జలాశయంలో పేరుకుపోతున్న మట్టి
సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడి
జలాశయం నిర్మాణం పూర్తయ్యాక 1976లో తొలిసారిగా నీటినిల్వ
అప్పట్లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలుగా నిర్ధారణ
తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగ్గిన నీటినిల్వ సామర్థ్యం
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది.
బేసిన్‌లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది.
దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.
45 ఏళ్లలో కొండలా పూడిక
కృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.
జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.
ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే
శ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొండలా మారిన పూడికను తొలగించడం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ సమగ్ర స్వరూపం
తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976
గరిష్ట నీటిమట్టం 885 అడుగులు
క్యాచ్‌మెంట్ ఏరియా: 60,350 చ.కి.మీ.
గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment