
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు.
జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం.
అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.
జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు.
అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.
జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు.
అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది.
బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది.
మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్‌లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి.
కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు.
Comments
Please login to add a commentAdd a comment