పరాజయ సంకేతాలు ఎవరివి? | Shekhar Gupta Article On TRS Government | Sakshi
Sakshi News home page

పరాజయ సంకేతాలు ఎవరివి?

Published Sat, Dec 8 2018 1:02 AM | Last Updated on Sat, Dec 8 2018 1:02 AM

Shekhar Gupta Article On TRS  Government - Sakshi

తెలంగాణలో కేసీఆర్‌ రాజకీయ ప్రచారాన్ని, సంక్షేమాన్ని పునర్నిర్వచించారు. తన ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు తలొక 21 గొర్రెలు అందించారు. రజకులకు వాషింగ్‌ మెషిన్లు అందించారు. మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. రైతుబంధు పథకం గురించి చెప్పాల్సిన పనిలేదు. కొందరు మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. దేశంలో పలు ఎన్నికల అనుభవాలను గమనిస్తే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు.

తెలంగాణలో, దాని రాజధాని హైదరాబాద్‌లో (భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో దానిసొంతం) గోడలపై రాతలను మీరు చదివినట్లయితే వాటిపై ఉన్న రంగును మీరు చూడండి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన పార్టీ టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని గులాబీమయం చేసిపడేశారు. దీన్ని చూస్తే ఈ ఎన్నికల్లో ఒక పార్టీ మాత్రమే పోరాడుతున్నట్లుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నికలను నేను పరిశీలిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ తన కనుచూపు మేరలో ఇంత ఆధిపత్యం చలాయించడాన్ని నేను ఎన్నడూ చూడలేదు.

గుజరాత్‌లో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ అవకాశాలు 20:1గా ఉండగా, తెలంగాణలో కేసీఆర్‌కి 90:1 అవకాశం ఉంటోంది. అయినా మనం ఇప్పటికీ ద్వైదీభావంతోనే ఉంటున్నాం. నా విండో నుంచి కిందికి చూస్తుంటే ఏడు భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. అవన్నీ కేసీఆర్, టీఆర్‌ఎస్‌కి సంబంధించినవే. అన్నీ గులాబీ రంగులో అంటే ఆయన పార్టీ రంగులో ఉన్నాయి. ఇలాంటి  హోర్డింగులు రాష్ట్ర రాజధానిలో 698 ఉన్నాయని నా నమ్మకం. ఆయన ప్రత్యర్థులవి కూడా ఉండవచ్చు కానీ వాటిని నేను ఇంకా చూడలేదు.

ప్రభుత్వం పట్ల అనుకూలత కారణంగా ఆయన తన ప్రత్యర్థులైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి లేక బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇది ఎంత అరుదైన ఎన్నికల ప్రచారం అంటే, కేసీఆర్‌ గత పనితీరుపైనే పోరాటం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌ ఇప్పుడు కొత్త వాగ్దానాలు ఏవీ చేయడం లేదు. కానీ గోడలపై, హోర్డింగులపై పింక్‌ రంగుతో తన గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఉచితాలు, ప్రజాసంక్షేమ చర్యలపై తాను చేసిన పనుల గురించి తెలిపే వివరాలు వీటిలో కనిపిస్తూ రాత్రిపూట చాలా చక్కగా వెలుగుతుంటాయి. ఆయన ప్రత్యర్థులకు ఇవన్నీ పంపే సందేశం ఏమిటి? ‘మీకు సాధ్యమైతే నాతో పోటీ పడండి’.

కేసీఆర్‌ ఆత్మవిశ్వాసం వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో భీకరంగా విరుచుకుపడే శైలిని తలపిస్తుంది. ఆయన స్కీములన్నీ అనుకూలమేనా? తన లోటు బడ్జెట్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందా?  ‘బక్వాస్, సబ్‌ బక్వాస్‌’ (చెత్త, అంతా చెత్తే) అనేది కేసీఆర్‌ లఘు సమాధానం. లోటేమిటి? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక లోటు ఉన్న దేశం ఏది? అమెరికాయేనా? తర్వాత జపాన్‌. మరి చైనా విషయమేంటి? ప్రజలు ఏమీ తెలీకున్నా వాగుతుంటారు..’ ప్రొఫెసర్‌ కేసీఆర్‌ చిన్నపాటి క్లాస్‌ తీసుకున్నారు. ‘ఉచిత’ రాజకీయాలకు తమిళనాడులో ప్రత్యేకించి జయలలిత సుప్రసిద్ధం. కేసీఆర్‌ దాన్ని మరొక స్థాయికి తీసుకుపోయారు. ఇది పనిచేస్తుందా అనేది ఈ ఎన్నికలు తేల్చిపడేస్తాయి.

అయితే ఇలా ఉచితాల అప్పగింతలపై నా అనుమానాలు నా పాఠకులకు సుబోధకమే. బార్మర్‌లోని కెయిర్న్‌ చమురుక్షేత్రం నుంచి వచ్చిన రాయల్టీల కారణంగా వచ్చిన భారీ మొత్తాన్ని కైవసం చేసుకున్న రాజ స్థాన్‌ ప్రభుత్వం 2008–13 సంవత్సరాల్లో ఇలాంటి ఉచిత వస్తువుల సరఫరా విషయంలో దేశానికే ప్రయోగశాలగా మారింది. కానీ ఆ రాష్ట ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై ప్రజల తీవ్ర వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్‌ పార్టీ 163–21 తేడాతో శాసససభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. జయలలిత రెండో దఫా కూడా ముఖ్యమంత్రి కాగానే (తమిళనాడులో ఇది అరుదైన ఘటన) నిరుపేదలు పండుగ చేసుకున్నారు. దాంతో ఆమె పరపతి అమాంతం పెరిగిపోయింది. ఆమె ప్రజలకు ఉచిత మిక్సర్‌ గ్రైండర్స్‌ వంటి వాటిని అందించారు. నిజానికి రెండో దఫా ఎన్నికల్లో ఆమెపై ప్రజా విశ్వాసం 13 శాతం మేరకు పడిపోయింది. ప్రతిపక్షాలు చీలకుండా కలిసి పోటీ చేసి ఉంటే ఆ ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పేది కాదు.

అందుకే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. కానీ కేసీఆర్‌ విషయంలో అలా చెప్పలేం. రెండు అంశాల్లో తనను చూసి గర్వించాలి. పంపకంలో అతడి రికార్డు, ఊహాశక్తి. ఆయన రాష్ట్రంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాదనా పటిమను మీరు చూస్తారు. షాదీ ముబారక్‌ పేరిట మహిళలకు వివాహ సందర్భంగా లక్ష రూపాయల బహుమతిని అందించారు. ఇతరులకు కల్యాణ లక్ష్మినీ ప్రసాదించారు. ఇక ఆయన ప్రకటించిన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం సంచలనాత్మకమైంది. తన తొలి దఫా పాలనలో ఆయన 5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో ఇది అత్యంత ముఖ్యమైనది. హైదరాబాద్‌ సమీపంలోని కొల్లూరులో నిర్మించనున్న 11 అంతస్తుల టవర్‌ ఆయన ఘనకార్యాల్లో ఒకటి కాగా, రెండోది తన నియోజకవర్గమైన గజ్వేల్‌లో హైవే రూపకల్పన చేయడం. మరి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన విషయం ఏమిటని అడిగాను. అది చెత్త పథకం అంటూ కొట్టిపడేశారు. సింగిల్‌ రూమ్‌లో అయినా సరే మహిళలు బట్టలు మార్చుకునే అవకాశం మోదీ ఇచ్చారా అంటూ నిలదీశారు.

అయితే రూ. 7.5 లక్షల వ్యయంతో డబుల్‌ బెడ్రూం పథకాన్ని కేసీఆర్‌ అమలు చేయగలరా? అయితే కేసీఆర్‌ చేపట్టిన కొన్ని సృజనాత్మక ఆవిష్కరణలను పరిగణిద్దాం. ప్రభుత్వ భూములను పంచారు, సిమెం టుపై పన్నును రద్దుచేశారు. ఉచిత ఇసుకను అందించారు, థెర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుండి సబ్సిడీతో కూడిన ఫ్లై యాష్‌తో ఇటుకలు ఉపయోగించడం అభివృద్ధి చేశారు. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ. 1.5 లక్షలను రాబట్టి 7.5 లక్షల వ్యయానికి పెంచారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ముంబైలోని మురికివాడల స్థానంలో నిర్మించిన పునరావాస కాలనీల కంటే ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం ఎంతో మెరుగ్గా ఉంటోంది. ఇంకా ప్రభుత్వ ఉచిత ఆసుపత్రులు కట్టించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ప్రతి తల్లికీ, ఆమె బిడ్డతో పాటు బట్టలు, టాయెలెట్‌ సంబంధిత ఉత్పత్తులను గత మూడు నెలలుగా కేసీఆర్‌ కిట్‌ రూపంలో అందిస్తున్నారు. కరీంనగర్‌ ఆసుపత్రిలో తల్లులు, వారి కుటుంబాలతో మాట్లాడుతూ మే ఇదంతా చూశాం. నిజంగానే వారు కేసీఆర్‌కి కృతజ్ఞత చూపుతున్నారు.

ఇక రైతు బంధు పథకాన్ని ఎవరైనా చాలా నిశితంగా, దురుద్దేశాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ రంగ దుస్థితి జాతీయ వైపరీత్యం. పైగా కనీస మద్దతు ధరలకోసం ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తూ వస్తున్న పలు ఇన్‌పుట్‌ సబ్సిడీలు విఫలమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండు దఫాలుగా ఒక ఎకరాకు రూ.8 వేలను నేరుగా రైతుకు అదజేస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.12,000 కోట్లను వెచ్చించింది. అయితే భూమి సైజుతో పనిలేకుండా ఈ విధానం అమలు చేయడం వల్ల వందఎకరాల భూమి ఉండి వ్యవసాయం చేయని ఆబ్సెంటీ భూస్వాములకు కూడా ఈ పథకం కింద డబ్బులివ్వడం విమర్శలకు దారితీసింది. కానీ ఈ విషయంలో వస్తున్న డేటా మరో కథను చెబుతోంది.

58.3 లక్షలమంది లబ్దిదారులు ఉండగా 14,900 మంది మాత్రమే 50 ఎకరాలు లేక అంతకుమించి కలిగివున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేవలం 1.15 లక్షల మంది అంటే మొత్త లబ్ధిదారుల్లో 2 శాతం మంది మాత్రమే 10 ఎకరాలకు మించి భూమిని కలిగి ఉన్నారు. అంటే ఈ పథకంలో ఎక్కువ మందికి మేలు జరుగుతున్నట్లే కదా. ఇలా అంటున్నందుకు కేసీఆర్‌ ముద్దుగా తిట్టే ‘బక్వాస్‌’ నన్ను క్షమించాలి. కేసీఆర్‌ ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు 21 గొర్రెలు అందించారు. చాకలివారికి వాషింగ్‌ మెషిన్లు అందించారు. మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. అయితే కంచ ఐలయ్య వంటి మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. కానీ ప్రతి ఒక్కరూ ఉచిత పస్తువును ప్రేమిస్తున్నారు. మరి వీటికోసం మాత్రమే వారు ఓటేస్తారా అన్నదే ప్రశ్న. దీనికి రుజువు మిశ్రమ స్వభావంతో ఉంది. కానీ ప్రధానంగా ఇలాంటివి వ్యతిరేక స్వభావంతో ఉంటాయి.

ఉదాహరణకు ప్రజలకు తాయిలాలను భారీగా అందించిన రాజ స్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో కుప్పగూలిపోయింది. ఇక రాయితీ రాజకీయాలకు మారుపేరైన తమిళనాడులో రెండో దఫా అదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం అరుదైన ఘటన. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌తోపాటు గోధుమ పిండి, తృణధాన్యాలను ఉచి తంగా అందించినప్పటికీ అక్కడి అకాలీ–బీజేపీ మిశ్రమ ప్రభుత్వం ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ముఖ్యమంత్రులను రెండోదఫా ఎన్నుకున్న గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ వంటి ప్రభుత్వాలు ఇలా ఉచితాలు, రాయితీల విషయంలో ఛాంపియన్లు కావు. జయలలిత లాగా సబ్సిడీలకు తెరతీసినప్పటికీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీని పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయారు.

ఒకటి మాత్రం నిజం. ఓటర్లు తెలివైనవారు. ఉచితంగా తమకు ఒకసారి ఏదైనా అందిస్తే వాటిని ఎన్నటికీ వెనక్కు తీసుకోలేరని వారికి తెలుసు. 2014 ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ పథకంపై మొరటు వ్యాఖ్యానాలు చేసిన మోదీ తాను గెలిచాక ఆ పథకంలోకి మరిన్ని నిధులను గుమ్మరించిన విషయం మర్చిపోరాదు. పైగా బీజేపీ ఇప్పుడు ఉచి తంగా ఆవులను ఇచ్చే పని పెట్టుకుంది. ప్రజలకు రాయతీలు కల్పించ డంకంటే ప్రజల అస్తిత్వం, రాష్ట్రాలమధ్య వైరుధ్యాలు, మతం, జాతీ యత, ఉపజాతీయతావాదం వంటి సమస్యల పరిష్కారం ఇపుడు చాలా అవసరం. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం అనే భావనను కూడా ఈ ఎన్నికల్లో ఆయన పదే పదే వాడుతుండటం గమనార్హం.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement