Kokapeta landS
-
హెచ్ఎండీఏ ఆదాయం రూ.6945 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, బుద్వేల్లోని భూముల విక్రయాల ద్వారా హెచ్ఎండీఏకు రూ.6,945.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు చోట్ల హెచ్ఎండీఏకు ఉన్న భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించారు. ► కోకాపేటలో మొత్తం 7 ప్లాట్లలో ఉన్న 45.33 ఎకరాల భూమిని విక్రయించారు. ఇందులో ఒక్కో ప్లాట్‌లో 3.60 ఎక రాల నుంచి 9.71 ఎకరాల వరకు ఉంది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోగా, సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తం 7 ప్లాట్లపై రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. ► బుద్వేల్లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా రూ.41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్లోని మొత్తం భూములపై రూ.3625.73 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ► మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. -
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
రియల్ ఎస్టేట్ కోసమే ఎకరం వంద కోట్లని ప్రచారం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే(బీఆర్ఎస్) ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికే ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చూస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పేదల కోసం కాదు.. పెద్దల కోసం మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్స్ పెట్టారు. చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లింది. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు మూడు రోజులు. ఈ ఏడాది మొత్తంలో అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు మాత్రమే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్లుగా.. పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు. అసెంబ్లీలో నేడు నాలుగు పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ సమావేశానికి పిలవలేదు. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనేవారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్పీకర్ కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూడు రోజులు సభ జరిగితే.. ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉంది. ప్రజల మీద, ప్రజాస్వామం, చట్ట సభల మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదు. ఈ సభలో బీఆర్ఎస్కి బైబై చెప్పినట్టే. ఇటీవల రాష్ట్రంలో వరదల కారణంగా 41 మంది మృతిచెందారు.. వారికి కనీసం అసెంబ్లీలో సంతాపం చెప్పలేదు. వరదలతో చాలా మంది నష్టపోయారు. వారికి కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు. 109 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాగ్ రిపోర్టుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో బడ్జెట్ పెరుగుతోంది. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఖర్చులతో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది. నాలుగు కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. -
ఫీల్‌గుడ్ తుపాకీ పేలుతుందా?
ఆర్థిక అసమానతలు మనుషుల మధ్యనే కాదు. ఎకరాల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షలకు ఎకరం లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొన్న సర్కారు వారి పాటలో ‘కోకాపేట’ కనకం మాత్రం వందకోట్ల కిరీటాన్ని ధరించింది. హైదరాబాద్ నగరానికి పడమటి దిక్కున ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకుని ఈ కోకాపేట వేంచేసి ఉన్నది. ఇప్పుడీ కోకాపేట ఒక దేవకన్యలా మెరిసిపోతున్నది. ‘దివినే వదిలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అని పాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఔటర్ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే కోకాపేట తేజస్సు తెలిసి వస్తుంది. బొంగుళూరు నుంచి పెద్దఅంబర్‌పేట మీదుగా కీసర, మేడ్చల్ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా లేరట! గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు వెల్లడైన విషయమిది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఒన్ జీవో (జీవో 111) సామ్రాజ్యం కూడా కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల ఆ ‘విముక్త’ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్ చేస్తూ కోకాపేట ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ అసహజత్వం అర్థం కావాలంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా అవగాహన ఉండాలి. గంటగంటకూ గమ్యాన్ని మార్చుకునే తుపాన్ల సృష్టికి మన బంగాళాఖాతం పెట్టింది పేరు. బెంగాల్, బంగ్లాదేశ్‌లను కలిపి చూసినా వాటి ఉమ్మడి సముద్ర తీరం కంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వంద కిలోమీటర్లు ఎక్కువ. అయినా ‘బే ఆఫ్ బెంగాల్’ అన్నారు గానీ, ‘బే ఆఫ్ ఆంధ్రా’ అనలేదు ఎందుకో! ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుత ప్రసంగం కావచ్చు. బంగాళాఖాతం తుపాన్ల మాదిరిగానే తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా గత ఏడాది కాలంగా రకరకాల మార్పులకు లోనైంది. ఇప్పుడిప్పుడే తీరం దాటి గమ్యం చేరినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సర్వే బృందాలు వర్ధిల్లడానికి అవకాశమిచ్చింది. సెఫాలజీ ఒక ఉపాధి అవకాశంగా విస్తరించింది. రాజకీయ పార్టీలు ఒకటో రెండో మూడో బృందాలను నియమించుకున్నాయి. జాతీయ బృందాలతోపాటు ప్రాంతీయ, స్థానిక టీమ్‌లు కూడా పనిచేశాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా తమ బలం మీద అంచనా కోసం సర్వేలు చేసుకున్నారు. గోడ దూకుదామనుకున్న వాళ్లు కూడా సర్వేలు చేసుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా పార్టీ మారినవారు మళ్లీ వాతావరణ మార్పులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంగా ఈ సర్వే బృందాలు ఇస్తున్న నివేదికలను స్థూలంగా పరిశీలిస్తే, సీట్ల సంఖ్యలో తేడాలు కనబడుతున్నాయే తప్ప, ట్రెండ్‌లో తేడాల్లేవు. ఈ మేరకు సర్వేలు సరిగ్గానే జరిగినట్టు అనుకోవాలి. మొదట్లో బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనబడింది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. ఇంకేముంది కొద్ది రోజుల్లో మిగిలిన పార్టీల్లోని ముఖ్యనేతలంతా బీజేపీలో చేరిపోతారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చాలామంది ప్రగాఢంగా నమ్మారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెమ్మదిగా కమలం వైపు కదులుతున్న సూచనలు కనిపించాయి. కానీ కేసీఆర్ చాణక్యాన్ని అంచనా వేయడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఆ పార్టీకి అత్యంత కీలక నాయకుడైన బీఎల్ సంతోష్ జుట్టును కేసీఆర్ దొరకబుచ్చుకోవడంతో అది చేష్టలుడిగిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వెనుక బీఎల్ సంతోష్ ప్రమేయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిరూపణ చేయగలిగింది. దాని అడుగులు నెమ్మదించాయి. పులి మీద పుట్రలా కర్ణాటక ఫలితాలు. ఇంతటితో ఈ సంవత్సరపు తొలి అంకం సమాప్తం. రెండో అంకంలో కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకోవడం మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫలితాలు అందజేసిన ఆక్సిజన్ అందుక్కారణం. బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విస్తృతి ఎక్కువ. ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీ కూడా! కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిలో చాలామంది బీజేపీతో సౌకర్యంగా ఉండలేరు. కాంగ్రెస్‌తో ఆ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రతి పల్లెలో కాంగ్రెస్ జెండాను ఎత్తుకోవడానికి కనీసం పదిమందైనా ఇప్పటికీ మిగిలే ఉన్నారు. మైనారిటీ ఓటర్లకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ఒక చాయిస్‌గా ఉంటుంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలుంటాయన్న అంచనాలు వెలువడ్డాయి. కొన్ని వలసలు జరిగాయి కూడా! ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ కనీసం 30 సీట్లు గెలుచుకుంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి. మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకో 30 గెలిచినా చాలని అనుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ’ అంటారు. రాజకీయాల్లో అస్సలు జరగవు. కాంగ్రెస్ పార్టీ బలమైన స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెద్దపెద్ద వలలు వేసి కూర్చున్నదనే సంగతి అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటి పోయింది. అంతఃకలహాలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వ లక్షణమే కావచ్చు. కానీ ఇప్పుడున్నంత తీవ్రస్థాయి వైరుద్ధ్యాలు మునుపెన్నడూ లేవని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం ఓడించడానికి కూడా వెనకాడనంత తీవ్రస్థాయిలో వైరుద్ధ్యాలున్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరికి నాయకత్వం అప్పగించినా ఇంకొందరు పార్టీ మారడానికి వెనుకాడని పరిస్థితులున్నాయని చెబుతున్నారు. పార్టీ కీలక నాయకుడే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో కీలక నేత కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. 35 నుంచి 40 స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటూ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక ఇవ్వడంలోనూ, ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాని లీకులివ్వడంలోనూ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తం ఉండవచ్చని సీనియర్ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క కాపురమంతా కలహాల సంతగా సాగుతుండగానే ఏలిన్నాటి శని మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్‌ను చంద్రబాబు తగులుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరిందనుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చివరి రెండు నెలల్లో తలకిందులు కావడానికి ఆ పార్టీకి తెలుగుదేశంతో కుదిరిన పొత్తే కారణమని పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ బాబుకు సన్నిహితుడేనని కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ టీవీ’ అనే న్యూస్ ఛానల్ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నదని చెబుతున్నారు. ఈ ఛానల్ తెలంగాణలో రేవంత్‌కూ, ఏపీలో చంద్రబాబుకూ ప్రచారం చేసిపెడుతున్నది. కాంగ్రెస్‌కు బలమైన స్థావరాలుగా పేరున్న ప్రాంతాల్లో, వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘తానా’ (అమెరికా) సభల్లో రేవంత్ పాల్గొనడం, అక్కడ చేసిన ఉపన్యాసం కూడా కాంగ్రెస్ వర్గాలతోపాటు తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి అనాలోచితంగా చేసిన కామెంట్ కూడా కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారింది. రేవంత్ కామెంట్‌ను తనకు అనుకూలమైన రీతిలో ఎడిట్ చేసి బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టింది. ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదనే మెసేజ్‌ను ఇరవై నాలుగ్గంటలలోపే ప్రతి రైతు చెంతకూ చేరవేసిన బీఆర్ఎస్ తన సంస్థాగత బలాన్ని మరోసారి చాటి చెప్పింది. నష్టనివారణ కోసం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్లలో హడావిడి చేసి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రికార్డులేవో చూపించబోయారు. కానీ రైతులెవరూ దాన్ని పట్టించుకోలేదు. తనకు సరిపోయే కరెంటు వస్తున్నప్పుడు అది ఇరవై నాలుగ్గంటలా? పన్నెండు గంటలా అనే లెక్కలెవరికి కావాలి? చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ వెలవెలబోయింది. కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేమి ఒక కారణమైతే కావచ్చు గానీ గేమ్‌లో చివరి గోల్‌ను కూడా బీఆర్ఎస్ కొట్టిందనేది ఒక వాస్తవం. గతంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో నెలరోజులుగా ఫీల్‌గుడ్ వాతావరణం క్రమంగా ఆవరిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్, బీజేపీల స్వయంకృతాపరాధాలు, వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. బీఆర్ఎస్తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం మేరకే బీజేపీ కొంత వెనక్కు తగ్గిందనే ప్రచారం కూడా బలంగానే ఉన్నది. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ – బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి ఏర్పడితే సహజంగానే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుంది. అది దాని రాజకీయ అవసరం. ఇంకో అతి ముఖ్యమైన విషయం నాయకత్వ సమస్య. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు ప్రతిపక్షాల్లో కంచుకాగడా వేసుకొని వెతికినా ఎవరూ కనిపించరు. ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తాజాగా జరిగిన అన్ని గ్రూపుల సర్వేల్లోనూ వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ గెలిచే సీట్లలో దాదాపు సగం సీట్లు గెలిచి కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందట! బీజేపీ మూడో స్థానంతో సర్దుకోవచ్చంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి రెండు మూడు స్థానాలు మారతాయట! రెండో స్థానంలోకి బీజేపీ చేరుతుంది. ఫీల్‌గుడ్ వాతావరణం మొదలైన తర్వాతనే కేసీఆర్ మరింత దూకుడును పెంచి వరసగా తాయిలాలను ప్రకటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. బొటాబొటీగా కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే ఆ ప్రభావం లోక్‌సభపై కూడా పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత డబుల్ డిజిట్‌ను తాకకపోతే బాగుండదనే ఆభిప్రాయం ఉండవచ్చు. 2018 ఎన్నికల వాగ్దానమైన రైతు రుణమాఫీ కొంతమేరకు చేసిన అనంతరం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ దాన్ని కిందకు దించి పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించారు. చేతివృత్తుల వారికి లక్ష సాయం, మైనారిటీలకు లక్ష సాయం, వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా వరస వరాలను ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం! ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు అది సాధ్యం కాదని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే బాట పట్టారు. పనిలో పనిగా కోకాపేట సమ్మోహనాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎందుకు చేసినట్టు? ఎకరా వందకోట్ల చొప్పున మూడున్నర ఎకరాల బిట్టు కొన్నవాళ్లు ఎన్ని అంతస్థులు కడితే గిట్టుబాటు అవుతుంది? మొత్తం ఎన్ని వేల ఫ్లాట్లు కట్టాలి? చదరపు అడుగుకు ఎంత ధర పెడితే గిట్టుబాటు అవుతుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేయగలిగినవారు వేల సంఖ్యలో వారికి దొరుకుతారా? మూడున్నర ఎకరాల్లో వేల కుటుంబాలుంటే పర్యావరణ సమస్యలు ఏర్పడవా? ఇలాంటివన్నీ మనలాంటి అల్పజీవులకు కలిగే సందేహాలు. ప్రభువుల లెక్క వేరు. బుల్లెట్ దిగిందా లేదా! ‘హైదరాబాద్ షైనింగ్’ అనే ప్రచారం బాగా పనిచేస్తే బుల్లెట్ దిగినట్టే! ఈ షైనింగ్, ఫీల్గుడ్లతో ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఒక్కోసారి ఈ ప్రచారం వికటించవచ్చు. వాజపేయి ప్రభుత్వం కూడా ఫీల్‌గుడ్ తుపాకీ ట్రిగ్గర్ నొక్కి ఎన్నికలకు వెళ్లింది. తుపాకీ పేలలేదు, బుల్లెట్ దిగలేదు. ఈ తుపాకీ పేలుతుందేమో చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు
హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరలు రికార్డ్ బద్దలవుతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ప్లాట్ నెం.10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా రూ.100 కోట్లకుపైనే వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూసింది. ఈ వేలం అనంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక విషయంలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్) చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. గతంలో రాఖీ పండగ కానుకగా తన చెల్లెలు ఇద్దరికీ కోకాపేట భూములను రాసి ఇచ్చేలా సురేఖ చేసిందని ఆయన చెప్పారు. చిరంజీవి కొన్ని ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం అక్కడ కొంత భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడబడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారని ఆయన గతంలో తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో సురేఖానే భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించారని ఆయన చెప్పారు. చిరంజీవికి రాఖీ కట్టిన సమయంలో గిఫ్ట్‌గా ఆ భూమి తాలూకా ఆస్థి పత్రాలను చెల్లెళ్లకు సురేఖ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవినే మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. చెల్లెళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చిన సమయంలో అక్కడ ఎకరం భూమి సుమారు రూ. 30 కోట్లుగా ఉండేది. ఇదే నిజం అయితే.. కోకాపేటలో చిరంజీవికి సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగేది. ఆయన కొన్న సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటి సమయంలో వ్యవసాయం చేసేందుకు కొంత భూమిని ఆయన కొన్నారు. ఇప్పుడు నగరం విస్తరిస్తుంది. దీంతో సిటీకి అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలా కోకాపేటలోని చిరంజీవికి చెందిన భూమలు ఇప్పుడు భారీ ధరనే పలకనున్నాయి. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే దాని విలువ రూ. 1500 కోట్ల పైమాటే. ఇదంతా రామ్ చరణ్ తనయ క్లీంకార వచ్చిన వేళా విశేషం అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా క్లీంకార జాతకం చాలా బాగుందని, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వృద్ధి చెందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. -
కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్ ఏమన్నారంటే...
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ప్రకటించారు. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్ నగర అభివృద్ధి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ, మున్సిపల్ ఉన్నతాధికారులను అభినందించారు. (చదవండి: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు) -
Hyderabad: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఎకరం భూమి అంటే వేలల్లో.. ఆనక లక్షకో, రెండు లక్షలకో వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో మారుమూల కూడా ఇరవై, ముప్పై లక్షలు లేకుంటే భూమివైపు చూసే పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల అయితే కోట్లు పెట్టినా స్థలం దొరకడం కష్టమే. ఇప్పుడు కోకాపేటలో భూముల ధరలు అలాంటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాయి. నియోపోలిస్ లేఅవుట్లో ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండీఏ ఇదే లేఅవుట్లో ఇంతకుముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.60 కోట్ల రేటు పలకగా.. గురువారం నాటి రెండోదశ దాన్ని మించిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థల నుంచి అనూహ్య పోటీ కనిపించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదే అత్యధికమని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. ఎకరానికి రూ.వంద కోట్లకుపైగా ధర పలకడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ చర్చనీయాంశమైందని అంటున్నారు. రెండు విడతలుగా బిడ్డింగ్.. నియోపోలిస్‌లో 7 ప్లాట్లలోని భూములకు గురువారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. హెచ్ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి రూ.35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. ఆన్లైన్ బిడ్డింగ్‌లో తొలి నుంచీ ఉత్కంఠభరిత పోటీ కనిపించింది. కనిష్టంగా ఎకరానికి రూ.67.25 కోట్ల నుంచి గరిష్టంగా రూ.100.75 కోట్ల వరకు ధర పలికింది. సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. గురువారం మొత్తం 45.33 ఎకరాల భూములకు వేలం నిర్వహించగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించినట్టు తెలిపారు. హెచ్ఎండీఏ ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంపై వచ్చిన ఆదాయం కంటే ఇదే ఎక్కువని వివరించారు. ప్రత్యేక అనుమతులతో డిమాండ్ హైదరాబాద్ నగరానికి పడమటి వైపు ఉన్న కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశవిదేశాలకు చెందిన వ్యాపార సంస్థలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ భవన నిర్మాణాలకు సంబంధించి అంతస్తులపై పరిమితి లేదు. అపరిమితంగా అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉండటం.. గృహ, వాణిజ్యం, వ్యాపారం వంటి అన్నిరకాల వినియోగానికి అనుమతి ఉండటం.. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు కోకాపేట్పై దృష్టి సారించడానికి కారణమైంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిర్మించతలపెట్టిన మెట్రో రైల్‌కు నియోపోలిస్ లేఅవుట్ అందుబాటులో ఉండటం మరింత డిమాండ్ పెంచింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీతోపాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్చూన్ 500 కంపెనీలు కూడా నియోపోలిస్ లేఅవుట్‌కు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలతో.. హెచ్ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను సుమారు రూ.300 కోట్లతో భారీ స్థాయిలో, ఉత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ తొలిదశలో ఒకటి నుంచి ఐదో ప్లాట్ వరకు మొత్తంగా 64 ఎకరాలను విక్రయించారు. ప్రస్తుతం 6, 7, 8, 9, 10, 11, 14వ నంబర్ ప్లాట్లలోని 45.33 ఎకరాలను వేలం వేశారు. ఈ ప్లాట్లు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉన్నాయి. నియోపోలిస్ లేఅవుట్ విశేషాలివీ.. ► నియోపోలిస్ లేఅవుట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాల భూమిని అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసమే వినియోగించడం గమనార్హం. ► సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, ఇతర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పున్న అంతర్గత రోడ్లను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, ఇతర సదుపాయాలను సమకూర్చారు. ఇక్కడ కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ తదితర అన్నిరకాల వినియోగానికి ముందస్తు అనుమతులు ఇచ్చారు. ► నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించేందుకు అనుమతి ఉంటుంది. ► ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనేలా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. ప్లాట్ నంబర్–10కు ఎందుకంత క్రేజ్ హెచ్ఎండీఏ గురువారం మొత్తం ఏడు ప్లాట్లను వేలం వేసినా.. అందులో 10వ నంబర్ ప్లాట్‌కు మాత్రం బాగా డిమాండ్ వచ్చింది. 3.60 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థలు కలసి ఏకంగా ఎకరానికి రూ.100.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. ఈ ప్లాట్ మిగతా ప్లాట్ల కంటే ఎత్తులో ఉంటుంది. దీనికి వెనక వైపు నుంచి గండిపేట చెరువు, ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఈ ప్లాట్‌కు పోటాపోటీ వేలం జరిగిందని ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్లాట్‌ను ఆనుకొని ఉన్న 11వ నంబర్ ప్లాట్‌లో 7.53 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఎకరం రూ.67.25 కోట్ల ధరతో ఏపీఆర్ గ్రూప్ సొంతం చేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ప్లాట్ల మధ్య ఎకరానికి రూ.33.5 కోట్ల తేడా ఉండటం గమనార్హం. ప్లాట్–10 స్థలంలో రెండు హైరైజ్ టవర్లను నిర్మించేందుకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇదేకాదు.. ప్రస్తుతం కోకాపేటలో నిర్మితమవుతున్న భవనాల్లో చాలా వరకు ఆకాశ హరŠామ్యలేనని.. ఈ ప్రాంతం మినీ షాంఘైగా మారనుందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. -
కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్ అని!
కోకాపేట ఆంటీ గుర్తుందా? పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని తను చాలా రిచ్ అని చెప్పకనే చెప్తుండేది. తులసి సినిమా చూసిన అందరికీ ఆమె ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కోకాపేట ఆంటీ పాత్రను ఝాన్సీ పోషించింది. ఈ మూవీలోని ఓ డైలాగ్‌లో ఆమె మాట్లాడుతూ.. 'కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడ పెట్టుకోవాలో తెలీనంత డబ్బు వచ్చింది. అందులకేంచి పది లక్షలు తీసి ఈ కోక, నగలన్నీ కొన్నడు మా ఆయన' అని చెప్తుంది. ఇప్పుడీ డైలాగ్ మరోసారి వైరలవుతుంది. ఎకరానికి వంద కోట్లు కారణం.. కోకాపేటలో పెరిగిన భూమి ధరలు. హైదరాబాద్ శివారులో ఉన్న కోకాపేటలో భూముల ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఎకరం ఏకంగా వంద కోట్లు దాటింది. అయితే కోకాపేట అంటే ఎప్పటినుంచో రిచ్ అంటూ తులసి సినిమాలోని ఝాన్సీ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. 'కోకాపేట ఆంటీ చెప్పిందంటే అది నిజమే మరి', 'కోకాపేట అంటే మామూలుగా ఉండదు' అని కామెంట్లు చేస్తున్నారు. కోకాపేటలో రికార్డు ధరలు కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి. నిధుల సమీకరణలో భాగంగా హెచ్ఎండీఏ గురువారం నాడు మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.25 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. చదవండి: బుల్లితెర నటి ఇంట తీవ్ర విషాదం.. పెళ్లయిన ఏడాదికే -
ఎకరానికి వంద కోట్లు.. కోకాపేట వేలంలో ఆల్‌టైం రికార్డు!
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియ సంచలనాలకు నెలవైంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల ధరలు అంచనాలకు మించి పలికాయి. అత్యధిక ధరతో ఆల్ టైం రికార్డు నెలకొల్పడమే కాకుండా.. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డూ నెలకొన్నట్లు తెలుస్తోంది. కోకాపేట భూముల్లోని నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్ఎండీఏ. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.75 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌తోనే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి. ఈ ప్లాట్లలోని భూముల్లో ఎకరానికి.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35 కోట్లుగా ఉంది. అయితే.. కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది. మొత్తంగా 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంది హెచ్ఎండీఏ. కానీ, సగటున రూ.73.23 కోట్లతో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది. -
సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: భూమి కేటాయింపు విషయంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండానే కేటాయించారా అని ప్రశ్నించింది. కేటాయింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. అయితే, బీఆర్ఎస్కు 11 ఎకరాల భూమి కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎకరం దాదాపు రూ.50 కోట్ల మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం రూ.3,41,25,000కే ప్రభుత్వం ముట్టజెప్పిందని.. అలా 11 ఎకరాలకు గానూ దాదాపు రూ.500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోకాపేట్‌లోని 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై కేబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ కాపీని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత విలువైన ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూమి కేటాయించి.. నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఆ వివరాలను ఉంచలేదని సత్యంరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి గుడ్‌న్యూస్ -
కోకాపేట్.. హాట్ కేక్! బంగారం కంటే ఎంతో విలువైన భూమి
హైదరాబాద్: కోకాపేట్ ఇప్పుడు ఒక హాట్‌కేక్. అక్కడ భూమి బంగారం కంటే ఎంతో విలువైంది. మహా నగరానికి పడమటి వైపున ఆకాశ హర్మ్యాలతో అలరారే కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశ విదేశాలకు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రోకు అందుబాటులో ఉ న్న కోకాపేట్లో హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల అమ్మకాలకు సన్నాహాలు చేపట్టింది. విశాలమైన రహదారులు.. అత్యాధునిక సదుపాయాలు సుమారు వంద ఎకరాలకుపైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లో మొదటి దశలో ఎకరం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల చొప్పున 64 ఎకరాలను విక్రయించారు. తాజాగా మరో 7 ప్లాట్లలో విస్తరించిన ఉన్న 45.33 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఈసారి ఎకరా కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆన్లైన్ వేలం ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు కూడా అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. విశాలమైన రహదారులతో, అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీకి చేరువలో ఉన్న నియోపోలిస్ లే అవుట్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోనే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్ట్చూన్ 500 కంపెనీలు ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్ నెలకొంది.పైగా బహుళ వినియోగ అనుమతులు ఉండడంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు నియోపోలిస్ కోసం పెద్ద ఎత్తున పోటీపడనున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 ప్లాట్ వరకు విక్రయించగా ప్రస్తుతం 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లలో భూమిని అమ్మకానికి పెట్టారు. ప్లాట్ల సైజు మేరకు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల భూమి ఉంది.ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటో తేదీ వరకు డిపాజిట్ చెల్లించేందుకు గడువు విధించారు. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ప్రత్యేకతలెన్నో.. సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉన్న నియోపోలిస్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్ల, 36 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ తదితర అన్ని రకాల భవనాలకు అనుమతులు ఇచ్చారు. నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరౖకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించవచ్చు. ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్ సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. ఈ నెల 20న ప్రీబిడ్ మీటింగ్.. నియోపోలిస్ రెండో దశ భూముల వేలంపై ఈ నెల 20న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు తదితర కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సింగిల్‌విండో పద్ధతిలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కోకాపేట భూములను బీఆర్ఎస్ నేతలు కాజేస్తున్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కోకాపేటలో రూ. వేల కోట్ల విలువ చేసే భూములపై సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ కోకాపేట భూములను లూటీ చేసిందని సంచలన కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపించలేదు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకువస్తారు. ఎన్నికల తర్వాత భూములను లాక్కుంటున్నారు. ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారు. బీఆర్ఎస్ ఆఫీసులకు భూములను రూ.100లకే లీజుకు తీసుకుంటున్నారు. కోకాపేటలో రూ.వేల కోట్ల విలువ చేసే భూములను ఒక సంస్థ పేరుతో బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్నారు. 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శికి రూ. 40కోట్లకు ఇచ్చారు. గజానికి రూ.1.10 లక్షల విక్రమానికి హెచ్ఎండీఏ నోటీసు ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థలం తీసుకున్నా ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ కోకాపేట భూములను లూటీ చేసింది. దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ వదిలిపెట్టదు. అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలి. ఆ స్థలం కోసం బీజేపీ పోరాటం చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతోంది. డబ్బుల కోసమే సీఎం కేసీఆర్ 111 జీవోను రద్దు చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: 111 జీఓ రద్దు ఎఫెక్ట్.. ఇక నో ఫాం హౌస్..! -
Kokapet lands: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌దే సేల్‌డీడ్ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని కోకాపేట నియోపోలిస్ భూములను హెచ్ఎండీఏ ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించి వేలం వేసినట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఈ–వేలంతో సమకూరిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీకి జమయ్యాయని వివరించింది. నియోపోలిస్ స్థలాల వేలం బాధ్యతలను హెచ్ఎండీఏ నిర్వహించిందని, స్థలాలను దక్కించుకున్న సంస్థలకు సేల్‌డీడ్ చేయించే బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌దే అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివేనని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో భూముల అమ్మకానికి జూలైలో ఆన్లైన్ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లో ఈ మేరకు ఈ–వేలంలో ప్లాట్లు భారీ రేట్లకు అమ్ముడుపోయా యి. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 8 ప్లాట్లను విక్రయానికి ఉంచగా, వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించారు. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు గుర్తింపు వచ్చింది. -
కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే..
సాక్షి, మణికొండ: నగర శివారులో ఐటీ జోన్‌కు, ఔటర్‌రింగ్ రోడ్డుకు పక్కనే ఎత్తైన కొండలుగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టుగా ఉండి చూపరులను ఇట్టే ఆకట్టుకునేవి కోకాపేట కొండలు. ప్రకృతి, రాతి ప్రేమికులను ఆకట్టుకోవటంతో పాటు వందలాది రాతి పనుల కార్మికులకు ఉపాధిని చూపటం, అనేక పక్షి, వృక్ష జాతికి నెలవుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొండల్లో సగభాగం, పక్కనే ఉన్న భూములను వేలం వేయడంతో రికార్డు స్థాయిలో ఎకరం రూ.14.25కోట్లు పలికాయి. దీంతో వాటిల్లో కొంత మేర కొండలు పోయి అద్దాల మేడలు లేచాయి. రూపురేఖలు కోల్పోతున్న కోకాపేట గుట్టలు ఇటీవల కోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావటంతో మిగిలిన మరింత భూమిని ఇటీవల వేలం వేయడంతో కొనుగోలుదారులు అత్యధికంగా ఎకరం రూ.56కోట్ల వరకు పోటీ పడికొన్నారు. వాటి పక్కనే కొన్ని కులసంఘాలకు భూములను కేటాయించారు. ఇంకేముంది అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారికి హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం కొండలను చదును చేయడం, రోడ్లు, తాగునీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు చూడముచ్చటగా ఉన్న రాతి కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గతంలో కొనుగోలు చేసిన సంస్థలతో పాటు హెచ్ఎండీఏ వారు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్ -
దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ ఇన్ఫ్రా జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ‘క్రౌన్’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటివరకు దక్షిణ భారతంలో 50 అంతస్తులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానాన్ని భాగ్యనగర ‘క్రౌన్’ సొంతం చేసుకుంది. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్.. హైదరాబాద్‌కు చెందిన సాస్ ఇన్ఫ్రా కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్ పేరిట జీ+57 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. భవనం ఎత్తు 228 మీటర్లు. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్మెంట్ విస్తీర్ణాలుంటాయి. ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించామని సాస్ ఇన్ఫ్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 60–70 యూనిట్లు విక్రయమయ్యాయని.. 2025 తొలి త్రైమాసికం నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా రానున్నట్లు చెప్పారు. ♦నానక్‌రాంగూడలో మూడు బేస్మెంట్లు 32 అంతస్తులలో ఆక్రోపోలిస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సుమధుర నిర్మాణ సంస్థ.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+44 అంతస్తుల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 5.06 ఎకరాల విస్తీర్ణం 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఒలంపస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో 854 యూనిట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.7,499లుగా నిర్ణయించామని సుమధుర వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు. చదవండి : Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ ఎక్కడ వస్తున్నాయంటే? ♦నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వస్తున్నాయి. ♦ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణమని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే ఈ తరహా నిర్మాణాలే సరైనవి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో నిర్మాణాలు కేవలం 20 శాతం లోపు ఉండటం మంచి పరిణామం. ఫలితంగా మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. హైరైజ్ ఉన్న చోట అభివృద్ధి.. హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయి. ల్యాండ్‌మార్క్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్ కపుల్స్ ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారని సుమధుర సీఎండీ మధుసూదన్ తెలిపారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే? ♦సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. ♦హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ♦ప్రతి అంతస్తుని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి. ♦ఆయా భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి. ట్రాఫిక్ అసెస్మెంట్ను పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే అనుమతులను జారీ చేయాలి. లాభాలు ఏంటంటే? ♦ఎత్తైన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, విధానపరమైన నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన ♦వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ♦ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. చుట్టూ పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ♦ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ♦ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు. -
భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకు మేలు చేశామన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను తగ్గించలేదు.. కల్పిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వేలం పారదర్శకంగా జరిగిందని పునరుద్ఘాటించింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని పేర్కొంది. భూముల వేలానికి కొందరు ప్రతిపాదిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం సరికాదని స్పష్టం చేసింది. ఆ పద్ధతి పోటీ కొందరికే అవకాశం లభిస్తుందని వివరించింది. భూముల వేలంపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంతో దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే ఈ భూముల వేలంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భూముల వేలంతో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. వేలంపై మరికొందరు కూడా విమర్శలు చేయడంతో ప్రభుత్వం స్పందించి పై ప్రకటనను విడుదల చేసింది. -
రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేట భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త గా ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. పార్ల మెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఎంపీ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటు సభ్యుడిగా సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడం తన హక్కు అని, దీన్ని కాపాడేలని కోరారు. భట్టితో సహా పలువురు నేతలు కోకాపేట భూముల పరిశీలనకు టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముం దుజాగ్రత్తగా రేవంత్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆలిండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మాజీమంత్రి షబ్బీర్ అలీని వారి ఇళ్లలోనే పోలీసులు నిర్బంధించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ పోలీసుల కళ్లు గప్పి ఢిల్లీ వెళ్లిపోయారు. మాకేం అభ్యంతరం లేదు: ఏసీపీ రేవంత్ గృహనిర్బంధంపై హైదరాబాద్ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ వెల్లడించారు. కోకాపేట భూముల విషయంలో ఆందోళన నిర్వహించా లని కాంగ్రెస్ పిలుపునిచ్చినందునే రేవంత్ ఇంటి ముందు పోలీసులను ఉంచామని పేర్కొన్నారు. మేం అధికారంలోకి వస్తే తీసుకుంటాం.. కోకాపేటలో భూములు కొన్న కంపెనీలను వదిలిపెట్టేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను తిరిగి తీసుకుంటామని చెప్పారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ బంధువులు, సన్నిహితులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు: మాణిక్యం సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్టును ఏఐసీసీ తీవ్రంగా ఖం డించింది. సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్‌కు వచ్చే సభ్యుడిని అడ్డుకోవడం సరికా దని ధ్వజమెత్తారు. రేవంత్ అక్రమ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోకాపేట భూముల సందర్శనకు ఈరోజు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులు మొహరించారు. రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట వేలం భూముల వద్ద నిరసన నేపథ్యంలో వీరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు ప్లాన్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కోకాపేట భూముల వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు. కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి. -
కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
బౌద్ధనగర్ (హైదరాబాద్): కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ వేలంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్రమ సంపాదన పెరిగిందని ఆరోపించారు. శనివారం పార్శిగుట్టలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విపక్షాలను పక్కదోవ పట్టించడానికి వేలంలో వచ్చిన డబ్బులను దళిత సాధికారిత కోసం ఉపయోగిస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వెలమ, కమ్మ అగ్రకులాల ఆత్మగౌరవ భవనాలకు హైటెక్ సిటీలో కోట్లు విలువైన భూములు కేటాయించి బీసీ, మైనార్టీలకు కొండగుట్టల్లో ఎలా కేటాయిస్తారని సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రజల్లో అసమానతలు పెరుగుతాయన్నారు. దళితుల్లో ఉన్న 59 ఉప కులాల వారికి ఒక సెంటు భూమి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించలేదని పేర్కొన్నారు. నగర శివార్లలోని 200 ఎకరాల్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం భూమిని కేటాయించాలని కోరారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితుల సాధికారిత ముందుకు సాగిందా, వెనక్కి వెళ్లిందా? అనే అంశంపై ఈ నెల 22న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
‘కోకాపేట’కు కోట్లకు కోట్లు: ఒక్క ఎకరం రూ.60 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది. అప్పుడు మిగిలిపోయిన ప్లాట్ కోకాపేట భూములకు హెచ్ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్ గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్ పార్ట్’ ప్లాట్ నంబర్లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధరను కోట్ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్ ధరతో ప్లాట్ నంబర్–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్ ఇంక్రిమెంట్ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు. ఆలస్యమైనా కాసుల వర్షం హెచ్ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలను, ఎంపైర్–1, ఎంపైర్–2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించారు. అప్పుడు కూడా ఎకరానికి అత్యధికంగా రూ.14.25 కోట్ల ధర పలికింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా ఏళ్ల పాటు సాగింది. 2017లో కోకాపేటలోని భూములన్నీ హెచ్‌ఎండీఏవేనని, వాటిని విక్రయించే హక్కు దానికే ఉందని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసింది. అయితే 2007లో వేలం వేసిన 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ కులసంఘాలకు 55 ఎకరాలు కేటాయించారు. మిగిలిన దాదాపు 300 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసిన సువిశాల రోడ్లు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో.. తాజాగా 49.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించారు. కోర్టు వివాదంతో ఇన్నాళ్లూ ఆలస్యమైనా భారీగా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎంవోకు.. కోకాపేట భూముల ఆన్లైన్ వేలానికి వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తెలుసుకుంది. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఎంఎస్టీసీ-ఈ కామర్స్ టెక్నికల్ విభాగ సిబ్బంది నిర్వహించిన ఈ ప్రక్రియను సంస్థ కమిషనర్, పురపాలక శా>ఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పర్యవేక్షించారు. వేలానికి వచ్చిన స్పందనను ఎప్పటికప్పుడు సీఎంవోకు నివేదించారు. కోకాపేట భూములను వేలంలో దక్కించుకోవడానికి దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలతో పాటు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు. పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తాజాగా నిర్వహించిన కోకాపేట భూముల వేలం రుజువు చేసింది. దాదాపు 60 మంది బిడ్డర్లు దేశ విదేశాల నుంచి ఈ వేలంలో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. -
8 ప్లాట్ల విక్రయం.. రూ.2500 కోట్లు వస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మరో భారీ భూ వేలానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియోపొలిస్ లేఅవుట్లోని ప్లాట్లతో పాటు గోల్డెన్ మైల్ లే అవుట్‌లోని ప్లాటును ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర రావడం ఖాయమని ఆ సంస్థ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ లెక్కన రూ.2,500 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తోంది. 8 ప్లాట్ల విక్రయం రూ.2500 కోట్లు వస్తుందని హెచ్ఎండీఏ అంచనా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 1,2,3,12 మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 4, 13, ప్లాట్ ఏ, గోల్డెన్ మైల్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 2/పీ/వెస్ట్ పార్ట్ -
‘కోకాపేట’రూపంలో ప్రభుత్వానికి భారీ బొనాంజా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోకాపేట’రూపంలో భారీ బొనాంజా దక్కనుంది. ఇప్పటికే ఈ దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేట లే–అవుట్ చేయడాన్ని ముమ్మరం చేసింది. అత్యాధునిక వసతులతో కూడిన సువిశాల విస్తీర్ణంలో రోడ్లతో ఇప్పటివరకు నగరంలో ఎక్కడాలేనట్లు సౌకర్యాలను అభివృద్ధి చేసి వేలం వేసే దిశగా అడుగులు వేస్తోంది. 195.47 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి విక్రయించడం ద్వారా 5,850 కోట్ల (ఎకరం రూ.30 కోట్లు) ఆదాయాన్ని రాబట్టే దిశగా పనిచేస్తోంది. హెచ్ఎండీఏ గతంలో చేసిన లే–అవుట్లకు, ఈ కోకాపేట లే–అవుట్‌కు భారీ మార్పులు ఉండేలా అధికారులు చూసుకుంటున్నారు. భవిష్యత్‌లో భారీ అభివృద్ధి జరిగి వాహనాల రాకపోకలు జరిగినా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా రోడ్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు, శంకర్పల్లి రోడ్డుకు ఈ లే–అవుట్ లింక్ ఉండేలా ప్రత్యేక ప్లాన్ చేయడంతో ఈ ప్లాట్లకు మహా గిరాకీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్ప టికే గజం ధర లక్ష ఉందని లెక్కలు వేసుకుంటున్న అధికారులు హెచ్ఎండీఏకు రూ.5,850 కోట్లు వస్తాయంటున్నారు. సమసిన వివాదం... హెచ్ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్–1, 2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా యేళ్లు కొనసాగింది. 2017లో కోకాపేటలోని సదరు భూములన్నీ హెచ్ఎండీఏవే అని, వాటిని విక్రయించుకునే హక్కు దానికే ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసి 634 ఎకరాలు హెచ్ఎండీఏ చేతికి వచ్చాయి. ఇందులో ముందుగా వేలం వేసిన సంస్థలకు 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ సంఘాలకు 50 ఎకరాలు కేటాయించారు. ఇక మిగిలిన 300 ఎకరాల స్థలంలో 195.47 ఎకరాల్లో లే–అవుట్ చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళిక రచించి ఆ మేరకు ముందుకుపోతోంది. ప్రత్యేకతలు.. 5,850 కోట్ల ఆదాయం 195.47 ఎకరాల్లో ప్లాటింగ్ 120–150 ఫీట్లు..భవిష్యత్ రద్దీ మేరకు రోడ్లు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు,శంకర్పల్లి రోడ్డుకు ఈ లే–అవుట్ లింక్. -
కోకాపేట.. వాళ్లిష్టం!
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట భూముల చిక్కుముడి వీడింది. 19 ఏళ్ల క్రితం హెచ్ఎండీఏ వేలం వేసిన 187 ఎకరాల భూముల విషయంలో బిడ్డర్స్‌కు డబ్బులు వెనక్కి ఇచ్చే అవసరం లేదని సుప్రీంకోర్టు హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పును రిజర్వు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటివరకు చెల్లించిన డబ్బులకు సమానంగా భూమి ఇవ్వాలని, లేదంటే గతంలో వేలంపాటలో కోట్ చేసిన ధరకు అనుగుణంగా మిగిలిన డబ్బులు చెల్లిస్తే మొత్తం భూమి కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో సాధ్యమైనంత తొందరగా ఈ విషయాన్ని సెటిల్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. 2007లో 187 ఎకరాల కోకాపేట భూములను వేలం ద్వారా దక్కించుకున్న 15 సంస్థలు రూ.687 కోట్లు చెల్లించాయి. ఆ తర్వాత ఈ భూముల యజమాన్యహక్కులు వివాదాన్ని దాచారంటూ బిడ్డర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా హెచ్ఎండీఏను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు గడప తొక్కడంతో యజమాన్య హక్కులు తేలే వరకు వాయిదాలుగా వస్తున్న ఈ పిటిషన్‌ను కొట్టివేసి తీర్పును రిజర్వ్ చేశారు. గతేడాది సుప్రీంకోర్టులోనే కోకాపేట యజమాన్య హక్కులు కేఎస్బీ అలీకి చెందవని, హెచ్ఎండీఏవేనంటూ తీర్పును ఆధారంగా చేసుకొని తాజాగా కోకాపేట భూముల విషయంలోనూ హెచ్ఎండీఏకే అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఏళ్లుగా పోరాటం.... 2007లో కోకాపేటలోని భూములకు వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్–1, 2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్‌బూమ్ కారణంగా ఎకరం ధర రూ.ఐదు కోట్ల నుంచి 14 కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా రూ.1,755 కోట్ల ఆదాయం వస్తున్నట్టు అప్పట్లో లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కుల వివాదం ఉందని, దీన్ని తమకు చెప్పకుండా హెచ్ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూముల వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుపడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తాము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోకాపేట భూములు దక్కించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం భూమి అమ్మే హక్కు హెచ్ఎండీఏకు ఉందని, మిగిలిన 60 శాతం డబ్బును హెచ్ఎండీఏకు చెల్లించాలంటూ ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే కోకాపేట టైటిల్ వివాదం కొనసాగుతుండడంతో అది తేలాక డబ్బులు ఇచ్చే విషయం ఆలోచిస్తామని హెచ్ఎండీఏ వివరణ ఇచ్చింది. అయితే టైటిల్ వివాదంపై తీర్పు రావడంతో కోకాపేట భూముల విషయంలోనూ హెచ్ఎండీఏకే అనుకూల తీర్పును రిజర్వ్ చేసినట్టుతెలిసింది. -
కోకాపేట భూములు ప్రభుత్వానివే
సాక్షి, హైదరాబాద్ : నిజాం నవాబు వద్ద జాగీర్గార్గా పనిచేసిన నవాబ్ నుస్రత్ జంగ్ బహదూర్–1కి చెందిన కోకాపేట భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. 1948 ఆగస్టు 14 నాటి జాగీర్ రద్దు చట్టం ప్రకారం ఆ భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయని, అందులో కేటాయింపుల మేరకు 623 ఎకరాలు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కే చెందుతాయంటూ తీర్పునిచ్చింది. ఆ భూమిపై తమకే హక్కులు ఉన్నాయంటూ నవాబ్ నుస్రత్‌జంగ్ బహదూర్–1 వారసుల తరఫున కేఎస్బీ అలీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది. వాస్తవానికి ఈ కేసులో మార్చిలోనే తుది వాదనలు ముగియగా.. కోర్టు తుది తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ నెల పదో తేదీన కోకాపేట భూముల నష్ట పరిహారం కేసు విచారణకు రానుండటంతో తీర్పు వెలువరించింది. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు చొరవతో ఈ కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల విలువ దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారసులు లేకపోవడంతో.. నిజాం రాజు వద్ద జాగీర్దార్గా పనిచేసే నవాబ్ నుస్రత్ జంగ్ బహదూర్–1 అధీనంలో కోకాపేటలోని 1,632 ఎకరాల భూమి ఉండేది. ఆయనకు సంతానం లేదు. 1875లో నుస్రత్ జంగ్ మరణించగా.. భూమి బాధ్యతలను ఆయన భార్య తీసుకుంది. అయితే నుస్రత్ సోదరులు ఇద్దరు ఆయనకు సంతానం లేని కారణం చూపుతూ.. ఆ భూమి తమకు ఇవ్వాలంటూ 1906లో నిజాం రాజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు రాజు తిరస్కరించారు. 1916లో నుస్రత్ భార్య కూడా కన్నుమూసింది. తర్వాత వారసులెవరూ లేనందున ఆ భూమిని సర్ఫ్కాస్ట్ ల్యాండ్ (నిజాం సొంత భూములు)గా నిజాం రాజు గుర్తించారు. ఆ భూమి తమకు ఇవ్వాలంటూ నుస్రత్ సోదరులిద్దరు తిరిగి పెట్టుకున్న అభ్యర్థనను అప్పటి అడ్మినిస్ట్రేటర్ పక్కనపెట్టేశారు. ఇక 1948 ఆగస్టు 14న జాగీర్ రద్దు చట్టం, 1358 ఫస్లీని తీసుకొచ్చారు. దీని ప్రకారం నుస్రత్ భూమి అంతా ప్రభుత్వానికే చెందుతుంది. నష్ట పరిహారంతో మొదలు.. 1952లో ఇలాంటి భూములకు సక్సెస్ రైట్ కింద కమ్యూటేషన్ (నష్టపరిహారం) చెల్లించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నుస్రత్ వారసులమంటూ 74 మంది ముందుకొచ్చారు. వారంతా ముంతకబ్ ప్రకారం ఇమామ్స్‌కు అనుగుణంగా వచ్చే రూ.3,900 తీసుకున్నారు. తర్వాత తకెట్ (తక్‌పట్టీ)లు ఇవ్వలేదని వారు ప్రభుత్వానికి విన్నవించడంతో... అప్పటి రెవెన్యూ మంత్రి ‘‘తకెట్ల పైసలు వస్తాయి. భూమిపై హక్కులు మాత్రం ఉండవ’ని స్పష్టం చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన నుస్రత్ సమీప బంధువులు.. వారసులైన తమకే ఆ భూమి హక్కులు చెందుతాయంటూ 1976లో సివిల్‌కోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన న్యాయస్థానం.. పరిహరం చెల్లించవచ్చుకానీ, భూమిని ఇవ్వడానికి వీల్లేదని తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టులో సవాలు చేసినా.. సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. 2002లో మళ్లీ మొదలు... కోకాపేటలోని 1,635 ఎకరాల భూమి నుస్రత్ జంగ్ బహదూర్–1 వారసులైన 207 మందికి చెందుతుందని పేర్కొంటూ.. వారి తరఫున ప్రతినిధిగా కేఎస్బీ అలీ అనే వ్యక్తి 1999లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దానిని స్వీకరించిన న్యాయస్థానం.. ఈ విషయంలో ఏదో ఒకటి నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేఎస్బీ అలీ అభ్యర్థన మేరకు కోకాపేట భూముల చరిత్ర, వివరాలన్నీ సేకరించిన సర్కారు.. జాగీర్ రద్దు చట్టం ప్రకారం నష్ట పరిహారం అడగడానికి వీలుందికానీ, భూమి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనిపై 2002లో మెమోను కూడా జారీ చేసింది. అయితే 2002లో జారీ చేసిన మెమో తప్పుగా ఇచ్చామని.. దాన్ని ఉపసంహరించుకుంటున్నామంటూ 2004 మే 16న హైకోర్టుకు వివరించింది. తర్వాత భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామంటూ జూలై 31న మరో మెమో జారీ అయింది. కానీ తర్వాత వచ్చిన అధికారులు.. ఇందులో మతలబు ఉందని గ్రహించారు. జూలై 31 నాటి మెమోను రద్దు చేస్తూ.. 2002 నాటి మెమోనే సరైనదని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కేఎస్బీ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా జారీ చేసిన మెమోను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వెనక్కి తీసుకుందని పిటిషన్ వేశారు. దానిని పరిశీలించిన న్యాయస్థానం నోటీసు ఇవ్వకుండా రద్దు చేయడం తప్పు అని పేర్కొంది. దానిపై ప్రభుత్వం అప్పీలు చేయగా.. అసలు కేఎస్బీ అలీ, తదితరులకు హక్కులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై కేఎస్బీ అలీ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. అయితే హెచ్ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు బాధ్యత స్వీకరించాక.. వేల కోట్ల విలువ చేసే ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా లీగల్ సెల్ అధికారులను నియమించుకుని కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేశారు. భూముల వేలంతో మరో వివాదం హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు కోకాపేటలో హెచ్ఎండీఏకు కేటాయించిన 630 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ నుస్రత్ జంగ్ వారసుల ప్రతినిధిగా కేఎస్బీ అలీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని 2006 జూలై 14న హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. సరైన డిక్లరేషన్, ఇంజంక్షన్ పొందేందుకు సివిల్ కోర్టును సంప్రదించాలని సూచించారు. దాంతో కేఎస్బీ అలీ ధర్మాసనానికి అప్పీలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కోకాపేట భూమిపై పిటిషనర్‌కు ఎటువంటి హక్కులు లేవంటూ 2007 అక్టోబర్ 26న ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. 2006లో హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్, రిట్ అప్పీల్లను ఉపసంహరించి సివిల్ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు ప్రభుత్వం ఇదే సమయంలో కోకాపేటలోని భూములను వేలం వేసింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు 100 ఎకరాలు, ఎంపైర్ 1, 2 పేరుతో 87 ఎకరాలు కలిపి 187 ఎకరాల భూమిని విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ. ఐదు కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు పలికింది. మొత్తంగా ఈ భూముల విక్రయం ద్వారా రూ.1,755 కోట్లు ఆదాయం వస్తున్నట్టు అప్పట్లో లెక్కించారు. వేలంలో భూములు దక్కించుకున్న 15 సంస్థలు.. రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. హెచ్ఎండీఏ ఈ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసేసింది. కానీ రియల్ బూమ్ పడిపోయి భూములకు డిమాండ్ తగ్గడంతో.. వేలంలో భూములు కొనుగోలు చేసిన సంస్థలు ఎదురుతిరిగాయి. ఆ భూముల యాజమాన్యపు హక్కులపై వివాదం ఉందని.. హెచ్ఎండీఏ దాన్ని తమకు చెప్పకుండా దాచిందని, తమ సొమ్ము తమకు తిరిగి చెల్లించాలని 14 సంస్థలు హైకోర్టులో కేసు వేశాయి. దీనిని విచారించిన సింగిల్ జడ్జి సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును వెంటనే అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సంస్థలు ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హెచ్ఎండీఏకు ఆ భూమిని అమ్మే హక్కు ఉందని, వాటికి సంబంధించి మిగతా సొమ్మును హెచ్ఎండీఏను ఆదేశించింది. దీంతో సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ భూముల వివాదం ఇంకా కొనసాగుతోందని, అది తేలాక డబ్బులిచ్చే విషయాన్ని ఆలోచిస్తామని హెచ్ఎండీఏ పేర్కొంది. తాజాగా యాజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో.. ఈ నెల 10న విచారణకు రానున్న సంస్థల కేసులోనూ స్పష్టత రానుంది. -
అవి మావే...
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సుప్రీంకోర్టుకు నివేదించింది. కోకాపేట భూముల యాజమాన్యపు హక్కుల విషయంలో ఎటువంటి వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు భూములను రిజిస్టర్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా ఆ సంస్థలు ముందుకు రావడం లేదని సుప్రీంకోర్టుకు వివరించింది. వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని, కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ తాజాగా సుప్రీంకోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది. ఇందులో కోకాపేట భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ కౌంటర్లలో పొందుపరించింది. సుప్రీంకోర్టులో గనుక హెచ్ఎండీఏ విజయం సాధిస్తే దానికి దాదాపు వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వివాదం ఇలా... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా తనకు చెందిన భూమి నుంచి 630 ఎకరాలు గతంలో హెచ్ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్-1, 2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ.5-14కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, దీన్ని తమకు చెప్పుకుండా హెచ్ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హెచ్ఎండీఏ సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది. హెచ్ఎండీఏ హడావుడి చేస్తూ మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఆయా సంస్థలకు నోటీసులిచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ ఆయా సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్ఎండీఏని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశారు. టైటిల్ వ్యవహారంలోనూ... కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం కోకాపేటలోని సుమారు 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెం చ్ 2012 జూలైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది.