ముందస్తు ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. ప్రచారానికి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలను రప్పించే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి, గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలు నిర్వహించి ఆయా పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. తాజాగా గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడింది. దీంతో మిగిలిన 13 రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు సభల నిర్వహణ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే కొందరు అగ్రనేతల పర్యటనల షెడ్యూల్‌ను ప్రకటించిన రెండు ప్రధాన పార్టీలు.. మరో రెండు మిగతా షెడ్యూల్ సైతం ఖరారు చేసేందుకు కసరత్తులో మునిగాయి.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు సోనియాగాంధీ శుక్రవారం హైదరాబాద్‌లో సభకు హాజరవుతుండగా, 24 నుంచి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్లంతా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్‌రెడ్డి ఈ నెల 24 కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యంతో వహిస్తున్న సిరిసిల్లతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నారు. 26న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మరోమారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు, సభలు నిర్వహించనున్నారు.
జగిత్యాల, కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ, 2:45కు కరీంనగర్‌లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవితలు సైతం ఆయా నియోజవకర్గాల్లో పర్యటించనున్నారు.
ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రానున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలో ఓ సభకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి తదితరులు ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కూడా ఆ కూటమి అగ్రనేతలతో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment