6 కొత్త ముఖాలు | KCR To Expand Telangana Cabinet Expansion On 19th February | Sakshi
Sakshi News home page

నేడే కేసీఆర్‌ కేబినెట్‌ విస్తరణ

Published Tue, Feb 19 2019 2:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

KCR To Expand Telangana Cabinet Expansion On 19th February - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ కొత్త మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలకు చోటు దక్కింది. నేడు ఉదయం 11.30లకు పదిమంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. గత కేబినెట్‌ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. పాతవారిలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మాత్రమే తాజా జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని వీరిని సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌లో ఆహ్వానించారు. ‘మీరు ప్రభుత్వంలో ఉంటున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కలిసి పనిచేద్దాం’అని సీఎం చెప్పారు. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు సైతం మంత్రులుగా ప్రమాణం చేసే వారికి ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఫోన్‌లో సీఎం మాట్లాడిన వెంటనే వీరంతా ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం కోసం సాధారణ పరిపాలన శాఖ రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త మంత్రులకు నిబంధనల ప్రకారం కేటాయించాల్సిన అధికారిక వాహనాలను సిద్ధం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లకు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ బాధ్యులకు, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపించారు. 

మహిళలు, ఎస్టీలకు నో చాన్స్‌ 
సీఎం కేసీఆర్‌ పదిమంది టీమ్‌లో ఆరుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్‌అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారికి మంత్రులుగా అవకాశం దక్కలేదు. ఎస్టీ వర్గం నుంచి డీఎస్‌ రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), అజ్మీరా రేఖానాయక్‌ (ఖానాపూర్‌)ల పేర్లను పరిశీలించినా చివరికి ఈ వర్గం నుంచి ఎవరినీ ఎంపిక చేయకుండా వాయిదా వేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈసారీ మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. టీఆర్‌ఎస్‌ తరుఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి (మెదక్‌), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్‌ (ఖానాపూర్‌)లలో ఒకరికి తాజా విస్తరణలో మంత్రిగా చాన్స్‌ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరిగింది. జాబితాలో మాత్రం మహిళలకు చోటు దక్కలేదు. 

ఆ ఏడుగురికి అవకాశం లేదు 
గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో ఐదుగురే మళ్లీ మంత్రులుగా ఉండబోతున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ గతంలోనే ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. దీంతో పాతవారిలో ఐదుగురికి మళ్లీ అమాత్యయోగం దక్కింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన మినహా ఏడుగురికి అవకాశం దక్కలేదు. కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, కె.తారకరామారావు, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డిలకు ఈసారి మంత్రులుగా అవకాశం రాలేదు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు. ఈ కారణంగా కేటీఆర్‌కు తాజా విస్తరణలో మంత్రి పదవిని కేటాయించలేదు. అయితే టీఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావుకు మంత్రి పదవి దక్కపోవడంపై టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

రెండు జిల్లాలకు డబుల్‌... 
మంత్రి విస్తరణలో మహబూబ్‌నగర్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ ఈ రెండు జిల్లాలకు ఇదే రకంగా ప్రాతినిథ్యం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో కె.తారకరామారావు, ఈటల రాజేందర్‌ మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లకు చోటు దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నర్‌ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ మంత్రులుగా ఉంటున్నారు. మెదక్‌ ఉమ్మడి సీఎం కేసీఆర్‌ ఒక్కరే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఈ జిల్లా నుంచి తన్నీరు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు తాజా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కలేదు. 
 
గత సంప్రదాయం 
మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్‌ గత సంప్రదాయాన్నే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 2014లో జూన్‌ 2న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అదే ఏడాది డిసెంబరులో మరోసారి విస్తరణ తర్వాత కొత్తగా ఆరుగురిని మంత్రులుగా చేర్చుకున్నారు. ఈ విస్తరణలోనే ఎస్టీ వర్గానికి చెందిన అజ్మీరా చందులాల్, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్‌ ఈసారీ మరోసారీ రెండో విస్తరణలో ఆరుగురికి అవకాశం కల్పించనున్నారు. 
 
ఈటలకు ఆలస్యంగా! 
మంత్రులుగా ప్రమాణం చేసే వారికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఆహ్వానించడం సంప్రదాయం. సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసిన పది మందికి సీఎం ఆఫీస్‌ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఫోన్‌లు చేశారు. తొమ్మిది మందికి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్‌లో సమాచారం అందింది. ఈటల రాజేందర్‌కు మాత్రం రాత్రి 10 గంటల తర్వాత ఫోన్‌లో అధికారిక సమాచారం వచ్చింది. మొదట తొమ్మిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందని అనుకున్నారు. చివరికు రాత్రి పది గంటలకు ఫోన్‌ రావడంతో ఈటల వర్గీయులు ఊరట చెందారు. 
 
మరోసారి విస్తరణలో ఆరుగురు 
లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రగతి భవన్‌ వర్గాలంటున్నాయి. అప్పుడు మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ ఆరుగురు ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. తదుపరి విస్తరణలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, ఎస్టీ వర్గానికి చెందిన ఒకరికి కచ్చితంగా చోటు దక్కనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన ముగ్గురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఎంపికైన వారి వివరాలు
ఆదిలాబాద్‌ : అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) 
నిజామాబాద్‌ : వేముల ప్రశాంత్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) 
కరీంనగర్‌ : కొప్పుల ఈశ్వర్‌ – ఎస్సీ(మాల), ఈటల రాజేందర్‌ – బీసీ (ముదిరాజ్‌) 
మహబూబ్‌నగర్‌: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి – ఓసీ(రెడ్డి), వి. శ్రీనివాస్‌గౌడ్‌ – బీసీ(గౌడ్‌) 
హైదరాబాద్‌: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ – బీసీ(యాదవ) 
రంగారెడ్డి: చామకూర మల్లారెడ్డి – ఓసీ(రెడ్డి) 
నల్లగొండ: గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) 
వరంగల్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు – ఓసీ(వెలమ)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement