Prime minister candidate
-
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్‌నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్‌లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
అమిత్ షాకు సీఎం స్టాలిన్ చురకలు
చెన్నై: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చురకలు అంటించారు. ప్రధాని మోదీపై ఎందుకంత కోపంతో ఉన్నారంటూ అమిత్ షాను ఉద్దేశించి వెటకారంగా ప్రశ్నించారాయన. ఆదివారం తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ భేటీలో పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సేలంలో ఇవాళ సీఎం స్టాలిన్ స్పందించారు. ఆయన(షాను ఉద్దేశించి..) తన కార్యకర్తలకు ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నా. కానీ, మోదీ మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక తమిళ వ్యక్తి ప్రధాని కావాలనే ఆలోచనే బీజేపీకి ఉంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) లాంటి వాళ్లు ఉన్నారు కదా. వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు సీఎం స్టాలిన్. ఇక ఇదే సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా స్టాలిన్ స్పందించారు. గతంలో తమిళనాడు నుంచి ఇద్దరు రాజకీయ ప్రముఖులను ప్రధానులు కాకుండా డీఎంకే అడ్డుకుందని షా వ్యాఖ్యానించినట్లు ప్రచారం బయటకు వచ్చింది. ఆ వాదనను ఖండించిన స్టాలిన్.. షా గనుక బయట ఆ ప్రకటన చేస్తే దానికి డీఎంకే సమూలంగా వివరణ ఇస్తుందంటూ ప్రకటించారు. అలాగే.. నిధుల విషయంలో తమిళనాడుపట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిపైనా స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పవార్‌పై అలిగాడా? ఆయన చెప్పడా? -
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’
దాదాపుగా వంద మంది అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో ప్రధాని పదవి పోటీకి సిద్ధమయ్యారు రిషి సునాక్. లిజ్ ట్రస్ రాజీనామాతో సెకండ్ ఛాయిస్‌గా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కే పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ రేసులోకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం వచ్చి చేరారు. సెలవులపై కరేబియన్ దీవులకు(డొమినికన్ రిపబ్లిక్) వెళ్లిన బోరిస్ జాన్సన్.. తాజా రాజకీయ పరిణామాలతో హడావిడిగా లండన్‌కు బయలుదేరారు. అయితే.. ఈలోపే ఆయన రిషి సునాక్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం తనకు ఇవ్వాలని బోరిస్.. రిషి సునాక్‌కు కోరినట్లు లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. ఒకవైపు రూలింగ్ పార్టీ ప్రాబల్యం, జనాదరణ కోల్పోయినందున.. ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని.. తద్వారా 2024 డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో ఓటమి నుంచి కన్జర్వేటివ్ పార్టీని గట్టెక్కించగలనని రిషి సునాక్‌తో బోరిస్ జాన్సన్ చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతానికి డిప్యూటీ పీఎం పదవిని ఆఫర్ చేసిన బోరిస్.. 2024 ఎన్నికల నాటికి కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబడవచ్చని రిషి సునాక్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని.. కాబట్టి ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్ కోరినట్లు టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. అయితే.. బోరిస్ ఆఫర్లను రిషి సునాక్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మరో కథనం ప్రచురించింది టెలిగ్రాఫ్. ఇదీ చదవండి: తర్వాతి వైరస్ పుట్టుక అక్కడి నుంచేనా? Rishi Sunak is expected to reject any offer by Boris Johnson to drop his leadership bid in return for a Cabinet job as two Tory big beasts mull over whether to strike a deal. https://t.co/WyjB4zi7RG — The Telegraph (@Telegraph) October 22, 2022 Rishi Sunak became the first Tory leadership candidate to secure the backing of 100 MPs on Friday night as Boris Johnson’s supporters began warning of a stitch-up. 🔓 This front page story is currently free to read https://t.co/sBwlD3ysls — The Telegraph (@Telegraph) October 22, 2022 ఎక్స్ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు 93 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. టోబియాస్ ఎల్వుడ్ తాను వందవ మద్దతుదారుడినని ప్రకటించడం విశేషం. తద్వారా రిషి సునాక్‌కు పోటీలో నిలబడడానికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది. ఇక.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 44 మంది మద్దతు ఉండగా.. మూడో స్థానంలో పెన్నీ మోర్డాంట్ 21 మంది మద్దతుతో ఉన్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నాం 2గం. వరకు నామినేషన్లకు గడువు ఉంది. అదే రోజు కన్జర్వేటివ్ పార్టీ నేత కోసం ఎన్నిక సైతం జరిగే అవకాశం ఉంది. -
రిషి సునాక్ తొలి అడుగు
లండన్: లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని కోసం అభ్యర్థుల ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవారం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా ట్రస్ కొనసాగనున్న తరుణంలో.. ఈ మధ్యలోనే కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే.. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పటికే వంద మంది టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికే ఆయన ఆ మద్దతును దాటేశారని, తద్వారా ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మొదటి వ్యక్తిగా నిలిచారని స్థానిక మీడియా ప్రకటించింది. ఇక మాజీ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ సైతం రిషి సునాక్‌కు తన మద్దతు ప్రకటించారు. మరో టోరీ ఎంపీ నైగెల్ మిల్స్.. గతంలో ట్రస్‌ను ఎన్నుకుని తప్పు చేశానని, ఈసారి ఆ తప్పు మరోసారి చేయదల్చుకోలేదంటూ రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన 42 ఏళ్ల సునాక్‌కు ఈసారి ఎక్కువగా కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలడన్న నమ్మకం.. ఈసారి సభ్యుల్లో కలిగితే గనుక సునాక్ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. బరిలో సునాక్‌తో పాటు పెన్నీ మోర్డంట్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం నిలబడచ్చని అంచనా. నామినేషన్ల గడువు 24(సోమవారం) ముగియనుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీ మద్దతు సాధిస్తే.. వాళ్ల నుంచి ఇద్దరిని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓటింగ్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఆ ఇద్దరిలో మళ్లీ ఒకరిని ఓటింగ్ ద్వారా తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. ఓటింగ్ ఫలితాలను అక్టోబర్ 28న ప్రకటిస్తారు. ఆ గెలిచిన వ్యక్తిని బ్రిటన్ రాజు ఛార్లెస్-3.. బ్రిటన్ ప్రధానిగా ప్రకటిస్తారు. ఇవేం లేకుండా గడువులోగా ఒక్కరికే వంద మంది ఎంపీల మద్దతు గనుక లభిస్తే.. ఏకగ్రీవంగా ప్రధాని అవుతారు. ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ఇదీ చదవండి: మాజీ ప్రధాని ట్రస్‌కు ఎంత జీతమంటే.. -
ప్రధాని అభ్యర్థి కావాలని ఆశించడంలేదు : బీహార్ సీఎం నితీష్
-
ప్రధాని పదవిపై వ్యామోహం లేదు
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. ప్రాంతీయ పార్టీలతో పాత కూటమి ద్వారా తిరిగి అధికారం నిలబెట్టుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ క్రమంలో.. జాతీయ రాజకీయాల మీద ఆసక్తితోనే నితీశ్ కూటమిని వీడారని, ప్రధాని రేసులో నిలవాలని ఆశపడుతున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలో ఈ ఆరోపణపై ఇవాళ నితీశ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యి.. దేశరాజకీయాలపై చర్చించారు. అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలనే ప్రయత్నం జరుగుతోంది. నా ప్రయత్నమల్లా.. సార్వత్రిక ఎన్నికలనాటికి విపక్షాలను ఒక్కటి చేయడమే. అంతేగానీ.. ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు నిలబెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు’’ అని స్పష్టం చేశారాయన. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ జేడీయూ నేత.. ఎన్సీపీ శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, జనతా దల్ సెక్యూలర్ చీఫ్ హెచ్డీ కుమార్‌స్వామి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. మరికొందరితో భేటీ అయ్యే అవశాలున్నాయి. ఇదీ చదవండి: ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే! -
‘నితీశ్ కుమార్ ఈ జన్మలో ప్రధాని కాలేడు!’
పాట్నా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. పాత మిత్రపక్షాలతో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దల్ యునైటెడ్‌కు(జేడీయూ) మామూలు ఝలక్‌లు తగలడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే ఈమధ్యే బీజేపీలో చేరిపోగా.. తాజాగా ఊహించని రీతిలో మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూ.. పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో జేడీయూపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని కావాలని నితీశ్ కుమార్ కంటున్న కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆర్జేడీతో జేడీయూ సర్వనాశనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లు ఇప్పుడు జేడీయూ నుంచి విముక్తి పొందాయి. త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉన్న జేడీయూను చీల్చడం ఖాయం. అప్పుడు జేడీయూ ముక్త బీహార్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీశ్ భావిస్తున్నట్లు ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం ఈ జన్మలో నెరవేరదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుశీల్ మోదీ. ఇక డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారన్న జేడీయూ చీఫ్ ఆరోపణలను సుశీల్ మోదీ ఖండించారు. రంజన్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. డబ్బుకు లొంగిపోయేంత బలహీనులా వాళ్ల ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్లకా జేడీయూ టికెట్లు ఇచ్చింది? అని సెటైర్లు వేశారాయన. వాళ్లు మొదటి నుంచి ఎన్డీయేలో కొనసాగాలనుకుంటున్నారు. జేడీయూ ఇప్పుడేమో ఎన్డీయేకు దూరం జరిగింది. కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన వాళ్లకు నచ్చలేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అని సుశీల్ మోదీ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: అదే జరిగితే 2024లో సీన్ వేరేలా ఉంటుంది -
బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ గోపూజ
లండన్: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రిషి సునాక్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా లండన్‌లో రిషి సునాక్(42) గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లండన్ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్ తన అధికారిక పేజీలో వివరించింది. అంతేకాదు.. స్వయంగా రిషి సునాక్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫొటోలను ఉంచారు. Who? Rishi Sunak (PM candidate) Where ? London, England What ? Performing Cow worship That’s our rich cultural heritage we must be proud about. तत् त्वम असि = Tat twam asi #Hinduism #Rishisunak #India #London #Hindutva pic.twitter.com/aaKdz9UM5R — Sumit Arora (@LawgicallyLegal) August 25, 2022 ఇదిలా ఉంటే.. చెకర్ ఛాన్స్‌లర్‌గా ఉన్న టైంలో 2020 దీపావళి వేడుకల్లో రిషి సునాక్ పాల్గొన్నారు. లాక్డౌన్ ఆంక్షల నడుమ దీపాలను వెలిగించి వేడుకల్లో ఆయన పాల్గొన్న తీరుపై అక్కడ విమర్శలు ఎదురైనా.. భారత్ నుంచి మాత్రం మంచి మద్దతే లభించింది. ఎక్కడికెళ్లినా భారతీయులు కొందరు తమ సంప్రదాయం, ఆచార వ్యవహారాలను మరిచిపోరని.. రిషి కుటుంబం అందుకు మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) ఇదీ చదవండి: అక్కడ భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
రేప్ వీడియోపై అభ్యంతరం.. తొలగించిన ట్విటర్
రోమ్: దారుణంగా అత్యాచారానికి గురైన ఉక్రెయిన్ మహిళ వీడియోను పోస్ట్ చేసింది ఇటలీ ప్రధాని రేసులో ఉన్న అభ్యర్థి జార్జియా మెలోని(45). దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. ఉల్లంఘనల పేరిట రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు ఆ వీడియోను తొలగించింది ట్విటర్. ఓ న్యూస్ వెబ్సైట్లో వచ్చిన ఆ వీడియోను యధాతధంగా తన ట్విటర్ అకౌంట్లో ఆదివారం రాత్రి పోస్ట్ చేశారామె. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు పరాకాష్టగా పేర్కొంటూ ఆమె ఆ బ్లర్డ్ వీడియోను పోస్ట్ చేశారు. అయితే.. రాజకీయ ప్రత్యర్థులతో పాటు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు.. మెలోనీ పోస్ట్ చేసిన వీడియోను తప్పుబట్టారు. ఇది బాధితురాలి ఉనికిని ప్రపంచానికి తెలియజేయడమే అని, ఆమెను క్షోభపెట్టడమే అవుతుందని వాదించారు. అయితే బాధితురాలికి సానుభూతి తెలిపే క్రమంలోనే తాను ఆ వీడియోను పోస్ట్ చేశానని, ఆమెకు న్యాయం జరిగేలా చూడడమే తన ఉద్దేశమని మెలోనీ తన చర్యను సమర్థించుకున్నారు. అయినప్పటికీ.. మంగళవారం ఉదయం ట్విటర్ ఆ వీడియోను తొలగించింది. ఇక ఈ చర్యపై మెలోనీ నుంచి స్పందన లేదు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. పియాసెంజా నగరంలో 55 ఏళ్ల ఉక్రెయిన్ మహిళపై అఘాయిత్యం జరిగింది. గినియాకు చెందిన ఓ శరణార్థి కాలిబాటపైన ఆమెపై దారుణానికి తెగబడ్డాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే అరెస్ట్ చేసి కేసులో పురోగతి సాధించారు. ఇదిలా ఉంటే.. రోమ్‌లో పుట్టి, పెరిగిన జార్జియా మెలోనీకి జర్నలిస్ట్‌గా, మానవ హక్కుల ఉద్యమకారిణిగా మంచి పేరుంది. సెప్టెంబర్ 25వ తేదీన జరగబోయే ఇటలీ జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరపున మెలోనీ ప్రధాని అభ్యర్థిగా నిలబడబోతున్నారు. జనాల్లో మద్దతు ఆధారంగా ఆమె ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చని పోల్‌సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే.. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై జార్జియా మెలోని చరిత్ర సృష్టిస్తారు. ఇదీ చదవండి: పుతిన్ సన్నిహితుడి కుమార్తె ప్రాణత్యాగానికి ఫలితం! -
రిషి మంచి ప్రధాని అవుతారు
లండన్: భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు మంచి ప్రధాని కాగలరని కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో 48 శాతం అభిప్రాయపడుతున్నట్టు జేఎల్ పార్టనర్స్ సంస్థ సర్వేలో తేలింది. రిషి అత్యధికుల్ని ఆకర్షిస్తున్నారని జేఎల్ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ జాన్సన్ చెప్పారు. 39% మంది విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు మద్దతిచ్చారు. రిషికి గట్టి పోటీగా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 33 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం! బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఆయన వారసుని కోసం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియకు తెర లేవడం తెలిసిందే. ఇప్పటిదాకా రెండు రౌండ్లలో అత్యధిక ఎంపీల మద్దతుతో రిషి రేసులో దూసుకుపోతున్నారు. -
2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’!
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్ని నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం గాలించాయి. చాలా మంది నాయకులు తాము ఆ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే మోదీతో తలపడటం అంటే ప్రకటనలు చేసినంత సులభం కాదు. ఆ విషయం విపక్షాలకు, జనాలకు బాగానే అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగాల్లో ఎన్నికల దంగల్ నడుస్తోది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బెంగాల్లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాజాగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చన్నారు. ఇండియా టూడే కాన్క్లేవ్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందిచారు. ఈ సందర్భంగా డెరెక్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు, మహిళ ప్రధానిగా రావాలని ఎదరుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అంటూ పరోక్షంగా దీదీనే 2024 ప్రధాని అభ్యర్థి అని వెల్లడించారు. మోదీ, మమతల మధ్య అదే తేడా ఇక మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్. ‘‘అసలు వారిద్దరిని ఎలా పోలుస్తాం. రాజకీయ వాతావరణంలో గౌరవనీయులైన ప్రధానిని ఇలా పోల్చడం కరెక్ట్ కాదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు.. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కూడా విమర్శించారు. పార్లమెంట్లో టీఎంసీ లేవనెత్తిన పలు అంశాలపై బీజేపీ ఇంత వరకు సమాధానం చెప్పలేదని డెరెక్ ఓ బ్రెయిన్ మండిపడ్డారు. ‘‘బీజేపీ.. బెంగాల్లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. అరుణ్ జైట్లీ ఉంటే ఇలా జరగనిచ్చేవారు కారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్ జింఖానా బ్యాచ్. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..! -
స్మార్ట్ ఎవరు?
ప్రధానమంత్రి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలంటే? స్నేహితుల జాబితాకంటే.. ఆర్థిక విషయాల్లో వారి అలవాట్లు చూస్తే మేలంటున్నారు కొంతమంది నిపుణులు. మరీ ముఖ్యంగా పెట్టుబడుల తీరుతెన్నులు!! మరి.. మోదీ పెట్టుబడులు ఎక్కడున్నాయి? రాహుల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల సమయంలో అందరి దృష్టి అభ్యర్థుల ఆస్తిపాస్తులపై ఉండటం సహజం. ఇటీవలే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్లు దాఖలు చేయడం, కొంత కాలం క్రితం వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఇరువురి ఆస్తులు, అప్పులతోపాటు పెట్టుబడుల లెక్క కూడా బహిరంగమైంది. నామినేషన్ పత్రాల ప్రకారం చూస్తే.. మోదీ పెట్టుబడుల్లో మ్యూచువల్ ఫండ్స్ అస్సలు లేకపోగా.. రాహుల్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే రాహుల్ పెట్టుబడుల్లో రూ.5.17 కోట్ల (దాదాపు 70 శాతం) విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మొత్తం పది ఫండ్ స్కీముల్లో ఈ పెట్టుబడులు ఉండగా.. ఎనిమిది ఈక్విటీ తరహావి. రెండు హైబ్రిడ్ తరహావి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలానికి ఏడాదికి 15 శాతం వరకూ వడ్డీ సంపాదించి పెడతాయి ఇవి. మొత్తమ్మీద చూసినప్పుడు రాహుల్ తన పెట్టుబడుల్లో 70 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లో, 27 శాతం నగదు రూపంలోనూ, మిగిలిన కొద్ది మొత్తం బంగారం రూపంలో పెట్టుకోవడం చూస్తే రాహుల్ దీర్ఘకాలపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వారని అర్థమవుతుందని ఆర్థికవేత్తలు అంటారు. రుణ పత్రాలే మోదీ పెట్టుబడులు... ప్రధాని మోదీ పెట్టుబడుల్లో 99 శాతం రుణపత్రాలే. ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివి అన్నమాట. నిర్దిష్ట గడువు తరువాత అసలు సొమ్ము తిరిగి ఇచ్చేలా... నిర్ణీత కాలవ్యవధుల్లో వడ్డీ వచ్చేలా ఉంటాయి ఇవి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మోదీ 1.27 కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇలా డబ్బులన్నీ ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల పెట్టుబడిగా పెట్టి ఉంటే మోదీకి మరింత ప్రయోజనం జరిగేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. దాంతోపాటు కొద్దో గొప్పో షేర్లు ఉండటమూ అవసరమన్నది వీరి అంచనా. అయితే వారసులు ఎవరూ లేకపోవడం.. ఇప్పట్లో రిటైరయ్యే అవకాశమూ లేని కారణంగా విశ్రాంత జీవనం గడిపే సమయానికి రుణపత్రాల్లో పెట్టిన డబ్బులు అక్కరకొస్తాయని వివరిస్తున్నారు. బంగారం రూపంలో మోదీ వద్ద ఉన్నది కేవలం 0.83 శాతం మాత్రమే. -
మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?
న్యూఢిల్లీ: విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీవైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. నరేంద్ర మోదీ అధికారం కోల్పోతే ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని 52 శాతం మంది కోరుకున్నారని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాహుల్ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమతా బెనర్జీ నిలిచారు. 44 శాతం మంది ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారు. (ఆ ముగ్గురు కలిస్తే.. యూపీఏదే అధికారం!) బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైపు చాలా తక్కువ మంది మాత్రమే మొగ్గుచూపారు. నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం కాగలరని కేవలం 4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌కు ఐదు శాతం మంది మద్దతు తెలిపారు. మాయావతి ప్రధాని కావాలని 3 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అయితే మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 46 శాతం మంది కోరుకోగా, 34 శాతం మంది రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం) -
‘ప్రధాని రేసులో నితీష్ కుమార్’
పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ తరపున ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ సైతం రేసులో ఉంటారని జేడీ(యూ) స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎన్డీఏలో సవాల్ ఎదురవుతున్నట్టు ఆ పార్టీ సంకేతాలు పంపింది. రాజకీయాల్లో నితీష్ కెరీర్ స్ఫూర్తివంతంగా సాగిందని, బిహార్‌ను ఒంటిచేత్తో అభివృద్ధిపథంలో నిలిపి దేశానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని జేడీ(యూ) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆదివారం పేర్కొన్నారు. ఎన్డీఏ నేతగా ప్రధాని మోదీ నిలిచినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి చర్చకు వస్తే నితీష్ కుమార్ సైతం ప్రదాని రేసులో ఉంటారని రంజన్ వెల్లడించారు. కాగా, ప్రధాని అభ్యర్ధిపై చర్చ అవసరం లేదని జేడీ(యూ) ప్రకటనను తోసిపుచ్చుతూ బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీని స్వయంగా నితీష్ కుమార్ ప్రతిపాదించారని, బిహార్ ప్రజలే ప్రదాని అభ్యర్ధిగా మోదీని బలపరిచారని బీజేపీ ఎంపీ సీపీ ఠాకూర్ అన్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిహార్‌లో మహాకూటమి నుంచి బయటికొచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అభ్యర్థిగా బిహార్ ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రేమ్‌చంద్ర మిశ్రా పేర్కొన్నారు. జేడీ(యూ) ప్రకటనలు చూస్తుంటే ప్రధానిగా మరోసారి మోదీ గెలుపొందే అవకాశాలు లేవని వెల్లడవుతోందన్నారు. -
ప్రధాని పదవికి రాహుల్ అర్హుడే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కాంగ్రెస్ పార్టీయే జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని జాతీయ కూటమిని ఊహించలేమన్నారు. రాహుల్ గాంధీ తమ నేతని, కాంగ్రెస్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తగిన మెజారిటీ సాధిస్తే రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయితే, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల అనంతరం ఏకాభిప్రాయం సాధించిన అభ్యర్థి వైపు కూటమి మొగ్గుచూపుతుందని పేర్కొన్నారు. సంకీర్ణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై సంప్రదింపులు జరుగుతాయని వెల్లడించారు. రాహుల్‌కు ఉన్న నైపుణ్యాలు, అర్హతల దృష్ట్యా ఆయన ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు. రాహుల్‌లో అందరినీ కలుపుకుపోయే గుణంతో పాటు భిన్న రాజకీయ విధానాలున్న నేతల వద్దకూ వెళ్లగలిగే చొరవ ఆయనకుందని ప్రశంసించారు. -
‘తాను ప్రధాని కావాలని రాహుల్ అనలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ప్రకటించి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విపక్షాల్లో చిచ్చు రాజేశారు. స్టాలిన్ ప్రకటనపై పలు విపక్ష పార్టీలు మండిపడుతుండగా, కాంగ్రెస్ నేతలు సైతం వివరణలతో ముందుకొస్తున్నారు. రాహుల్ ఎన్నడూ తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టిన కమల్ నాథ్ పేర్కొన్నారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రధాని పదవిపై తొందరపాటుతో లేరని చెప్పారు. ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు రాహుల్ ఎన్నడూ పెదవివిప్పలేదని..భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపుల అనంతరం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయంపై ఇప్పుడే పేర్ల గురించి కసరత్తు చేయడం తొందరపాటు అవుతుందని అన్నారు. రాహుల్ ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే ప్రతిపాదించడంపై బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్‌ల గైర్హాజరుకు స్టాలిన్ ప్రతిపాదనే కారణమనే వార్తలను కమల్ నాథ్ తోసిపుచ్చారు. వారు వ్యక్తిగత కారణాలతోనే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు. -
‘ఇమ్రాన్‌కు పోటీగా విపక్షాల అభ్యర్థి’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 11న పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ, బెనర్జీర్ భుట్టో కుమారుడి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్‌కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్-ఎన్ పార్టీ నేత మర్యమ్ ఔరంగజేబు తెలిపారు. ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు ఇమ్రాన్ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రాహుల్‌కి తొలిదెబ్బ...!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తొలిదెబ్బ పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విపక్షాల నేతలు మాత్రం ఎవరికివారు ‘మేము సైతం’ అంటూ తెరపైకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతల ద్వారా వాళ్లే పీఎం అభ్యర్థులంటూ ప్రకటనలు కూడా చేయిస్తున్నారు. పొత్తులపై పూర్తి అధికారాన్ని రాహుల్‌కు సీడబ్ల్యూసీ అప్పగించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రెయిన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ(63)నే విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషించబోతున్నాయి. పీఎం అభ్యర్థితత్వానికి మమత అని విధాలా అర్హత ఉన్న వ్యక్తి. బెంగాల్ ప్రజలే కాదు.. దేశం మొత్తం ఆమెను ఓ శక్తివంతమైన నేతగా ప్రజలు అంగీకరించారు. రేసులో ఆమె ముందున్నారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు’ అని ఓ’బ్రెయిన్ ప్రకటించారు. మరోవైపు గత కొన్నిరోజులుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి(62) పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీలతో జోరుగా మంతనాలు సాగిస్తున్న ఆమె.. బుధవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయి పొత్తులపై చర్చించారు కూడా. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు బీఎస్పీ సిద్ధమైన తరుణంలో.. రాహుల్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ సొంత పార్టీ నేతలకు మాయావతి హుకుం జారీ చేశారు. ఈ తరుణంలో 2019 ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారంటున్నారు జేడీఎస్ నేత దానిష్ అలీ(కర్ణాటక) బుధవారం వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరోవైపు ఎన్సీపీ ఛీప్ శరద్ పవార్ పేరును కూడా ఆయన పార్టీ ప్రస్తావనకు తెస్తోంది. ‘మరాఠా శక్తివంతమైన రాజకీయ వేత్త. ప్రధాని కావాలన్న ఆయన కల 2019 ఎన్నికలతో తీరబోతోంది’ అని పవార్ అనుచరుడు ప్రఫూల్ పటేల్ వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో విపక్షాలన్నీ కలిసి బీజేపీ అవకాశాలను ఎలా దెబ్బ కొట్టాలన్న దానిపై దృష్టిసారిస్తే మంచిదని.. ప్రధాని అభ్యర్థిత్వం ఆలోచన అప్రస్తుతమని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. -
ఎన్నికలయ్యాకే ప్రధాని అభ్యర్థిని చెప్తాం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాలని జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ అన్నారు. బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలన్నారు. గతంలో 3 సందర్భాల్లో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎంపిక జరిగిందన్నారు. ‘ఎన్నికల తర్వాతే వీపీ సింగ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1996లో కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ హెచ్డీ దేవెగౌడను ప్రధానిగా చేసింది. అదేవిధంగా, ఎన్నికల అనంతరమే యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎంపికయ్యారు’అని ఆయన చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల తర్వాతే నాయకత్వం అంశం నిర్ణయమవుతుందని అన్నారు. ఏకాభిప్రాయంతోనే ప్రధానమంత్రిని నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అసలు లక్ష్యమే దెబ్బతింటుందని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా రూపొందే ప్రతిపక్ష కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదన్నారు. గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కేవలం 31శాతం మాత్రమే పొందిన బీజేపీ ప్రతిపక్షం లేని భారత్ తెస్తానంటూ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 28 లోక్‌సభ స్థానాలకు గాను 25పైగానే గెలుచుకుంటాయన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల కోసం కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తాయన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని విభేదాలున్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ ఐదేళ్లూ జేడీఎస్‌కే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ లిఖితపూర్వకంగా అంగీకరించిందన్నారు. -
చాయ్‌వాలా టు పీఎం
-
చాయ్‌వాలా టు పీఎం
అహ్మదాబాద్: నమో నమ.. దేశాన్ని ఒక ఊపు ఊపిన మంత్రమిది. పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏను మట్టికరిపించిన నరేంద్ర మోడీ తంత్రమిది. దేశ ప్రధాని కాబోతున్న ఒక చాయ్‌వాలా సాధించిన అద్భుత గెలుపు ఇది. దేవుడే తనను ఎన్నుకున్నాడంటూ సగర్వంగా చెప్పుకొన్న మోడీ నేపథ్యం.. - ప్రత్యర్థుల విమర్శలనే తన విజయానికి మెట్లుగా మలుచుకున్న 63 ఏళ్ల మోడీ... గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా వాద్నగర్లో వెనుకబడిన వర్గమైన మోద్ ఘాంచీ (గానుగల నుంచి నూనె తీసే పనిచేసే) కుటుంబంలో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. మోడీ పూర్తిపేరు.. నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. ఆయన తండ్రి టీ స్టాల్ నడిపేవారు. తల్లి హీరాబెన్ ఇళ్లలో పని చేసేవారు. వీరి ఆరుగురు సంతానంలో మోడీ మూడోవాడు. చిన్నప్పుడు మోడీని కుమార్ అని పిలిచేవారు. మోడీ తన చిన్న వయస్సులోనే తండ్రికి తోడుగా వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మేవారు. అప్పట్లో సైన్యంలో చేరాలనేది ఆయన కోరిక. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పాటు.. బుద్ధుడు, వివేకానందుడి బోధనలకు ఆకర్షితుడై చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయి ఆర్ఎస్ఎస్లో చేరారు. 1985లో బీజేపీలో చేరారు. పార్టీ ఆఫీస్ బేరర్‌గా ఉంటూనే.. కీలక నాయకుడిగా ఎదిగారు. ఇదే సమయంలో చదువుపైనా దృష్టి సారించి.. గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్రను విజయవంతం చేయడం కోసం కృషి చేసి అద్వానీ దృష్టిలో పడ్డారు. 1995లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మూడేళ్ల తర్వాత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2001లో అప్పటి పార్టీ సీఎంగా ఉన్న కేశూభాయ్ పటేల్ స్థానంలో.. గుజరాత్ పగ్గాలు చేపట్టారు. 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా ఘటన, అనంతరం అల్లర్లతో దేశవ్యాప్తంగా ఆయన చర్చకు వచ్చారు.ఆ సమయంలో మోడీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించినా.. అద్వానీ అండతో మోడీ బయటపడ్డారు. అప్పటి నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తున్నా.. వాటినే తన విజయానికి మెట్లుగా మార్చుకుంటూ 2007, 2012ల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో బీజేపీని గెలిపించి, హ్యాట్రిక్ సాధించారు.తన పాలనలో ఉద్యోగుల్లో అవినీతిని కొంత వరకూ అరికట్టి, పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించి.. అభివృద్ధికి నమూనాగా నిలిచారు. తాను చేసిన ప్రతీ పనినీ విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో దిట్ట అయిన మోడీ... ‘వైబ్రెంట్ గుజరాత్.. (గుజరాత్ వెలిగిపోతోంది)’ అంటూ దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించారు. శక్తివంతుడైన, సమర్థుడైన నేతగా ప్రచారం పొందారు. బీజేపీలో అద్వానీలాంటి మహామహులను ఎదుర్కొని.. ప్రధాని అభ్యర్థిగా తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే స్థాయికి ఎదిగారు. ఏడాది కింద పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌గా నియామకం కావడంతోనే తన ప్రచారయుద్ధాన్ని ప్రారంభించిన మోడీ... ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే దానిని మరింత ఉధృతం చేశారు. 2002 అల్లర్ల తర్వాత ఎన్డీయేను వదిలిపెట్టిన పార్టీలను తిరిగి ఆకర్షించి.. ఎన్నికలకు ముందే కూటమిని బలోపేతం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 450 సభల్లో పాల్గొన్నారు. వీటన్నింటికి తోడు యూపీఏ పదేళ్ల లోపభూయిష్టమైన పాలనపై వ్యతిరేకత కూడా మోడీకి కలిసివచ్చింది. దీంతో బీజేపీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ సాధించని స్థాయిలో.. ఆ పార్టీకి గెలుపును అందించారు. -
సురాజ్యం కోసమే బతుకుదాం: మోడీ
-
సురాజ్యం కోసమే బతుకుదాం: మోడీ
బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. వడోదరను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెసేతర పార్టీ ఒకటి పూర్తిస్థాయిలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిందని అన్నారు. ఇంకా ఆయనేం మాట్లాడారంటే... పొద్దుటనుంచి ఏదో ఒకటి మాట్లాడాలని మీడియా మిత్రులు అంటున్నారు. కానీ నేను మాత్రం, మాట్లాడితే.. గెలిచాకే, అదికూడా ప్రజలతోనే అనుకున్నాను. నామీద హక్కు ప్రజలకే ఉంది. ఈవాళ మీకు ఎలా అనిపిస్తోందో చెప్పండి. శుభదినమా.. శుభదినమా.. వాహ్.. మిమ్మల్నందరినీ అభినందించడానికి, మీకు కృతజ్ఞతలు చెప్పడానికే ఈరోజు ఇక్కడకు వచ్చాను. రాబోయే 60 ఏళ్లలో దేశానికి నాలాంటి సేవకుడు దొరకడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలావరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఎప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినా, సంకీర్ణ ప్రభుత్వాలే వచ్చాయి. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వం కూడా పలు పార్టీల సంగమమే. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో కాంగ్రెసేతర.. ఒకే ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. రాజకీయ పండితులు కూడా దీన్ని ఊహించలేదు. స్వతంత్రం తర్వాత పుట్టిన తరానికి మొట్టమొదటిసారి అధికార పగ్గాలు వచ్చాయి. స్వరాజ్యం కోసం మనం పోరాడలేకపోయాం గానీ సురాజ్యం కోసం మనం బతకగలం. దేశ పౌరులు ఒక్కొక్కరు ఒక్కో ముందడుగు వేసినా మనం 125 కోట్ల అడుగులు వేయగలం. బంగారు భవిష్యత్తు కోసం కృషిచేద్దాం. 125 కోట్ల భారతీయులందరూ నావాళ్లే. వాళ్లకోసం నేను పనిచేస్తా. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా అభ్యర్థిగా నాకు అద్భుతమైన విజయం వచ్చింది. వడోదరలో నామినేషన్ దాఖలుచేసిన తర్వాత 50 నిమిషాలు మాత్రమే కేటాయించాను. కానీ నాకు 5.70 లక్షలకు పైగా మెజారిటీ అందించారు. వడోదర ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాను. మీరు నాకు అందించిన ప్రేమ అపూర్వం. ఒక్కొక్క ఓటరు ఒక్కో నరేంద్రమోడీలా మారి పనిచేశారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైనా అభ్యర్థికి తన ఓటర్లతో మాట్లాడే అవకాశం లభించకపోవడం ఈసారే జరిగింది. వారణాసిలో మోడీ మౌనానికే ఓట్లేశారు. అక్కడ అభ్యర్థిగా ఉన్నా నాకు ప్రచారం చేసుకునే అవకాశం రాలేదు. అయినా కూడా మోడీ మౌనానికి వారణాసి వాసులు ఓట్లు వేసిన తీరు భారతదేశ చరిత్రలోనే అద్భుతం. ఐదేళ్ల భారతదేశ చరిత్రలో మీరు కొత్త రికార్డు సృష్టించారు. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటివరకు 5.70 లక్షల ఓట్ల మెజారిటీ ఎవరికీ రాలేదు. నేను ఉప ఎన్నికల విషయం మాట్లాడట్లేదు. వడోదరలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఎన్నికల కమిషన్‌కు, దేశవాసులకు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న మీడియాకు ఒకటే విజ్ఞప్తి. గుజరాత్లో వడోదర పౌరులు ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టారు. ఓటర్లు, పౌరసమాజం, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, న్యాయవాదులు.. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఓటరు చైతన్యం చూపించారు. ఇది చాలా పెద్ద విజయం. ఇందుకుగాను పౌరులను అభినందిస్తున్నాను. మోడీ ఎక్కడున్నా కూడా మీ హృదయాల్లోనే ఉంటాడు. గుజరాత్లో ఉన్న మొత్తం 26 సీట్లను బీజేపీకి అందించినందుకు కృతజ్ఞతలు. దాదాపు 60 శాతం ఓటింగ్ ఇక్కడ బీజేపీకి వచ్చింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. -
నేడు మోడీ రాక
అంబేద్కర్ స్టేడియంలో సభ ఏర్పాట్లు పూర్తి జిల్లాకు రెండోసారి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మంగళవారం కరీంనగర్ వస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అగ్రనేతల సభలతో జిల్లాలో ప్రచారం వేడెక్కగా మోడీ రాకతో మరింత ఊపందుకోనుంది. -న్యూస్‌లైన్, కరీంనగర్ అర్బన్ కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి భారీ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. లక్ష మందిని తరలించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేపట్టారు. ప్రతీగ్రామం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనుంచి తరలించి విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ సోనియా సభ, టీఆర్ఎస్ శంఖారావం సభలకు దీటుగా ప్రజలను ఆకట్టుకునేలా సభ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతకు మోడీ గాలి తోడైతే విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ నేతలు తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మోడీ ఆధ్వర్యంలో సభకు రూపకల్పన చేశారు. గుజరాత్లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్మారక స్తూపం ఏర్పాటు కోసం ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇనుము, మట్టిని సేకరించిన కార్యక్రమంతో మోడీకి మంచి గుర్తింపు వచ్చింది. రైతులతోపాటు మహిళలు, యువత, వర్తక, వాణిజ్య, కార్మిక, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిం దనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్, టీఆర్ఎస్ అగ్రనేతలు తమ ప్రసంగాల్లో చెప్పిన మాటలు తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ సభ ఉండనుందని భావిస్తున్నారు. భారీ బందోబస్తు నరేంద్రమోడీ కరీంనగర్ రావడం ఇది రెండోసారి. 2009 ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన పార్టీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డికి మద్దతుగా ప్రచారం నిమిత్తం ఆయన కరీంనగర్ వచ్చారు. మంగళవారం మహారాష్ట్ర నుంచి బయలుదేరి నిజామాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోడీ ఇక్కడకు రానున్నారు. సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నుంచే స్టేడియాన్ని తమ అదుపులోకి తీసుకుని అణువణువూ గాలిస్తున్నారు. కలెక్టరేట్లోని హెలీప్యాడ్ నుంచి బహిరంగసభ జరిగే ప్రదేశం వరకు డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. హెలీ ప్యాడ్, స్టేడియంలోకి ఎవరినీ పోనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్ల పరిశీలన మోడీ సభకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలకు ఎండవేడిమి తగలకుం డా షామియానాలు వేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు, అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీందర్‌రాజు, హైదరాబాద్ మాజీ డెప్యూటీ మేయర్ సుభాష్‌చందర్, పార్లమెంట్ ఇన్చార్జి కొరివి వేణుగోపా ల్, కన్వీనర్ హరికుమార్‌గౌడ్, ఎస్వీ సుభాష్, ప్రధాన కార్యదర్శి బల్మూరి జగన్మోహన్రావు, ఉపాధ్యక్షులు గుజ్జ సతీశ్, శ్రీధర్ తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేరా?
కాంగ్రెస్‌కు రాజ్‌నాథ్ సింగ్ సవాల్ మొయిలీని ఇంటికి పంపించాలని పిలుపు మోడీని గెలిపిస్తే వాజ్‌పేయి పాలన ఓటమి తప్పదని కాంగ్రెస్‌కు తెలిసిపోయింది దొడ్డబళ్లాపురం/శివమొగ్గ, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో దేశంలో ఎక్కడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవని, ఆ నమ్మకం లేకే రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందని, దమ్ముంటే కాంగ్రెస్ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘భారత్‌ను గెలిపించండి’ పేరిట బుధవారం ఆయన దొడ్డబళ్లాపురంలో కార్యకర్తల సమావేశంలో, శివమొగ్గలో బహిరంగ సభలో మాట్లాడారు. పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.5 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగితే ఏనాడూ పెదవి విప్పని రాహుల్, నేడు లోక్‌సభ అవధి ముగుస్తున్న సమయంలో అవినీతి నియంత్రణకు కొత్త ఆర్డినెన్స్ తేవాలని ప్రయత్నిస్తుండటం తమాషాగా ఉందన్నారు. ఇదే జరిగితే తాను రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తాన ని చెప్పారు. అవినీతిని అంతమొందించాలనే ఉబలాటం అంతగా ఉంటే వారి పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతోనే తయారు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అవినీతి పాతాళం, భూమి, ఆకాశాలలో సైతం వ్యాపించిందన్నారు. సెక్యులర్ పేరుతో మత విద్వేషాలు రగిలించేది కాంగ్రెస్సేనన్నారు. కాంగ్రెస్ చేతగాని పాలనతో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయన్నారు. గా్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తుందని, బీజేపీ అందరినీ కలుపుకుపోతూ పాలిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా 2019 ఎన్నికలకు సిద్ధమవుతోందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా వెలువరించిన పోస్టర్లలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దర్శనమిస్తారు... ప్రధాని అభ్యర్థిగా మాత్రం ముందుకు రారు అని ఎత్తిపొడిచారు. నిరుద్యోగం విలయ తాండవం చేస్తోందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. దేశానికి ఇంటా, బయటా భద్రత కొరవడిందని ఆరోపించారు. ఎన్నికల్లో యడ్యూరప్పను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లను కోరారు. 2014లో ఓటమి తప్పదని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందన్నారు. ఎన్నికల తరువాత దేశంలో కొత్త ఒరవ డి రానుందని, మోడీ ప్రధాని అయితే వాజ్‌పేయి పాలన మళ్లీ వస్తుందన్నారు. ఈసారి ఎన్నికల్లో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని చిత్తుగా ఓడించి బీజేపీ అభ్యర్థి బచ్చేగౌడను గెలిపిస్తానని కార్యకర్తలు మాటివ్వాలన్నారు. దేశ ప్రజలందరూ మోడీని ప్రధానిని చేయాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అనంత కుమార్ మాట్లాడుతూ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీపై నిప్పులు చెరిగారు. మొయిలీకి చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, రాష్ట్రం గురించి ఏమీ తెలీదని, గెలిపిస్తే వెళ్లి ఢీల్లీలో కూర్చొని మళ్లీ ఐదేళ్లకు కనిపిస్తారన్నారు. అబద్దాలనే జన్మహక్కుగా చేసుకుని మాట్లాడే మొయిలీ వలస పక్షిలాంటి వాడని ఎద్దేవా చేశారు. మంగళూరులో చిత్తుగా ఓడి ఇక్కడకు వలస వచ్చి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఈ ప్రజలకే ద్రోహం చేశారన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలిపించడం ద్వారా మోడీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడ, మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్ అశోక్, సినీ నటి మాళవిక, ఎంపీ అభ్యర్థి బచ్చేగౌడ, కేఎస్. ఈశ్వరప్ప, బసవరాజ్ బొమ్మయ్, శోభా కరంద్లాజె, సీఎం. ఉదాసీ, బీవై. రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ప్రచార సారధి మాత్రమే: సోనియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ప్రకటించే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో సీడబ్లూసీ నిర్ణయమే ఫైనల్ అని ఆమె మరోసారి తేల్చిచెప్పారు. అయితే సోనియా ప్రసంగం ముగిసిన అనంతరం రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ నినాదాలు హోరెత్తాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పలువురు నేతలు మాట్లాడలేకపోయారు. 2014 ఎన్నికలు సిద్దాంతాల మధ్య పోరుగా సాగుతుందని సోనియా అభిప్రాయపడ్డారు. సంక్షోభాలు ఎదుర్కోవటం కాంగ్రెస్ కు కొత్త కాదని సోనియా అన్నారు. కాగా నిన్న జరిగిన సీడబ్లూసీ భేటీలో రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై డిమాండ్లు వెల్లువెత్తినా.. పార్టీలో ఆ సంప్రదాయం లేదని పేర్కొన్న సోనియా.. ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. పార్టీ ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ సూచనపై చర్చించిన సీడబ్లూసీ... రాహుల్‌కు ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని విస్పష్టంగా నిర్ణయించింది. ఆ క్రమంలో ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఐసీసీ భేటీలో ఆ అంశంపైనే విస్తృతంగా చర్చించనున్నారు. హస్తినలో కొనసాగుతున్న ఏఐసీసీ మీటింగ్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
ఇక రాహుల్‌కు ప్రచార సారథ్యమే
రాహుల్‌ను ప్రచార రథసారథి పాత్రకే పరిమితం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయనను ప్రధాని అభ్యర్థిగా, నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా ప్రకటించకుండానే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానించింది... 2 గంటలపాటు మథనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథసారథిగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించాలని సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయించారు. దీనిపై శుక్రవారం ఏఐసీసీ సమావేశంలో అధికారిక ప్రకటన చేస్తారు. ఆయనను కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా కూడా నిర్ణయిస్తారని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూసినా అలాంటిదేమీ జరగలేదు. ఎన్నికలకు ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేదని, అదే సంప్రదాయాన్ని ఇప్పుడూ కొనసాగిస్తామని అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు శుక్రవారం అతి కీలకమైన ఏఐసీసీ సమావేశం జరుగుతుండటం తెలిసిందే. అందులో దిశానిర్దేశం చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ గురువారం సాయంత్రం పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్‌లో రెండు గంటలకుపైగా సమావేశమైంది. సోనియాతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీడబ్య్లుసీ ప్రత్యేక ఆహ్వానితుడు జి.సంజీవరెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కావాల్సి ఉన్నా వెళ్లలేదు. నేతల ‘రాగా’లు అధిష్టానం ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టినా స్వీకరించేందుకు సిద్ధమని, పార్టీ సైనికుడిలా నడుచుకుంటానని బుధవారం రాహుల్ గాంధీ(రాగా) మీడియాముఖంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. భేటీకి కొద్ది గంటల ముందు దాకా ఏఐసీసీ స్థాయిలో చర్చంతా ఈ అంశం చుట్టూనే తిరిగింది. సీడబ్ల్యూసీకి హాజరైన దాదాపు 80 మంది సభ్యుల్లో మెజారిటీ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనని కోరారు. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన కీలక నేతలైతే ఆ మేరకు సీడబ్ల్యూసీ భేటీలోనే తీర్మానం చేయాలంటూ పట్టుబట్టారని, అప్పుడే పార్టీ శ్రేణుల్లో నూతనుత్తేజం వస్తుందని వాదించారని చెబుతున్నారు. బీజేపీని ఉదహరిస్తూ, వారి ప్రధాని అభ్యర్థి మోడీకి దీటుగా రాహుల్‌ను దింపాలంటూ అధినేత్రిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేసినట్టు తెలిసింది. ‘నమో’కు జడిసే... నరేంద్ర మోడీ(నమో) ముందు పలు విషయాల్లో రాహుల్ తేలిపోతారన్న భావనతోనే ఆయన్ను ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంపైకాంగ్రెస్ వెనకంజ వేస్తున్నట్టు భావిస్తున్నారు. గుజరాత్ సీఎంగా హాట్రిక్ కొట్టడమే గాక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పరుగులు తీయిస్తున్న నాయకునిగా మోడీ ప్రభ వెలిగిపోతుండటం తెలిసిందే. యువతలో కూడా ఆయనపై క్రేజు పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. పైగా ప్రధానిగా రాహుల్ కంటే ఆయన వైపే ఎక్కువమంది మొగ్గుతున్నారనీ తేలుస్తున్నా యి. దీనికి తోడు రాహుల్‌కు పాలనాపరమైన అనుభవమూ లేకపోవడం, పైగా బాధ్యతలను స్వీకరిం చేందుకు వెనకా ముందాడే ఆయన నైజం వంటివన్నీ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నట్టు సమాచారం. పదేపదే వంశ పురాణం విప్పడం, సొం త పార్టీ నేతల ప్రెస్ మీట్లలోకి చొచ్చుకెళ్లి, ప్రభుత్వ నిర్ణయాలనే తప్పుబడుతూ రసాభాసగా మార్చడం, అవగాహన లేమితో కూడిన వ్యాఖ్యల వంటివాటితో రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై ఇప్పటికే సందేహాలు నెలకొన్నాయి. ఈ స్థితిలో ఎన్నికలకు 3 నెలల ముందుగానే రాహుల్‌ను అధికారికంగా తెరపైకి తెస్తే ఆయన పూర్తిగా తేలిపోతారేమోనన్న అనుమానం కాంగ్రెస్ పెద్దలను వెన్నాడుతోంది. పద్ధతి కాదంటూ సముదాయింపు సీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడే అవకాశం దక్కిన ప్రతి ఒక్కరు రాహుల్ జపమే చేస్తుండటంతో సోనియా కల్పించుకున్నారు. ప్రస్తుతానికి రాహుల్ కేవలం ప్రచార సారథిగానే బాధ్యతలు స్వీకరిస్తారంటూ సముదాయించే యత్నం చేశారు. ‘ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం పార్టీలో లేదు. దాన్నే కొనసాగిద్దాం. ప్రస్తుతానికైతే ప్రచార కమిటీకి నాయకత్వ బాధ్యతలనే రాహుల్‌కు అప్పగిద్దాం’ అన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ విలేకరులకు ఈ మేరకు చెప్పారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మెజార్టీ సభ్యులు కోరినా సోనియా తిరస్కరించారని తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించినంత మాత్రాన వారి తరహాలోనే తామూ నడవాలనేమీ లేదన్నారు. ప్రస్తావనకు రాని తెలంగాణ: శుక్రవారం ఏఐసీసీలో ప్రవేశపెట్టే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విదేశీ వ్యవహారాల తీర్మానాలను సీడబ్ల్యూసీలో ఆమోదించారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలని తీర్మానించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మాత్రం సీడబ్ల్యూసీలో ఎలాంటి నిర్ణయం గానీ, తీర్మానం గానీ చేయలేదు. ఈ దృష్ట్యా ఏఐసీసీ సమావేశంలోనూ తెలంగాణ అంశంపై ఎలాంటి చర్చా ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో ‘ప్రధాని’ కలకలం
అభ్యర్థి వెల్లడిపై భిన్నాభిప్రాయాలు! రాహులే మా ‘సహజ ఎంపిక’: షిండే ముందుగా ప్రకటించడమెందుకు: దిగ్విజయ్ న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థి అంశం కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలకు, అభిప్రాయ భేదాలకు వేదికగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేయాలని పార్టీలో మెజారిటీ వర్గం కొంతకాలంగా పదేపదే డిమాండ్ చేస్తున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మీడియాముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు ప్రధాని అభ్యర్థిగా రాహులే తమ సహజ ఎంపిక అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు! శుక్రవారం హోం శాఖ నెలవారీ మీడియా భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 17న జరిగే ఏఐసీసీ సదస్సులో రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశముందా అని ప్రశ్నించగా, తమ పార్టీకే గాక దేశానికి కూడా ఆయన అవసరమన్నారు. నేతల మధ్య పోటీ కాదు ప్రధాని అభ్యర్థి ఎంపికపై జాగరూకత అవసరమని దిగ్విజయ్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధు లు మాత్రమే తమ నాయకుడిని ఎన్నుకుంటారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానితో పాటు షాడో ప్రధాని, అంటే విపక్ష నేత కూడా ఉంటారని దిగ్విజయ్ అన్నారు. ప్రధానిగా మోడీ, రాహుల్, కేజ్రీవాల్‌లపై జరుగుతున్న చర్చను వార్తా చానళ్ల టీఆర్పీ ప్రయాసగా కొట్టిపారేశారు. భారత్ వంటి దేశంలో పోటీ ఎప్పుడూ పార్టీల సిద్ధాంతాలు, విధానాల మధ్యే ఉంటుంది తప్ప కీలక నేతల మధ్య కాదన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, తమ పార్టీ గనుక ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలనుకుంటే అందులో తప్పేమీ లేదంటూ ఆయన ముక్తాయించారు. -
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ?
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జైపూర్‌లో ఏఐసీసీ చివరిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జరుగుతున్న సమావేశంలో పార్టీ పరిస్థితిపై లోతైన చర్చ జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంస్థాగత మార్పులు జరగవచ్చనే ఊహాగానాలు అప్పుడే ఊపందుకున్నాయి. దీనితో పాటు కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిని సైతం ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశముంది. -
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా నందన్ నీలేకని?
‘ప్రధాని అభ్యర్థిని అనువైన సమయంలో ప్రకటిస్తాం’... నాలుగు రాష్ట్రాల్లో చేదు ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీడియాకు చెప్పిన మాటలివి. నిజానికి ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు లేనే లేదు. కానీ, మేడం మాటలతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మాత్రం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఇన్ఫోసిస్ నిర్మాణకర్తల్లో ఒకరైన నందన్ నీలేకని అంటూ ప్రచారం సాగుతోంది. అయితే నీలేకని ఈ వార్తలను చెత్త అంటూ కొట్టిపడేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కథనాన్ని కల్పితమైనదిగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ లేదా వేరొక నేతను ప్రధాని అభ్యర్థిగా అదిష్టానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు. -
మోడీ పట్టాభిషేకం!
అందరూ ఎప్పటినుంచో అనుకుంటున్నదే నిజమైంది. ఎవరు అవునన్నా, కాదన్నా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిలపాలన్న ఆరెస్సెస్ పట్టుదలే ఫలించింది. ‘కొత్త నీరు’ ధాటికి పార్టీలోని ‘పాత నీరు’ ఎటో కొట్టుకుపోయింది. నరేంద్ర మోడీ కిరీటధారణకు ఆదినుంచీ ఆటంకంగా ఉన్న అద్వానీని పక్కకు నెట్టి పార్టీ అంతా మోడీ వెనక దృఢంగా నిలబడింది. అత్యంత ప్రజాస్వామికంగా, ఏకగ్రీవంగా సాగిపోయినట్టు కనబడిన దృశ్యాల వెనక చాలా తతంగమే నడిచింది. తాను ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడమేకాదు...దాన్ని సాధించడానికి ఏం చేయాలో, ఎప్పుడు ఎటువైపు అడుగేయాలో నరేంద్రమోడీకి బాగా తెలుసు. అందువల్లే నిరుడు డిసెంబర్లో వరసగా మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మాత్రమే ఆయన తన ‘జాతీయ ఆకాంక్ష’ను వెల్లడించారు. ఆ ప్రకటనకు అవసరమైన నేపథ్యాన్ని ఆయన అంతకు చాలాకాలం ముందే జాగ్రత్తగా సమకూర్చుకున్నారు. ఒకప్పటి తన గురువు అద్వానీ రెండేళ్లక్రితం అహ్మదాబాద్‌నుంచి అవినీతి వ్యతిరేక యాత్ర ప్రారంభించబోతే మోడీ దాన్ని వమ్ముచేశారు. అలాగని ఆయనకు దూరం జరగలేదు. గడ్కారీ అధ్యక్షుడిగా ఉండగా అద్వానీవైపే నిలబడ్డారు. పార్టీ అధ్యక్ష పదవినుంచి గడ్కారీ తప్పుకుని ఒకప్పటి తన ప్రత్యర్థి రాజ్‌నాథ్‌సింగ్ ఆ స్థానంలోకి రాగానే ఎత్తుగడలను మార్చారు. తనపై కోపంగా ఉన్న ఆరెస్సెస్‌ను ప్రసన్నం చేసుకున్నారు. పర్యవసానంగా నాలుగు నెలలక్రితం గోవాలో జరిగిన పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో నరేంద్రమోడీని రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎత్తుగడలన్నీ బొత్తిగా బోధపడని అద్వానీ... చివరి నిమిషంలో ఆ పరిణామాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలుడయ్యారు. మోడీని ఆ పదవికి ఎంపిక చేయడం...భవిష్యత్తులో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికేనని అర్ధమై పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా లాభం లేకపోయింది. పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించబోతున్నట్టు నాలుగురోజులనాడు పార్టీ అగ్ర నేతలు ఆయనకు చెప్పినప్పుడు అద్వానీ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాకుతో వాయిదా వేయిద్దామని చూశారు. అది కూడా నెరవేరలేదు. తనకు అండగా నిలబడ్డారనుకున్న సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషి సైతం ‘అటువైపు’ వెళ్లారని తెలుసుకున్నాక ఆయన మోడీని ఒక్క మాట కూడా అనకుండా రాజ్‌నాథ్ వ్యవహార శైలికి అభ్యంతరం చెబుతూ లేఖ రాసి పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరయ్యారు. ‘మానిందే మందు’ అనే నానుడి ఎప్పటినుంచో ఉన్నదే. లోక్‌సభలో రెండు స్థానాలకు మించని బీజేపీని తన రథయాత్రతో తిరుగులేని శక్తిగా రూపొందించి అధికార పీఠానికి చేర్చిన అద్వానీ రెండు దశాబ్దాలు గడిచేసరికి పార్టీలో చెల్లని కాసు అయ్యారు. నెహ్రూ దేశ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ‘సెక్యులర్’ పదానికి పోటీగా ‘సూడో సెక్యులర్’ పదాన్ని తీసుకొచ్చి ప్రత్యర్థుల్ని గుక్కతిప్పుకోనీయ కుండా చేసినప్పుడు... పార్టీలో ప్రమోద్‌మహాజన్, అరుణ్‌జైట్లీ, నరేంద్రమోడీ, ఉమాభారతి వంటి యువ నాయకులను ప్రోత్సహించినప్పుడు శభాష్ అని ప్రశంసించినవారే 2009 ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయేసరికి దూరం జరిగారు. పాకిస్థాన్ పర్యటనలో జిన్నాను పొగిడాక సంఘ్ పరివార్ నాయకత్వం పార్టీకి కొత్త సారథిని వెతికే పనిలో పడింది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న పార్లమెంటరీ బోర్డు నాయకులందరినీ గమనిస్తే వారిలో ప్రజాకర్షణలో మోడీకి దీటు రాగలవారు ఒక్కరు కూడా లేరని సులభంగానే గ్రహించవచ్చు. వీరిలో కొందరు రాజ్యసభ సభ్యులైతే, మరికొందరు తమ తమ లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితంకాగల నాయకులు. అందువల్లే ఉత్తరాది వ్యక్తి కాకపోయినా, కేంద్రంలో ఏనాడూ మంత్రి పదవిని చేపట్టిన అనుభవం లేకపోయినా, కనీసం ఢిల్లీలో ఎక్కువకాలం గడపకపోయినా మోడీ ఆ పార్టీలో తిరుగులేని నేతగా మారారు. ఇవన్నీ సరేగానీ... నరేంద్ర మోడీ పేరు చెప్పేసరికి ‘గుజరాత్ నమూనా’ అందరి మదిలో మెదులుతుంది. జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి డీజీ వంజారా కూడా మొన్నీమధ్యే ఈ ‘నమూనా’ గురించి తన లేఖలో విపులంగా ప్రస్తావించారు. ఈ నమూనా నిజానికి ఒకటి కాదు... రెండు. ఒకటి కార్పొరేట్ ప్రపంచం కోరుకునే మార్కెట్ ఎకానమీ అనుకూల ‘ఆర్ధిక నమూనా’ కాగా, రెండోది‘రాజకీయ నమూనా’. ఆర్ధిక నమూనా గుజరాత్‌కే పరిమితమైనదేమీ కాదు. కాకపోతే, దాన్ని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆయన మరింత సమర్ధవంతంగా అమలుచేస్తున్నారు. రాజకీయ నమూనాపై మాత్రం పార్టీలోనూ, వెలుపలా మోడీపై ఎన్నో విమర్శలున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఆయన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయలేదన్న ఫిర్యాదు చాలా పాతది. తనకు పోటీ వస్తారనుకున్న ఏ నేతనైనా మోడీ దూరంపెట్టారు. ఇందుకు కేశూభాయ్ పటేల్ నుంచి కాశీరాం రాణా, సురేష్ మెహతా వరకూ ఎన్నో ఉదాహరణలున్నాయి. పార్టీ ప్రభుత్వాలపై ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెత్తనం సాగే స్థితి ఉండగా గుజరాత్ అందుకు భిన్నం. అక్కడ రెండింటిపైనా మోడీదే ఆధిపత్యం. ఇక భిన్న రాజకీయ విశ్వాసాలకు, ఆలోచనలకు ఆయన చోటివ్వరన్న విమర్శలున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్‌సింగ్ జిన్నాపై రాసిన గ్రంథంతోసహా పలు పుస్తకాలు గుజరాత్లో ఇప్పటికీ నిషిద్ధం. ఇన్ని లోటుపాట్లున్నా ఇప్పటికైతే మధ్యతరగతి ప్రపంచానికి మోడీయే మారాజు. అందుకే బీజేపీ ఆయనను జాతీయ యవనికపైకి తెచ్చింది. ఈ నిర్ణయం దేశంలో ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న ప్రజాదరణను మరింత పెంచుతుందా లేదా అన్నది భవిష్యత్తే తేల్చాలి. -
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ.. రాజ్‌నాథ్ ప్రకటన
-
మోడీయే మా ప్రధాని అభ్యర్థి: స్పష్టం చేసిన ఆర్ఎస్ఎస్
రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీయే ఉండాలని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. మార్పు కావాలనుకుంటున్న ప్రజలంతా నరేంద్ర మోడీకే మద్దతిస్తారని తెలిపింది. అయితే, ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించాలన్నది మాత్రం పార్టీ ఇష్టమేనని తెలిపింది. దేశవ్యాప్తంగా తాము పలు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టమవుతోందని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం వచ్చిందని, తాము పార్టీ నాయకత్వానికి తమ ఉద్దేశం తెలియజేశామని ఆయన అన్నారు. మోడీ అభ్యర్థిత్వం పట్ల పార్టీలో కూడా ఎలాంటి గందరగోళం లేదని, కానీ.. ప్రకటన సమయాన్ని మాత్రం పార్టీయే చూసుకోవాలని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం సమావేశం కావచ్చని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా తెలిపారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు ఉండటంతో, అంతకంటే ముందే ఆయన అభ్యర్థిత్వ ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు.