
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడైన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. తన మీద జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇటీవల చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ అంతిమయాత్రలో పాల్గొన్న తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్స్పెక్టర్ అంజయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీజేపీ పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి కామర్స్ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.
ఈ క్రమంలో ఘటన వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ సమర్పించిన ఫోటోలు, వీడియోలు, పత్రిక కథనాలను ఓం బిర్లా పరిశీలించారు. ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దాడి చేసిన పోలీస్ అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు.
కాగా ఇటీవల తనపై పోలీసులు దాడికి దిగారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. మంత్రిపై పోలీసు దాడి ఘటనపై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నంబర్ 1137/36/3/2019గా నమోదు చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment