సంగారెడ్డి: స్వయం ఉపాధి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండలం రాంచంద్రపురంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుని తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల గిరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు సందీప్‌కుమార్(26) డిప్లొమా వరకు చదివి మధ్యలోనే మానేశాడు. ఇతనికి పెళ్లి కాలేదు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో స్వయం ఉపాధితో ఎదుగుదామని అప్పు చేసి ఆటో కొనుగోలు చేశాడు.
దానిపై సంపాదన లేక అప్పు ఎలా తీర్చాలో అని మదన పడేవాడు. దీంతో మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కడుపులో మంటలు భరించలేక తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. సందీప్‌కుమార్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12.20గంటలకు మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment