సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే(బీఆర్‌ఎస్) ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికే ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చూస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పేదల కోసం కాదు.. పెద్దల కోసం మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్స్ పెట్టారు. చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లింది. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు మూడు రోజులు. ఈ ఏడాది మొత్తంలో అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు మాత్రమే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్లుగా.. పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు.
అసెంబ్లీలో నేడు నాలుగు పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ సమావేశానికి పిలవలేదు. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనేవారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్పీకర్ కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూడు రోజులు సభ జరిగితే.. ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉంది. ప్రజల మీద, ప్రజాస్వామం, చట్ట సభల మీద బీఆర్‌ఎస్ నేతలకు నమ్మకం లేదు. ఈ సభలో బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పినట్టే. ఇటీవల రాష్ట్రంలో వరదల కారణంగా 41 మంది మృతిచెందారు.. వారికి కనీసం అసెంబ్లీలో సంతాపం చెప్పలేదు. వరదలతో చాలా మంది నష్టపోయారు. వారికి కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు. 109 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే కాగ్ రిపోర్టుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో బడ్జెట్ పెరుగుతోంది. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఖర్చులతో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది. నాలుగు కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది అని అన్నారు.
ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో వనమాకు ఊరట..
Comments
Please login to add a commentAdd a comment