మాట్లాడుతున్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి, హాజరైన ఉపాధ్యాయులు
దోమలగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తూ అతి ముఖ్యమైన రాష్ట్ర విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ శాసన సభాపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. పీఆర్‌సీలో 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటి వర కు పీఆర్‌సీ బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల సాధనకై టీపీయూఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని వాపోయారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదన్నారు. సమస్యలపై స్పందించాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాలక పక్ష ఎమ్మెల్సీలుగా మారారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రెండున్నర ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్ఠు పట్టిందని, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
స్వచ్ఛ భారత్ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేసినా అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించలేదన్నారు. టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు తీకుళ్ల సాయిరెడ్డి, ప్రధానకార్యదర్శి పాలేటి వెంకట్రావు మాట్లాడుతూ కాంట్రిబ్యూషన్ పింఛన్ విధానం రద్దుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. భాషా పండితులు, పీఇటీలకు పదోన్నతులు కల్పించాలని, 398 వేతనంపై పని చేసిన ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి, సుధాకర్, విష్ణువర్ధన్‌నెడ్డి, లింగస్వామి, సురేష్, రవీందర్, శ్రీనివాసరెడ్డి, బండి రమేష్, వనం పద్మ, భూపతి, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.