MLA Kishan Reddy
-
వారికి ఓట్లు అడిగే హక్కు లేదు...
పాలమూరు (మహబూబ్‌నగర్) : కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ఏ మాత్రం లేదని... నీతిమాలిన, అన్ని రకాల నేరాలకు పాల్పడని దోషులు ఆ పార్టీల్లో ఉన్నారని బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీది ఐరన్ లెగ్ అని.. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే టీడీపీ, కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడి టీఆర్ఎస్లో చేరడం సిగ్టుచేటన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఏదై నా ప్రత్యామ్నాయ పార్టీ ఉందంటే కేవలం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కేసీఆర్ ఏ రోజు గొంతు విప్పలేదని.. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ కోసం పోరాడింది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవాచ ఏశారు. కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని ప్రజలను ఆయన కోరారు. పాలమూరు నుంచి వందల ఎడ్ల బండ్లతో నీటి కోసం, తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు. కౌరవులు వంద మంది ఉన్నా పాండవుల విజయం ఎలా సాగిందో.. తెలంగాణలో విజయం బీజేపీ పక్షాన ఉంటుందన్నారు. 15న అమిత్‌షా సభ ఈనెల 15న మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నిక శంఖారావం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అ మిత్ షా పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన పాలమూరు నుంచే ఎన్నికల శం ఖారావం పూరించనున్నారని చెప్పారు. ఈ సభ కో సం ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ జరుగుతుందన్నారు. అయితే, ఇటీవల టీఆర్ఎస్ దౌర్జన్యంగా బస్సులు, ప్రైవేట్ వాహనాలు తీసుకున్నట్లు కాకుం డా చాలా క్రమశిక్షణతో తమ కార్యకర్తలు వస్తారని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆట ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు నాగూరావు నమాజీ, రతంగ్ పాండురంగారెడ్డి, శాంతకుమార్, పడకుల బాలరాజు పాల్గొన్నారు. ఎంవీఎస్ కళాశాల మైదానం పరిశీలన ఈనెల 15న బీజేపీ ఎన్నికల శంఖారావం సభ జరగనున్న ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని కిషన్‌రెడ్డి పరిశీలించారు. సభా వేదిక, ఇతరత్రా ఏర్పాట్లపై నాయకులకు సూచనలు చేశారు. -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ది అనైతిక పొత్తు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ సిద్ధాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును తిప్పికొట్టాలని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటనతో రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆనాటి రజాకార్ల పాలనను అక్బరుద్దీన్ మళ్ళీ తెరపైకి తీస్తున్నారని అన్నారు. ఎంఐఎం సీట్లలో టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే ఎంఐఎం ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రకటన చేస్తోందని, టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఓవైసీ సోదరులేనని పేర్కొన్నారు. 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 15న బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. నాటికి నేటికి పరిస్థితి ఏమి మారిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీజేపీ అభ్యుర్ధులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. -
'మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకున్నారు'
హైదరాబాద్: విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ నేత కె.లక్ష్మణ్ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన యాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ అమ్మ వారికి లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్‌తో కలిసి కేసీఆర్ విమోచన దినం నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకుని కేసీఆర్ ఉరేగుతున్నారన్నారు. లక్ష్మణ్ చేపడుతున్న తెలంగాణ విమోచన యాత్రకు అందరు కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రమ్య’ చట్టం తీసుకురావాలి
హైదరాబాద్: మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రమ్య చట్టం తీసుకురవాలని చిన్నారి తండ్రి వెంకటరమణ పేర్కొన్నారు. పంజాగుట్ట ఆక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై రమ్య ప్రాణాలు కోల్పోయి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రమ్య కుంటుంబసభ్యులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ.. 2016 జూలై 1న ప్రమాదం జరిగేతే 9 రోజులపాటు మృత్యువుతో పోరాడిన రమ్య జూలై 9 న ప్రాణాలు విడిచింది. ఒకే కుంటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తప్పతాగి మితిమీరిన వేగంతో కారు నడపడం వలనే తమ కుంటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఉండాలంటే రమ్య యాక్ట్ తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం
దోమలగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తూ అతి ముఖ్యమైన రాష్ట్ర విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ శాసన సభాపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. పీఆర్సీలో 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటి వర కు పీఆర్సీ బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల సాధనకై టీపీయూఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని వాపోయారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదన్నారు. సమస్యలపై స్పందించాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాలక పక్ష ఎమ్మెల్సీలుగా మారారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రెండున్నర ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్ఠు పట్టిందని, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేసినా అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించలేదన్నారు. టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు తీకుళ్ల సాయిరెడ్డి, ప్రధానకార్యదర్శి పాలేటి వెంకట్రావు మాట్లాడుతూ కాంట్రిబ్యూషన్ పింఛన్ విధానం రద్దుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. భాషా పండితులు, పీఇటీలకు పదోన్నతులు కల్పించాలని, 398 వేతనంపై పని చేసిన ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి, సుధాకర్, విష్ణువర్ధన్నెడ్డి, లింగస్వామి, సురేష్, రవీందర్, శ్రీనివాసరెడ్డి, బండి రమేష్, వనం పద్మ, భూపతి, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చీప్ లిక్కర్ పై పునస్సమీక్ష
అంబర్‌పేట : రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టే విషయాన్ని పునస్సమీక్షించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతానని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. చీప్ లిక్కర్‌తో గౌడ కులస్తుల వృత్తిపై ప్రభావం పడే అంశాన్ని సీఎంకు కూలంకుషంగా వివరిస్తామని తెలిపారు. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో ప్రేమ్‌నగర్ గౌడ సంఘ ముఖ్య సలహదారు జి.ఆనంద్‌గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలతో కలిసి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ బలహీన వర్గాల సత్తా చాటిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. అంబర్‌పేటలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ చీప్ లిక్కర్ విషయాన్ని ముఖ్యమంత్రికి నిర్మొహమాటంగా తెలియజేయాలని స్వామిగౌడ్‌ను కోరారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్ గౌడ్, సాంబశివ గౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గౌడ సంఘ నాయకులు జైహింద్ గౌడ్, రాజేందర్పటేల్ గౌడ్, లక్పతి యాదగిరి గౌడ్, నిమ్మల బాలయ్యగౌడ్, లింగం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తొలుపునూరి కృష్ణాగౌడ్, కాసాని రాములుగౌడ్, భాస్కర్‌గౌడ్, వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, రాంచందర్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.