Sakshi Editorial Special Story On Kokapet Lands And Telangana Politics - Sakshi
Sakshi News home page

ఫీల్‌గుడ్‌ తుపాకీ పేలుతుందా?

Published Sun, Aug 6 2023 12:41 AM | Last Updated on Sun, Aug 6 2023 3:19 PM

Sakshi Editorial On Kokapet Lands and Telangana Politics

ఆర్థిక అసమానతలు మనుషుల మధ్యనే కాదు. ఎకరాల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షలకు ఎకరం లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొన్న సర్కారు వారి పాటలో ‘కోకాపేట’ కనకం మాత్రం వందకోట్ల కిరీటాన్ని ధరించింది. హైదరాబాద్‌ నగరానికి పడమటి దిక్కున ఔటర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని ఈ కోకాపేట వేంచేసి ఉన్నది. ఇప్పుడీ కోకాపేట ఒక దేవకన్యలా మెరిసిపోతున్నది. ‘దివినే వదిలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అని పాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే కోకాపేట తేజస్సు తెలిసి వస్తుంది.

బొంగుళూరు నుంచి పెద్దఅంబర్‌పేట మీదుగా కీసర, మేడ్చల్‌ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్‌ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా లేరట! గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్‌లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు వెల్లడైన విషయమిది.

హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్‌ ఒన్‌ జీవో (జీవో 111) సామ్రాజ్యం కూడా కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల ఆ ‘విముక్త’ ప్రాంతమంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్‌ చేస్తూ కోకాపేట ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ అసహజత్వం అర్థం కావాలంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా అవగాహన ఉండాలి.

గంటగంటకూ గమ్యాన్ని మార్చుకునే తుపాన్ల సృష్టికి మన బంగాళాఖాతం పెట్టింది పేరు. బెంగాల్, బంగ్లాదేశ్‌లను కలిపి చూసినా వాటి ఉమ్మడి సముద్ర తీరం కంటే ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం వంద కిలోమీటర్లు ఎక్కువ. అయినా ‘బే ఆఫ్‌ బెంగాల్‌’ అన్నారు గానీ, ‘బే ఆఫ్‌ ఆంధ్రా’ అనలేదు ఎందుకో! ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుత ప్రసంగం కావచ్చు. 

బంగాళాఖాతం తుపాన్ల మాదిరిగానే తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా గత ఏడాది కాలంగా రకరకాల మార్పులకు లోనైంది. ఇప్పుడిప్పుడే తీరం దాటి గమ్యం చేరినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సర్వే బృందాలు వర్ధిల్లడానికి అవకాశమిచ్చింది. సెఫాలజీ ఒక ఉపాధి అవకాశంగా విస్తరించింది. రాజకీయ పార్టీలు ఒకటో రెండో మూడో బృందాలను నియమించుకున్నాయి.

జాతీయ బృందాలతోపాటు ప్రాంతీయ, స్థానిక టీమ్‌లు కూడా పనిచేశాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా తమ బలం మీద అంచనా కోసం సర్వేలు చేసుకున్నారు. గోడ దూకుదామనుకున్న వాళ్లు కూడా సర్వేలు చేసుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా పార్టీ మారినవారు మళ్లీ వాతావరణ మార్పులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 

ఏడాది కాలంగా ఈ సర్వే బృందాలు ఇస్తున్న నివేదికలను స్థూలంగా పరిశీలిస్తే, సీట్ల సంఖ్యలో తేడాలు కనబడుతున్నాయే తప్ప, ట్రెండ్‌లో తేడాల్లేవు. ఈ మేరకు సర్వేలు సరిగ్గానే జరిగినట్టు అనుకోవాలి. మొదట్లో బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనబడింది. బీఆర్‌ఎస్‌తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. ఇంకేముంది కొద్ది రోజుల్లో మిగిలిన పార్టీల్లోని ముఖ్యనేతలంతా బీజేపీలో చేరిపోతారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని చాలామంది ప్రగాఢంగా నమ్మారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెమ్మదిగా కమలం వైపు కదులుతున్న సూచనలు కనిపించాయి. కానీ కేసీఆర్‌ చాణక్యాన్ని అంచనా వేయడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఆ పార్టీకి అత్యంత కీలక నాయకుడైన బీఎల్‌ సంతోష్‌ జుట్టును కేసీఆర్‌ దొరకబుచ్చుకోవడంతో అది చేష్టలుడిగిపోయింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వెనుక బీఎల్‌ సంతోష్‌ ప్రమేయాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నిరూపణ చేయగలిగింది. దాని అడుగులు నెమ్మదించాయి. పులి మీద పుట్రలా కర్ణాటక ఫలితాలు. 

ఇంతటితో ఈ సంవత్సరపు తొలి అంకం సమాప్తం. రెండో అంకంలో కాంగ్రెస్‌ పార్టీ జబ్బలు చరుచుకోవడం మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫలితాలు అందజేసిన ఆక్సిజన్‌ అందుక్కారణం. బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విస్తృతి ఎక్కువ. ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీ కూడా! కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిలో చాలామంది బీజేపీతో సౌకర్యంగా ఉండలేరు. కాంగ్రెస్‌తో ఆ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రతి పల్లెలో కాంగ్రెస్‌ జెండాను ఎత్తుకోవడానికి కనీసం పదిమందైనా ఇప్పటికీ మిగిలే ఉన్నారు.

మైనారిటీ ఓటర్లకు బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ కూడా ఒక చాయిస్‌గా ఉంటుంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్దఎత్తున వలసలుంటాయన్న అంచనాలు వెలువడ్డాయి. కొన్ని వలసలు జరిగాయి కూడా! ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లోనే కాంగ్రెస్‌ పార్టీ కనీసం 30 సీట్లు గెలుచుకుంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి.

మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకో 30 గెలిచినా చాలని అనుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ’ అంటారు. రాజకీయాల్లో అస్సలు జరగవు. కాంగ్రెస్‌ పార్టీ బలమైన స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పెద్దపెద్ద వలలు వేసి కూర్చున్నదనే సంగతి అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటి పోయింది.

అంతఃకలహాలు కాంగ్రెస్‌ పార్టీకి వారసత్వ లక్షణమే కావచ్చు. కానీ ఇప్పుడున్నంత తీవ్రస్థాయి వైరుద్ధ్యాలు మునుపెన్నడూ లేవని కాంగ్రెస్‌ నాయకులే చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం ఓడించడానికి కూడా వెనకాడనంత తీవ్రస్థాయిలో వైరుద్ధ్యాలున్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరికి నాయకత్వం అప్పగించినా ఇంకొందరు పార్టీ మారడానికి వెనుకాడని పరిస్థితులున్నాయని చెబుతున్నారు.

పార్టీ కీలక నాయకుడే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో కీలక నేత కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 35 నుంచి 40 స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటూ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నివేదిక ఇవ్వడంలోనూ, ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాని లీకులివ్వడంలోనూ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తం ఉండవచ్చని సీనియర్‌ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒకపక్క కాపురమంతా కలహాల సంతగా సాగుతుండగానే ఏలిన్నాటి శని మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్‌ను చంద్రబాబు తగులుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరిందనుకున్న కాంగ్రెస్‌ పార్టీ అవకాశాలు చివరి రెండు నెలల్లో తలకిందులు కావడానికి ఆ పార్టీకి తెలుగుదేశంతో కుదిరిన పొత్తే కారణమని పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ బాబుకు సన్నిహితుడేనని కాంగ్రెస్‌ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ‘బిగ్‌ టీవీ’ అనే న్యూస్‌ ఛానల్‌ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నదని చెబుతున్నారు.

ఈ ఛానల్‌ తెలంగాణలో రేవంత్‌కూ, ఏపీలో చంద్రబాబుకూ ప్రచారం చేసిపెడుతున్నది. కాంగ్రెస్‌కు బలమైన స్థావరాలుగా పేరున్న ప్రాంతాల్లో, వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘తానా’ (అమెరికా) సభల్లో రేవంత్‌ పాల్గొనడం, అక్కడ చేసిన ఉపన్యాసం కూడా కాంగ్రెస్‌ వర్గాలతోపాటు తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది.

ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి అనాలోచితంగా చేసిన కామెంట్‌ కూడా కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారింది. రేవంత్‌ కామెంట్‌ను తనకు అనుకూలమైన రీతిలో ఎడిట్‌ చేసి బీఆర్‌ఎస్‌ ప్రచారంలో పెట్టింది. ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నదనే మెసేజ్‌ను ఇరవై నాలుగ్గంటలలోపే ప్రతి రైతు చెంతకూ చేరవేసిన బీఆర్‌ఎస్‌ తన సంస్థాగత బలాన్ని మరోసారి చాటి చెప్పింది. నష్టనివారణ కోసం కాంగ్రెస్‌ పార్టీ కొంత ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్‌స్టేషన్లలో హడావిడి చేసి ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయడం లేదంటూ రికార్డులేవో చూపించబోయారు. కానీ రైతులెవరూ దాన్ని పట్టించుకోలేదు. తనకు సరిపోయే కరెంటు వస్తున్నప్పుడు అది ఇరవై నాలుగ్గంటలా? పన్నెండు గంటలా అనే లెక్కలెవరికి కావాలి? చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్‌ దూకుడు ముందు కాంగ్రెస్‌ వెలవెలబోయింది. కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేమి ఒక కారణమైతే కావచ్చు గానీ గేమ్‌లో చివరి గోల్‌ను కూడా బీఆర్‌ఎస్‌ కొట్టిందనేది ఒక వాస్తవం.

గతంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో నెలరోజులుగా ఫీల్‌గుడ్‌ వాతావరణం క్రమంగా ఆవరిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్, బీజేపీల స్వయంకృతాపరాధాలు, వేసుకున్న సెల్ఫ్‌ గోల్స్‌ కూడా ఇందుకు కారణం కావచ్చు. 

బీఆర్‌ఎస్‌తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం మేరకే బీజేపీ కొంత వెనక్కు తగ్గిందనే ప్రచారం కూడా బలంగానే ఉన్నది. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి ఏర్పడితే సహజంగానే కాంగ్రెస్‌ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుంది. అది దాని రాజకీయ అవసరం. ఇంకో అతి ముఖ్యమైన విషయం నాయకత్వ సమస్య. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు ప్రతిపక్షాల్లో కంచుకాగడా వేసుకొని వెతికినా ఎవరూ కనిపించరు.

ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు బీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని తాజాగా జరిగిన అన్ని గ్రూపుల సర్వేల్లోనూ వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్‌ఎస్‌ గెలిచే సీట్లలో దాదాపు సగం సీట్లు గెలిచి కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంటుందట! బీజేపీ మూడో స్థానంతో సర్దుకోవచ్చంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేసరికి రెండు మూడు స్థానాలు మారతాయట! రెండో స్థానంలోకి బీజేపీ చేరుతుంది. 

ఫీల్‌గుడ్‌ వాతావరణం మొదలైన తర్వాతనే కేసీఆర్‌ మరింత దూకుడును పెంచి వరసగా తాయిలాలను ప్రకటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. బొటాబొటీగా కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే ఆ ప్రభావం లోక్‌సభపై కూడా పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత డబుల్‌ డిజిట్‌ను తాకకపోతే బాగుండదనే ఆభిప్రాయం ఉండవచ్చు. 2018 ఎన్నికల వాగ్దానమైన రైతు రుణమాఫీ కొంతమేరకు చేసిన అనంతరం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ దాన్ని కిందకు దించి పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించారు.

చేతివృత్తుల వారికి లక్ష సాయం, మైనారిటీలకు లక్ష సాయం, వీఆర్‌ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా వరస వరాలను ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం! ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు అది సాధ్యం కాదని ఎద్దేవా చేసిన కేసీఆర్‌ ఇప్పుడు అదే బాట పట్టారు. పనిలో పనిగా కోకాపేట సమ్మోహనాన్ని ప్రయోగించారు.

ఈ ప్రయోగం ఎందుకు చేసినట్టు? ఎకరా వందకోట్ల చొప్పున మూడున్నర ఎకరాల బిట్టు కొన్నవాళ్లు ఎన్ని అంతస్థులు కడితే గిట్టుబాటు అవుతుంది? మొత్తం ఎన్ని వేల ఫ్లాట్లు కట్టాలి? చదరపు అడుగుకు ఎంత ధర పెడితే గిట్టుబాటు అవుతుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేయగలిగినవారు వేల సంఖ్యలో వారికి దొరుకుతారా? మూడున్నర ఎకరాల్లో వేల కుటుంబాలుంటే పర్యావరణ సమస్యలు ఏర్పడవా? ఇలాంటివన్నీ మనలాంటి అల్పజీవులకు కలిగే సందేహాలు. ప్రభువుల లెక్క వేరు. బుల్లెట్‌ దిగిందా లేదా! 

‘హైదరాబాద్‌ షైనింగ్‌’ అనే ప్రచారం బాగా పనిచేస్తే బుల్లెట్‌ దిగినట్టే! ఈ షైనింగ్, ఫీల్‌గుడ్‌లతో ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఒక్కోసారి ఈ ప్రచారం వికటించవచ్చు. వాజపేయి ప్రభుత్వం కూడా ఫీల్‌గుడ్‌ తుపాకీ ట్రిగ్గర్‌ నొక్కి ఎన్నికలకు వెళ్లింది. తుపాకీ పేలలేదు, బుల్లెట్‌ దిగలేదు. ఈ తుపాకీ పేలుతుందేమో చూడాలి.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement