సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అలాగే, తెలంగాణ ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. వడ్డీ మాఫీ మాత్రమే చేసింది. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోంది. రైతు భరోసా పేరుతో ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు 12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. బీఆర్ఎస్ రైతుబంధు పేరుతో ఏడాదికి 8వేల నుండి పది వేలు చేస్తే.. కాంగ్రెస్ పది వేల నుండి 12 వేలు ఇస్తుంది. భవిషత్తులో 14 వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది.
దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు 500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు సన్నాలు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ హౌసింగ్ పథకాన్ని మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక చేసింది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ రుణమాఫీ అంశాన్నే ఎత్తేసింది. బీజేపీ రుణమాఫీ అనే మాటే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్ మాత్రమే’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment