
పంతం నెగ్గించుకున్న ఎంఐఎం
పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను అలాగే ఉంచాలన్న ఆ పార్టీ హుకుంనకు ప్రభుత్వం సరేనంది.
సాక్షి,సిటీబ్యూరో: జిల్లా విభజనలో ఎంఐఎం పార్టీ పంతం నెగ్గించుకుంది. పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను అలాగే ఉంచాలన్న ఆ పార్టీ హుకుంనకు ప్రభుత్వం సరేనంది. దీంతో హైదరాబాద్ జిల్లా యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ (లష్కర్) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నీరుగారింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు–కలెక్టర్ల పాత్ర నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్ అతి పెద్ద జిల్లాగానే ఉండనుంది.
ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ తాజా ప్రతిపాదనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నగరంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అతి కీలకమైన సందర్భంలో.. రెవెన్యూ జిల్లాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని ఒకే జిల్లాగా ఏర్పాటు చేసి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమిస్తే విశ్వనగరం దిశగా అభివృద్ధి సులువవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త జిల్లాలు–కలెక్టర్లు కేవలం కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఇచ్చేందుకే పరిమితం కావాల్సి ఉంటుందని, బీజేపీ నేత కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
శివారు.. ఈస్ట్, వెస్ట్ జిల్లాలు
ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్‌ను విభజించిన తీరులో హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను రంగారెడ్డి తూర్పు (మల్కాజిగిరి కేంద్రం), రంగారెడ్డి అర్బన్ (శంషాబాద్ కేంద్రం) జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నంతో పాటు షాద్‌నగర్ ప్రాంతాన్ని కలపనున్నారు. మల్కాజిగిరి పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలుండే అవకాశం ఉంది.