చెన్నై: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చురకలు అంటించారు. ప్రధాని మోదీపై ఎందుకంత కోపంతో ఉన్నారంటూ అమిత్ షాను ఉద్దేశించి వెటకారంగా ప్రశ్నించారాయన.
ఆదివారం తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ భేటీలో పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సేలంలో ఇవాళ సీఎం స్టాలిన్ స్పందించారు. ఆయన(షాను ఉద్దేశించి..) తన కార్యకర్తలకు ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నా. కానీ, మోదీ మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఒక తమిళ వ్యక్తి ప్రధాని కావాలనే ఆలోచనే బీజేపీకి ఉంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) లాంటి వాళ్లు ఉన్నారు కదా. వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు సీఎం స్టాలిన్.
ఇక ఇదే సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా స్టాలిన్ స్పందించారు. గతంలో తమిళనాడు నుంచి ఇద్దరు రాజకీయ ప్రముఖులను ప్రధానులు కాకుండా డీఎంకే అడ్డుకుందని షా వ్యాఖ్యానించినట్లు ప్రచారం బయటకు వచ్చింది. ఆ వాదనను ఖండించిన స్టాలిన్.. షా గనుక బయట ఆ ప్రకటన చేస్తే దానికి డీఎంకే సమూలంగా వివరణ ఇస్తుందంటూ ప్రకటించారు. అలాగే.. నిధుల విషయంలో తమిళనాడుపట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిపైనా స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పవార్‌పై అలిగాడా? ఆయన చెప్పడా?
Comments
Please login to add a commentAdd a comment