సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న హరీశ్
హుజూరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుంటే వాటిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దండగ అంటున్నారని.. ఆత్మగౌరవం అంటూ తన పదవికి రాజీనామా చేసిన రాజేందర్ మొసలికన్నీళ్లకు, తియ్యటి మాటలకు హుజూరాబాద్ ప్రజలు ఆగం కావద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడియారాలకు, కుంకుమ భరిణెలకు లొంగవద్దని, న్యాయాన్ని, ధర్మాన్ని చూసి టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
గురువారం హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మహిళలను మరింత బలోపేతం చేసేందుకే ఈ రుణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మహిళలకు ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పదహారు గ్రామాల్లో రూ.3.10 కోట్లతో అన్ని వసతులతో మహిళా భవననాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే పెన్షన్ అందజేస్తామని చెప్పారు.
4 వేల డబుల్ ఇళ్లు పూర్తి చేస్తా..
హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల రాజేందర్ పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తనదని, ఇళ్లు వెంటనే పూర్తి చేయిస్తామని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శాలపల్లి గ్రామంలో సభ ఏర్పాట్లను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని.. 5 బ్లాకులు మహిళలకు, 5 బ్లాకులను ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలన్నారు. వీఐపీలకు, ప్రెస్‌కు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment