కోకాపేట గుట్టల్లో శరవేగంగా కొనసాగుతున్న పనులు
సాక్షి, మణికొండ: నగర శివారులో ఐటీ జోన్‌కు, ఔటర్‌రింగ్ రోడ్డుకు పక్కనే ఎత్తైన కొండలుగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టుగా ఉండి చూపరులను ఇట్టే ఆకట్టుకునేవి కోకాపేట కొండలు. ప్రకృతి, రాతి ప్రేమికులను ఆకట్టుకోవటంతో పాటు వందలాది రాతి పనుల కార్మికులకు ఉపాధిని చూపటం, అనేక పక్షి, వృక్ష జాతికి నెలవుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొండల్లో సగభాగం, పక్కనే ఉన్న భూములను వేలం వేయడంతో రికార్డు స్థాయిలో ఎకరం రూ.14.25కోట్లు పలికాయి. దీంతో వాటిల్లో కొంత మేర కొండలు పోయి అద్దాల మేడలు లేచాయి.
రూపురేఖలు కోల్పోతున్న కోకాపేట గుట్టలు
ఇటీవల కోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావటంతో మిగిలిన మరింత భూమిని ఇటీవల వేలం వేయడంతో కొనుగోలుదారులు అత్యధికంగా ఎకరం రూ.56కోట్ల వరకు పోటీ పడికొన్నారు. వాటి పక్కనే కొన్ని కులసంఘాలకు భూములను కేటాయించారు. ఇంకేముంది అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారికి హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం కొండలను చదును చేయడం, రోడ్లు, తాగునీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు చూడముచ్చటగా ఉన్న రాతి కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గతంలో కొనుగోలు చేసిన సంస్థలతో పాటు హెచ్‌ఎండీఏ వారు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment