గురువారం కేబినెట్ భేటీకి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, ఇంద్రకరణ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్ : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ శుక్రవారం అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జె ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్య తలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవీకాలంలో ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. కొణిజేటి రోశయ్య 2010–11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా, వైద్య–ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. ఉభయ సభల్లో వేర్వేరుగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా తాత్కాలిక బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ తుది అంకెలను గురువారం ఖరారు చేశారు. ప్రస్తుతం 4 నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం తెలుపుతున్నా ఏడాది మొత్తానికి బడ్జెట్ లెక్కలను సిద్ధం చేశారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,74,453 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. సాధారణంగా గత బడ్జెట్‌తో పోల్చితే 15% పెంపుతో కొత్త బడ్జెట్ ఉంటుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు చెల్లింపుల పెంపు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి కీలక హామీల అమలు కోసం ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు జరగనున్నాయి.
హామీల అమలుకు ప్రాధాన్యం
అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను విస్తరిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పేర్కొంది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వికలాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచడంతోపాటు మిగిలిన అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచుతామని, బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగిస్తామని, వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పేర్కొంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట రుణమాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల
రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు వంటి హామీలనూ టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు ఉద్యోగ నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సముచితమైన రీతిలో వేతనసవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్ ప్రసంగంలోనే సీఎం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలక్పొడం, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్రాభివద్ధికి ప్రత్యేక పథకాలు రూపకల్పన, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు, వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిన, కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన తదితర అంశాలను టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. వీటి అమలు దిశగా తాత్కాలిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.
జీఎస్టీ బిల్లుకు ఆమోదం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు. విస్తరణ తర్వాత జరిగిన మంత్రివర్గం ఈ తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దులకు, అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపారు. వార్షిక బడ్జెట్‌తోపాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) చట్టానికి గతంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తొలిసారి కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా శనివారం ఉభయ సభలకు సెలవు ఉంటుంది. బడ్జెట్‌పై ఆదివారం ఉభయసభల్లో చర్చ జరుగుతుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment