
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన మంత్రివర్గ కూర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ఎవరెవరికి బెర్తు లభిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరులో దాదాపు 8 మందితో తొలివిడత మంత్రివర్గం కొలువుదీరనుందన్న వార్తల నేపథ్యంలో సీనియర్లు, జూనియర్లలో ఎందరిని అదృష్టం వరిస్తుందనే ప్రశ్న రాజకీయ వేడిని పెంచుతోంది. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రులు ఎంత మంది ఎంపీలుగా పోటీ చేస్తారన్న అంశంపైనా టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ ఒకవేళ తొలి మంత్రివర్గ విస్తరణలో 8 మందికే అవకాశం కల్పిస్తే వారిలో రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, వెనుకబడిన తరగతుల నుంచి ఇద్దరికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చొప్పున అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. మరోవైపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా తొలి విస్తరణ సమయంలోనే భర్తీ చేయాలని సీఎం యోచిస్తుండటంతో 11 మందికి ఈ నెలాఖరున లేదా జనవరి మొదటి వారంలో కేబినెట్ పదవులు లభించనున్నాయి.
రేసులో ఉన్నది ఎవరు...?
తొలి విడత మంత్రివర్గ విస్తరణలో తాజా మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు అధికార టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు కచ్చితంగా అవకాశం లభించనుంది. ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించగా పార్టీ బాధ్యతలు మోయడంతోపాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటేనే హామీల అమలు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కూడా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ సామాజికవర్గం నుంచి మరొకరికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అంటున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి మంత్రివర్గంలో తప్పనిసరిగా బెర్త్ దొరుకుతుందని పార్టీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికి తొలి మంత్రివర్గ విస్తరణలోనే స్థానం దక్కే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజా మాజీ మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, సీహెచ్ లక్ష్మారెడ్డిలకు మొదటి విస్తరణలో అవకాశం దక్కుతుందని అంచనా.
నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రెండో విడత విస్తరణలో అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ‘ఈ టర్మ్‌లో కచ్చితంగా గుత్తాకు అవకాశం లభిస్తుంది. అది తొలి విస్తరణలోనా లేక మలి విస్తరణా అనేది మాత్రం చెప్పలేం’అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. మలి విస్తరణలో రెడ్డి సామాజికవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలలో ఇద్దరికి అవకాశం రావచ్చు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెనుకబడ్డ తరగతుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మున్నూరు కాపు వర్గానికి, దక్షిణ తెలంగాణ నుంచి యాదవ వర్గానికి చాన్స్ దక్కవచ్చు. ఈ కోటాలో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్‌కు చాన్స్ ఉంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా జోగు రామన్న లేదా బాజిరెడ్డి గోవర్ధన్‌కు మొదటి విడతలో అవకాశం రావచ్చంటున్నారు.
ఈ విస్తరణలో అవకాశం లేకపోయినా మలివిడత విస్తరణలో వెనుకబడ్డ తరగతులకు చెందిన ఇతర వర్గాలకు అవకాశం ఇస్తే హైదరాబాద్ నుంచి పద్మారావుగౌడ్, వరంగల్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇక ఎస్సీ వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కోటాలో మలివిడత విస్తరణలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తోపాటు చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లేదా మానకొండూరు నుంచి రెండోసారి గెలిచిన రసమయి బాలకిషన్‌కు అవకాశం లభించవచ్చని అంటున్నారు. ఎస్టీ వర్గం నుంచి వరంగల్ జిల్లాకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేరు వినిపిస్తోంది. మంత్రివర్గంలో మహిళకు అవకాశం కల్పించాలని భావిస్తే ఖానాపూర్ నుంచి రెండోసారి గెలిచిన అజ్మీరా రేఖానాయక్ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
స్పీకర్ పదవికి పోచారం లేదా పద్మా దేవేందర్‌రెడ్డి...
ఈసారి శాసనసభాపతి స్థానానికి సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మాదేవేందర్‌రెడ్డిల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏ కారణాల వల్ల అయినా పోచారం, ఈటల పేర్లు స్పీకర్ పదవికి పరిశీలించకపోతే తొలి విస్తరణలో వారికి మంత్రులుగా అవకాశం దక్కుతుందని అంటున్నారు. ‘ప్రభుత్వంలో ఎవరు ఏ పాత్ర పోషించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవడమే నా ముందున్న లక్ష్యం’అని ఈటల తన సన్నిహితులతో పేర్కొన్నారు. పోచారం, ఈటలకు మంత్రివర్గంలో స్థానం దొరికితే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి స్పీకర్‌గా పదోన్నతి లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్పీకర్‌గా మహిళకు అవకాశం ఇస్తే మంత్రివర్గంలో మహిళలు లేకపోయినా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్‌గా కొప్పుల ఈశ్వర్, దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది టీఆర్‌ఎస్ తరఫున గెలవడంతో వారిలో కొందరికి ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్చించవచ్చంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత మలివిడత మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment