
సాక్షి, జగిత్యాల : ‘అర్హులకు అన్యాయం చేసి.. అనర్హులకు అందలం ఎక్కించి మీకు నిద్రెలా పడుతోంది..? ప్రభుత్వ మార్గదర్శకాలనే తుంగలోతొక్కి మీరు వ్యవహరిస్తోన్న తీరు ఏం బాగోలేదు.. మీ విద్యుక్త ధర్మాన్ని ఎలా నిర్వహిస్తున్నారో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోండి. ’ అని సీఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు. ఆదివారం స్థానిక తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సబ్సీడీ ట్రాక్టర్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిపా దించిన వారికే సబ్సిడీ ట్రాక్టర్లు వరిస్తున్నాయన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తాను సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా అడిగితే సిద్ధం కాలేదని దాటవేత ధోరణిని అవలంభించారని వ్యవసాయాధికారిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరాశపర్చిన ‘పోచారం’ పర్యటన
శనివారం జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నిరాశపరిచిందన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలపై స్పందిస్తారని రైతులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయన్నారు. క్వింటాల్ పసుపుకు రూ. 15వేల గిట్టుబాటు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతు క్వింటాలుకు రూ. పది వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. గిట్టుబాటు ధర కాకున్నా.. క్వింటాలుకు రూ. 2వేల బోనస్ ప్రకటిస్తే బాగుండేదన్నారు. దీనిపైనా మంత్రి స్పందించకపోవడం రైతులను నిరాశకు గురిచేసిందని చెప్పారు.
రోడ్డున పడ్డ చెరుకు రైతులు
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతబడి చెరుకు రైతులు రోడ్డున పడ్డారన్నారు. ఆ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంపై ప్రస్తావించకపోవడం జిల్లా రైతులను నిరాశకు గురి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం.. టీఆర్‌ఎస్ పార్టీ కదంబహస్తాల్లో చిక్కుకుందన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మీ, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు బండశంకర్, నాయకులు కొలూగురి దామోదర్, నరేశ్‌గౌడ్, రియాజ్ ఉన్నారు.