మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు  | Telangana is being turned into a heap of debt under KCR: Kishan Reddy | Sakshi
Sakshi News home page

మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు 

Published Tue, Aug 15 2023 2:50 AM | Last Updated on Tue, Aug 15 2023 2:50 AM

Telangana is being turned into a heap of debt under KCR: Kishan Reddy - Sakshi

మాట్లాడుతున్న కిషన్‌ రెడ్డి. చిత్రంలో జయసుధ

సాక్షి, హైదరాబాద్‌:  సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పుతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయం పెంచు కుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద.. ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి, పేద ప్రజల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మాత్రం స్థలం ఉండదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను స్వయంగా అనేక ఉత్తరాలు రాసి రైల్వే టర్మినళ్లకు, చర్లపల్లిలో రైల్వే స్టేషన్‌విస్తరణకు భూమి కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు.  

పార్టీల పేరుతో పంచుకున్నారు.. 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. విలువైన భూములను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పంచుకున్నాయని, కాంగ్రెస్‌ పార్టీకి ఏ ప్రాతిపదికనైతే భూమి ఇచ్చామో, బీఆర్‌ఎస్‌కు అదే ప్రాతిపదికన తీసుకున్నామని సిగ్గు లేకుండా జీవోలో చెప్పుకున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ల అనుచరులు, బినామీల పేర్లమీద భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావితరాల కోసం భూములను రక్షించాల్సి న అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. 4 నెలల తర్వాత అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు భూమి కేటాయింపులకు సంబంధించిన జీవోలను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. భూముల వేలాన్ని కూడా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాగా సోమవారం బీజేపీ కార్యాలయానికి వచ్చిన సినీనటి జయసుధను ఈ సందర్భంగా సత్కరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement