Urban Development Institute
-
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రతిపాదన లకు ఆమోదం లభించింది. నవరత్నాలు, పీఎం ఆవాస్ యోజన కింద తొలిదశలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనలను ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయి. ఇదే రీతిలో తరువాతి దశల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనేది ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు అన్నవారు లేకుండా అందరికీ సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలను ఉగాది పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల కింద ఆర్థిక సహాయం అందజేసేలా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్) రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నిధులు సమీకరిద్దామని చెప్పారు. నవరత్నాల పథకాలు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదలకు గృహ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. రాష్ట్రంలో మొదటి దశలో 85 ప్రాజెక్టుల కింద రూ.3 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించిన తరువాత ఆ నివేదిను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు సమర్పించారు. తొలిదశలో 1,24,624 ఇళ్లకు ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పట్టణాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కమిటీ(సీఎస్ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారం నవరత్నాల పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,870 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా కలిపి లబ్ధిదారులకు అందజేస్తుంది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పట్టణగృహ నిర్మాణ సంస్థ ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.గృహ నిర్మాణాలను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఇళ్లు కట్టుకోడానికి ఇదే రీతిలో ఆర్థిక సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
కోతకు ఇసుకతో అడ్డుకట్ట
ఇప్పటి కష్టాలకు రేవులదే ప్రధాన బాధ్యత {పకృతిసిద్ధ మార్పులూ కారణమే పోర్టుల ద్వారా ఇసుక డిపాజిట్ చేయాల్సిందే బీచ్ కోత నివారణకు పూణె నిపుణుల సిఫార్సులు జీవీఎంసీ బృందానికి నివేదిక సమర్పణ సాక్షి, విశాఖపట్నం : బీచ్ కోతకు కారణాలను శోధించే ప్రయత్నం ఓ కొలిక్కి వస్తోంది. ఈ బాధ్యతను పైన వేసుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు సమస్యకు మూలాలు గుర్తించే దిశగా ముందడుగు వేస్తున్నారు. జీవీఎంసీ చొరవతో ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరాభివృద్ధి సంస్థ, పోర్టు, నగరపాలక సంస్థలకు చెందిన ఒక్కో అధికారి ఇటీవల పూణె వెళ్లి అక్కడ కేంద్ర జలశక్తి పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులను సంప్రదించారు. విశాఖలో కోతకు గురైన ప్రాంతాల్ని, అలల గమనాల్ని, సముద్రంలోని ఇసుక తీరు తెన్నులను, పత్రికల్లో వచ్చిన కథనాల్ని అధికారులు చూపించారు. పోర్టుల మోడళ్లను చూపించారు. గత సమాచారం, గణాంకాల ఆధారంగా సమీక్ష అనంతరం పూణె నిపుణులు విశాఖ పరిస్థితిపై ఓ నివేదిక తయారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు వీలుగా ఈ నివేదికను నలుగురు అధికారుల బృందానికి అందజేసినట్టు తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రకృతి.. వికృతి దేశంలోని ఇతర బీచ్‌లలో సైతం ఇటువంటి విపత్తు చోటు చేసుకుంటోందని గమనించిన పూణె నిపుణులు విశాఖ తీరరేఖను వాటితో సరిపోల్చారు. ఇటీవల సంభవించిన తుఫాన్ల వల్ల; ఈశాన్య/నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకే వేళ వాతావరణంలోని మార్పుల వల్ల కూడా ఆర్కే బీచ్‌లోని కురుసుర, గోకుల్ పార్క్ ప్రాంతాల్లో తీరం కోతకు గురైందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుఫాన్ల సమయంలో భారీగా ఇసుక మేటలు వేయడం ఓ కారణమైతే, ఉత్తరం వైపు తరలివెళ్లాల్సిన ఇసుక దక్షిణానికి, దక్షిణం వైపు వెళ్లాల్సిన ఇసుక ఉత్తరానికి మేట వేయడంతో కోత తీవ్రత పెరుగుతోందని గుర్తించారు. కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా సుమారు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిక్షిప్తం (డిపాజిట్) కావాల్సి ఉండగా, వివిధ నిర్మాణాల వల్ల, డ్రెడ్జింగ్ సరిగా లేకపోవడం వల్ల, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కేవలం 50 శాతమే డిపాజిట్ అవుతోందని నిపుణులు గమనించారు. ఇక్కడకు చేరాల్సిన ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోందని (డ్రిఫ్టింగ్ అవుతోందని) గుర్తించారు. దీర్ఘకాలిక పరిష్కార చర్యల వల్లే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్నీ గాబ్రియాన్స్ (పల్చని జియో సింథటిక్ సంచులు), రాళ్లు, జియో బ్యాగ్స్ (ఇసుక నింపే ప్రత్యేక సంచులు) అమర్చాలని సూచించారు. ఆరేళ్ల క్రితం ఏర్పడిన గంగవరం పోర్టు నిర్మాణం వల్ల కూడా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని సూచించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నిర్మాణం సమయంలో రేవులో ఇసుక మేట వేయకుండా తీసుకున్న చర్యలు కూడా ఇప్పుడు కోతను ప్రభావితం చేస్తున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. హెచ్‌పీసీఎల్ వ్యర్థాలను సముద్రంలో విడిచిపెట్టడానికి ఉద్దేశించిన పైప్‌లైన్, ఇసుకను పంప్ చేయడానికి పోర్టు గతంలో నిర్మించిన పైప్‌లైన నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. బీచ్ పరిరక్షణ కోసం రెండు పోర్టులూ ఇసుకను నిక్షిప్తం చేస్తూ ఉండాల్సిందేనని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటేనే తీరం కోతను అడ్డుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సంఘటన స్థలంలో తత్కాలిక రక్షణ చర్యలు చేపట్టామని, నిపుణుల సూచనల ప్రకారం భవిష్యత్తులో శాశ్వత చర్యల్ని చేపడతామని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ తెలిపారు. చెన్నై ఐఐటీ నిపుణుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. -
అనుమతులన్నీ ఆన్లైన్లోనే...
అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లో ‘గ్రీన్‌చానల్’ నెలాఖరు నుంచి ప్రారంభం:మంత్రి మహీధర్‌రెడ్డి అనుమతుల జారీలో జాప్యం నివారణకు కొత్త సేవలు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ల్లో నెలాఖరు నుంచి ‘గ్రీన్‌చానల్’ను అమలు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా ఆన్లైన్ సేవలు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ‘గ్రీన్‌చానల్’ పేరిట ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్రాన్ని గురువారం మంత్రి మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ..దరఖాస్తుల పరిష్కారంలో హెచ్ఎండీఏ వైపు నుంచి జాప్యం జరిగితే, సిబ్బంది తమకు తాముగా స్వీయ జరిమానా విధించుకోవాలని, ఇది తన ఆదేశమని హెచ్చరించారు. గ్రీన్‌చానల్ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకపోతే మళ్లీ 2009 నాటి పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రస్తుతం ఆస్తిపన్ను మదింపు కార్యక్రమాన్ని మొదలు పెట్టామని, విద్యుత్తు పొదుపును అమలు చే స్తున్న వారికి, పర్యావరణ పరిరక్షణకు అనువుగా భవనాలు నిర్మించే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు సర్పంచులు మంత్రి వద్దకు వెళ్లి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ చార్జీల్లో స్థానిక సంస్థలకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చిద్దామని సర్దిచెప్పారు. ఇందుకు మండలాల వారీగా సర్పంచులను ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. 2015 నాటికి గ్రీన్‌చానల్ పూర్తిస్థాయిలో విజయవంతమవ్వాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి ఆకాంక్షించారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఆస్కీ’ సహకారంతో భవిష్యత్‌లో అన్ని రకాల అనుమతులు ఆన్లైన్లో ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు. ప్రస్తుతం లేఅవుట్ దరఖాస్తులను మాత్రమే గ్రీన్‌చానల్‌లో స్వీకరించి 7 రోజుల్లోగా ప్రాసెస్ పూర్తిచేసి ఆమోదమా/తిరస్కారమా అన్నది తేలుస్తామని, ఆపై నిర్ణీత రుసుము చెల్లిస్తే 30 రోజుల్లో అనుమతి పత్రాలు దరఖాస్తుదారు ఇంటికి చేరుస్తామన్నారు. మంత్రి మహీధర్‌రెడ్డి గ్రీన్‌చానల్ బ్రోచర్‌ను ఆవిష్కరించి, కాపీలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, ప్లానింగ్ డెరైక్టర్ వెంకటరత్నం, క్రెడాయ్, అప్రెడా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, వాస్తవానికి హెచ్ఎండీఏలో 2009లోనే గ్రీన్‌చానల్ ప్రారంభించారు. అయితే... పర్యవేక్షణ లోపం వల్ల అమలు కాలేదు. ఇప్పుడు లోపాలు సవరించుకొని మళ్లీ పునఃప్రారంభించారు. -
ఇంకా తేలని లెక్క !
= గడువు ముగిసినా అందని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు =హెచ్ఎండీఏలో వేళ్లూనుకొన్న నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో క్రమబద్ధీకరణకు సంబంధించి లెక్కా పత్రం లేక అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ కింద 65,669, బీపీఎస్ కింద 8676 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 7,656 ఎల్ఆర్ఎస్, 382 బీపీఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది అధికారుల దృష్టికి తెచ్చారు. వాస్తవానికి బీపీఎస్ దరఖాస్తులు 520, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుమారు 10వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై ఆ వివరాలను తెప్పించేందుకు 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి పెంచారు. ఈ నెల 11లోగా ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపాలని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆయా వివరాలను స్థిరీకరించి ఈ నెల 15 తర్వాత ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్లానింగ్ విభాగం అధికారులకు గడువు నిర్దేశించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల లెక్క తేల్చే పనిలో ప్లానింగ్ విభాగం సిబ్బంది బిజీ అయ్యారు. గడువు ముగిసినా... నిర్ణీత గడువులోగా అపరాధ రుసుం చెల్లించిన వారికి సైతం అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2008లో మొదలైన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ప్రక్రియ 2013 మే 31వరకు పలు దఫాలుగా గడువు పెంపుతో కొనసాగింది. బీపీఎస్ కథ ముగియగా... ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, ఉత్తర్వుల జారీకి 2013 నవంబర్ 30వరకు అవకాశమిచ్చారు. గడువు ముగిసే చివరి రోజున హడావుడి చేసిన అధికారులు సుమారు 200లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినా వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇవ్వలేకపోయారు. ఫీజు చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందని పరిస్థితి ఏర్పడింది. అలాగే బీపీఎస్‌కు సంబంధించి గడువులోగా అపరాధ రుసుంతో చెల్లించినప్పటికీ ఆ దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఆదిలోనే నిర్లక్ష్యం : ఆరంభంలో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరించక పోవడం వల్ల అనేక అక్రమాలకు తావు ఇచ్చినట్లయింది. క్రమబద్ధీకరణ ముసుగులో జరిగిన వ్యవహారాలతో అక్రమార్కుల జేబులు నిండగా హెచ్ఎండీఏ ఖజానాకు భారీగా గండి పడింది. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఫెళ్లను తగులబెట్టిన సంఘటనపై విచారణ చేపట్టిన సిబిసిఐడీ దర్యాప్తు కూడా జాప్యం జరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. -
అవి మావే...
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సుప్రీంకోర్టుకు నివేదించింది. కోకాపేట భూముల యాజమాన్యపు హక్కుల విషయంలో ఎటువంటి వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు భూములను రిజిస్టర్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా ఆ సంస్థలు ముందుకు రావడం లేదని సుప్రీంకోర్టుకు వివరించింది. వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని, కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ తాజాగా సుప్రీంకోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది. ఇందులో కోకాపేట భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ కౌంటర్లలో పొందుపరించింది. సుప్రీంకోర్టులో గనుక హెచ్ఎండీఏ విజయం సాధిస్తే దానికి దాదాపు వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వివాదం ఇలా... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా తనకు చెందిన భూమి నుంచి 630 ఎకరాలు గతంలో హెచ్ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్-1, 2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ.5-14కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, దీన్ని తమకు చెప్పుకుండా హెచ్ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హెచ్ఎండీఏ సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది. హెచ్ఎండీఏ హడావుడి చేస్తూ మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఆయా సంస్థలకు నోటీసులిచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ ఆయా సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్ఎండీఏని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశారు. టైటిల్ వ్యవహారంలోనూ... కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం కోకాపేటలోని సుమారు 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెం చ్ 2012 జూలైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది.