అవి మావే... | kokapeta Lands Supreme Court in GHMC | Sakshi
Sakshi News home page

అవి మావే...

Published Tue, Nov 26 2013 5:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

kokapeta Lands Supreme Court in GHMC

సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సుప్రీంకోర్టుకు నివేదించింది. కోకాపేట భూముల యాజమాన్యపు హక్కుల విషయంలో ఎటువంటి వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు భూములను రిజిస్టర్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా ఆ సంస్థలు ముందుకు రావడం లేదని సుప్రీంకోర్టుకు వివరించింది.

వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని, కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ తాజాగా సుప్రీంకోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది. ఇందులో కోకాపేట భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ కౌంటర్లలో పొందుపరించింది. సుప్రీంకోర్టులో గనుక హెచ్‌ఎండీఏ విజయం సాధిస్తే దానికి దాదాపు వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
 
వివాదం ఇలా...

రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా తనకు చెందిన భూమి నుంచి 630 ఎకరాలు గతంలో హెచ్‌ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్‌ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్-1, 2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ.5-14కోట్ల వరకు పలికింది.

ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్‌ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, దీన్ని తమకు చెప్పుకుండా హెచ్‌ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి.

వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హెచ్‌ఎండీఏ సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది.

హెచ్‌ఎండీఏ హడావుడి చేస్తూ మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఆయా సంస్థలకు నోటీసులిచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ ఆయా సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్‌ఎండీఏని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశారు.
 
టైటిల్ వ్యవహారంలోనూ...
 
కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం కోకాపేటలోని సుమారు 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెం చ్ 2012 జూలైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ  కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement