ముందస్తు ఎన్నికలకు కమలం సేన సమాయత్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రాష్ట్ర, జిల్లా నాయకులు, అసెంబ్లీ కన్వీనర్లు, పదాధికారులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. అమిత్ షా పర్యటన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో ఆ పార్టీ నాయకత్వం పదాధికారుల సమావేశం ఆదివారం నిర్వహించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు కర్ణాటక రాష్ట్ర బీజేపీ బృందం చేరుకుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కర్ణాటక టీం పనిచేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్లను మచ్చిక చేసుకున్న తీరు.. దేశానికి బీజేపీయే రక్ష అనే నినాదంతో బూత్ లెవల్‌లో పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండాను వికసింపజేయడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేస్తోంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఇన్‌చార్జిలను నియమించారు. కర్ణాటకకు చెందిన 16మంది బీజేపీ నాయకులు కరీంనగర్ చేరుకున్నారు. 16 మందికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కో–ఆర్డినేటర్‌గా సచ్చిదానందమూర్తి, జాయింట్ కో–ఆర్డినేటర్‌గా రామానందయాదవ్, ఒక్కో అసెంబ్లీకి ఇద్దరి చొప్పున పార్టీ అధిష్టానం నియామకం చేసింది. ఈబృందం 50 రోజులపాటు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కార్యకర్తలకు పూర్తి సమయం కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం.. బూత్‌లెవల్‌లో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం దిశానిర్దేశనం చేసింది.
ప్రధాని మోడీ నిర్వహించే ‘మన్‌కీబాత్’ కార్యక్రమాన్ని ప్రజలు చూసేవిధంగా ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అసెంబ్లీలో సదస్సులు నిర్వహిస్తూ.. కొత్తగా చేరిన నవయువ ఓటర్లను కలిసి సమ్మేళనాలు నిర్వహించేందుకు కసరత్తు చేశారు. కర్ణాటక టీం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉండి బీజేపీ విజయం కోసం ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర పార్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్‌చార్జిలను ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలకు పరిచయం చేశారు.
కర్ణాటక టీం నుంచి ఇన్‌చార్జీలు వీరే
కరీంనగర్ అసెంబ్లీకి కో–ఆర్డినేటర్‌గా కెహెచ్.హనుమంతరాయప్ప, జాయింట్ కో ఆర్డినేటర్‌గా గీతా ధనుంజయ్, చొప్పదండి ఎస్సీ నియోజకవర్గానికి కో–ఆర్డినేటర్‌గా సంజయ్, జాయింట్ కో–ఆర్డినేటర్‌గా శశికళ తెలంగాణ, వేములవాడ నియోజకవర్గానికి కో–ఆర్డినేటర్‌గా సూర్యకాంత్ ధోని, జాయింట్ కో–ఆర్డినేటర్‌గా దివ్య హడ్‌గా తదితరులను నియమించారు. కరీంనగర్‌లో జరిగిన ఇన్‌చార్జిలు, పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు చేయాల్సిన పనులను వివరిం చారు. కర్ణాటక బృందం సభ్యుల సూచనలు పాటిస్తూ బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందకు సాగాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, కన్నబోయిన ఓదెలు, బాస సత్యనారాయణ, కోమల ఆంజనేయులు, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కనుమల్ల గణపతి, నాగేశ్వర్‌రెడ్డి, గుజ్జ సతీష్, పార్లమెంట్ కన్వీనర్ చదువు రాజేందర్‌రెడ్డితో పాటు పార్లమెం ట్ పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment