన్న గ్యాలరీలో గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు నిమిషానికి 450 గ్యాలన్లు, కనిష్ట నీటిమట్టం ఉన్నప్పుడు 220 గ్యాలన్ల మేర లీకేజీ (సీపేజీ) చోటుచేసుకుంటోంది.
ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్.. తక్షణమే మరమ్మతులు చేపట్టి మే 31లోగా పూర్తి చేయాలని మార్చి 6న ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఈ పనులు చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రతను సమీక్షించేందుకు అనిల్ జైన్ నేతృత్వంలో ఎన్‌డీఎస్‌ఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం విజయవాడ వస్తోంది.
ఈ బృందం ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనుంది. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు భద్రతపై సమీక్షించనున్న ఈ బృందం గురువారం నాగార్జునసాగర్‌ను పరిశీలించి.. భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ అధికారులకు మార్గనిర్దేశం చేయనుంది.