
సాక్షి, హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంటలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ రాసి పంపించే స్క్రిప్టునే ఆయన చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఖరీఫ్‌లో పంట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అదుకోలేదని, పంట నష్టం జరిగితే కూడా బోనస్ ప్రకటించలేదని అన్నారు. కనీసం రబీ పంటకైనా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రబీ నుంచే రూ.4 వేలు పెట్టుబడి ఇచ్చి రైతులను ఆదుకోవాలని, కౌలు రైతులు, పట్టేదారులు అనే భేదం లేకుండా వ్యవసాయ పెట్టుబడి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరు భూమి సాగుచేస్తే వారికే పెట్టుబడి ఇవ్వాలని సూచించారు.