జడ్జీల పేరిట.. లాయర్‌ ఘరానా మోసం! చివరికీ.. | High Court Lawyer Threats In Land Dispute Case | Sakshi
Sakshi News home page

జడ్జీలను మేనేజ్‌ చేస్తానంటూ.. లాయర్‌ 7 కోట్లు స్వాహా..!

Published Fri, Feb 16 2024 12:07 PM | Last Updated on Fri, Feb 16 2024 12:23 PM

High Court Lawyer Threats In Land Dispute Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూవివాద కేసులో జడ్జీలను మేనేజ్‌ చేస్తానంటూ రూ.7 కోట్లు తీసుకున్న హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణతోపాటు బెదిరింపులకు పాల్పడిన మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలపై ఇటీవల ఐఎస్‌సదన్‌ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం ఈ కేసును  హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

చింతల్‌లోని వాణీనగర్‌కు చెందిన డాక్టర్‌ చింతల యాదగిరి సామాజిక కార్యకర్త. ఈయన తండ్రి మల్లయ్య తన కులానికి చెందిన వారి కోసం ఓ సంఘం ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత యాదగిరి దీనిని పర్యవేక్షిస్తున్నారు. సంఘం కోసం 1982లో బౌరంపేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పట్టాదారుడికి నగదు చెల్లించి ప్రైవేట్‌ సేల్‌ డీడ్‌ ద్వారా స్థలం పొందారు. 2005లో కొందరి కన్ను ఈ స్థలంపై పడింది.

దీనిపై సంఘానికి చెందిన వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, సివిల్‌ దావాలు దాఖలు చేశారు. ఇవి ఫలితాలు ఇవ్వకపోవడంతో యాదగిరి నేతృత్వంలోని కులపెద్దలు సైదాబాద్‌లో ఉండే న్యాయవాది వేదుల వెంకట రమణను సంప్రదించగా, హైకోర్టు కేసు నడుస్తోంది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో దాదాపు 18 ఏళ్లు కేసు మూలనపడింది.

మాట్లాడదాం రమ్మని చెప్పి..
కేసు విషయమై మాట్లాడటానికి యాదగిరిని కులపెద్దలతో కలిసి తన కార్యాలయానికి రమ్మని న్యాయవాది వెంకటరమణ చెప్పాడు. దీంతో యాదగిరి 10 మందితో వెళ్లి చర్చించారు. తీర్పు వేగంగా, అనుకూలంగా తెచ్చుకోవడానికి బెంచ్‌లో ఉన్న జడ్జీలను మేనేజ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పి, దీని కోసం వెంకటరమణ రూ.10 కోట్లు అడిగాడు. రూ.7 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని వారంతా నగదుగా అందజేశారు.

కోర్టు ఉత్తర్వులు కూడా వీరికి అనుకూలంగా లేకపోవడంతో భూమిని కోల్పోయారు. వెంకటరమణ తమ ప్రతివాదులతో కుమ్మక్కు అయ్యి, వారి నుంచి 25 కోట్లు తీసుకున్నాడని యాదగిరి, కుల పెద్దలకు తెలిసింది.  దీనికి న్యాయవాది వెంకటరమణ వైఖరే కారణమని భావించిన బాధితులు తమ వద్ద తీసుకున్న మొత్తం నగదు తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారంగా అంతే మొత్తం అదనంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఒత్తిడి చేయగా, రూ.కోటి మాత్రమే వెంకటరమణ తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించకపోగా, వెంకటరమణతోపాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల అనుచరుడు జైకుమార్‌తో పాటు పాతబస్తీకి చెందిన రౌడీలతో బెదిరింపులకు దిగారంటూ యాదగిరి ఐఎస్‌సదన్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద వెంకటరమణ, అహ్మద్‌ బలాల, జైకుమార్‌ తదితరులపై కేసు నమోదై సీసీఎస్‌కు బదిలీ అయ్యింది.

ఇవి చదవండి: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ! వేటు పడింది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement