appulabadha
-
అప్పులు తీర్చలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: స్వయం ఉపాధి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండలం రాంచంద్రపురంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుని తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల గిరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు సందీప్‌కుమార్(26) డిప్లొమా వరకు చదివి మధ్యలోనే మానేశాడు. ఇతనికి పెళ్లి కాలేదు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో స్వయం ఉపాధితో ఎదుగుదామని అప్పు చేసి ఆటో కొనుగోలు చేశాడు. దానిపై సంపాదన లేక అప్పు ఎలా తీర్చాలో అని మదన పడేవాడు. దీంతో మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కడుపులో మంటలు భరించలేక తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. సందీప్‌కుమార్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12.20గంటలకు మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పుతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయం పెంచు కుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద.. ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి, పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రం స్థలం ఉండదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను స్వయంగా అనేక ఉత్తరాలు రాసి రైల్వే టర్మినళ్లకు, చర్లపల్లిలో రైల్వే స్టేషన్విస్తరణకు భూమి కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు. పార్టీల పేరుతో పంచుకున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. విలువైన భూములను కాంగ్రెస్, బీఆర్ఎస్లు పంచుకున్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాతిపదికనైతే భూమి ఇచ్చామో, బీఆర్ఎస్కు అదే ప్రాతిపదికన తీసుకున్నామని సిగ్గు లేకుండా జీవోలో చెప్పుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ల అనుచరులు, బినామీల పేర్లమీద భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావితరాల కోసం భూములను రక్షించాల్సి న అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. 4 నెలల తర్వాత అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భూమి కేటాయింపులకు సంబంధించిన జీవోలను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. భూముల వేలాన్ని కూడా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాగా సోమవారం బీజేపీ కార్యాలయానికి వచ్చిన సినీనటి జయసుధను ఈ సందర్భంగా సత్కరించారు. -
అప్పులబాధతో యువకుడి బలవన్మరణం
తనకల్లు(కదిరి): తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన అంజినప్ప(38 సోమవారం ఆత్యహత్య చేసుకున్నట్లు బంధువులు, పోలీసులు తెలిపారు. గాజుల వ్యాపారంతో పాటు నర్సరీలో పని చేస్తుండే అంజినప్ప వ్యాపారం కోసం అప్పులు చేశాడు. అయితే నష్టాలు రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మధనపడుతూ ఉండేవాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని తనువు చాలించినట్లు వివరించారు. గమనించిన స్థానికులు, బంధువులు చికిత్స కోసం హుటాహుటిన తనకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు అక్కడ పరీక్షించిన వైద్యులు నిర్ధరించారు. మృతునికి భార్య అలివేలు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.