
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మైనారిటీ నాయకుడు మహమూద్ అలీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఆయనకు కట్టబెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన రెవెన్యూశాఖ బాధ్యతలను మహమూద్ అలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అలీకి రెండో పర్యాయంలోనూ కీలక మంత్రిత్వశాఖ దక్కింది. దీంతో గత పర్యాయంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నరసింహారెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఈసారి మంత్రివర్గంలో గణనీయమైన మార్పులు ఉంటాయని, పలువురు కొత్తవారికి అవకాశముంటుందని వినిపిస్తోంది.