నేడు మోడీ రాక
అంబేద్కర్ స్టేడియంలో సభ ఏర్పాట్లు పూర్తి జిల్లాకు రెండోసారి
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మంగళవారం కరీంనగర్ వస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల అగ్రనేతల సభలతో జిల్లాలో ప్రచారం వేడెక్కగా మోడీ రాకతో మరింత ఊపందుకోనుంది.
-న్యూస్‌లైన్, కరీంనగర్ అర్బన్
కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి భారీ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. లక్ష మందిని తరలించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేపట్టారు. ప్రతీగ్రామం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనుంచి తరలించి విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేశారు.
కాంగ్రెస్ సోనియా సభ, టీఆర్‌ఎస్ శంఖారావం సభలకు దీటుగా ప్రజలను ఆకట్టుకునేలా సభ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతకు మోడీ గాలి తోడైతే విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ నేతలు తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మోడీ ఆధ్వర్యంలో సభకు రూపకల్పన చేశారు.
గుజరాత్‌లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్మారక స్తూపం ఏర్పాటు కోసం ఏక్‌తా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇనుము, మట్టిని సేకరించిన కార్యక్రమంతో మోడీకి మంచి గుర్తింపు వచ్చింది. రైతులతోపాటు మహిళలు, యువత, వర్తక, వాణిజ్య, కార్మిక, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిం దనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అగ్రనేతలు తమ ప్రసంగాల్లో చెప్పిన మాటలు తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ సభ ఉండనుందని భావిస్తున్నారు.
భారీ బందోబస్తు
నరేంద్రమోడీ కరీంనగర్ రావడం ఇది రెండోసారి. 2009 ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన పార్టీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డికి మద్దతుగా ప్రచారం నిమిత్తం ఆయన కరీంనగర్ వచ్చారు. మంగళవారం మహారాష్ట్ర నుంచి బయలుదేరి నిజామాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోడీ ఇక్కడకు రానున్నారు. సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సోమవారం నుంచే స్టేడియాన్ని తమ అదుపులోకి తీసుకుని అణువణువూ గాలిస్తున్నారు. కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్ నుంచి బహిరంగసభ జరిగే ప్రదేశం వరకు డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. హెలీ ప్యాడ్, స్టేడియంలోకి ఎవరినీ పోనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
మోడీ సభకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలకు ఎండవేడిమి తగలకుం డా షామియానాలు వేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు, అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీందర్‌రాజు, హైదరాబాద్ మాజీ డెప్యూటీ మేయర్ సుభాష్‌చందర్, పార్లమెంట్ ఇన్‌చార్జి కొరివి వేణుగోపా ల్, కన్వీనర్ హరికుమార్‌గౌడ్, ఎస్వీ సుభాష్, ప్రధాన కార్యదర్శి బల్మూరి జగన్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు గుజ్జ సతీశ్, శ్రీధర్ తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.