నేడోరేపో నాలుగు స్థానాలపై ‘కూటమి’ ప్రకటన | TTDP, TJS Withdrawn Karimnagar Seats... | Sakshi
Sakshi News home page

నేడోరేపో నాలుగు స్థానాలపై ‘కూటమి’ ప్రకటన

Published Wed, Nov 14 2018 2:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

 TTDP, TJS Withdrawn  Karimnagar Seats... - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:  మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఫైనల్‌కు చేరింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీట్ల కేటాయింపు, సర్దుబాటుపై ఆ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సోమవారం హైదరాబాద్, ఢిల్లీలో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం రాత్రికిరాత్రే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 65 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది మందిలో ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు ముగ్గురు బీసీలు, ఇద్దరు దళిత అభ్యర్థులకు అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను సోమవారం రాత్రి ప్రకటించిన అధిష్టానం.. మరో ఐదుస్థానాలపై సస్పెన్స్‌ పెట్టింది. పొత్తుల్లోభాగంగా సీపీఐకి మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో హుస్నాబాద్‌ కూడా ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీంతో మరో నాలుగుస్థానాలపై నేడో, రేపో కాంగ్రెస్, కూటమి పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపుగా సీట్ల సర్దుబాటు.. ఫైనల్‌కు చేరినట్లేనని భావిస్తున్నారు.

టీటీడీపీ, టీజేఎస్‌ తప్పుకున్నట్లే?.. హుస్నాబాద్‌ నుంచి సీపీఐ అభ్యర్థి...
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీటీడీపీ, టీజేఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఆశిస్తున్న స్థానాలపై కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారితీసింది. మొదట టీడీపీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడిగింది. హుజూరాబాద్‌ నుంచి మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కోరుట్ల నుంచి ఎల్‌.రమణ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పోటీచేసేందుకు ఆఇద్దరు నేతలు విముఖత వ్యక్తం చేయడంతో ధర్మపురి (ఎస్సీ) నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని భావించారు. చివరినిమిషంలో అక్కడా కాంగ్రెస్‌అభ్యర్థులకే అవకాశం కల్పించనున్నారని చెప్తున్నారు. అలాగే తెలంగాణ జనసమితి కూడా హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం స్థానాలపై గురిపెట్టింది. 

ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, గోపు ఐలయ్యకు టికెట్‌ ఇవ్వాలని అడిగారు. తర్వాత నేరుగా టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామే రామగుండం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు టీజేఎస్‌కు
కేటాయించిన, ప్రకటించిన సీట్లలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒక్కటి కూడా లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ, టీజేఎస్‌లు పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. సీట్ల కేటాయింపులో మొత్తంగా
కేటాయించిన మూడుస్థానాల్లో హుస్నాబాద్‌ నుంచి సీపీఐకే అవకాశం కల్పించినట్లు ఆపార్టీ నేత వెంకటరెడ్డి ప్రకటించగా.. ఆయన తరఫున ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం హుస్నాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సైతం పోటీలో ఉంటామంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తే స్నేహపూర్వక పోటీ.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేందుకు సమాయత్తం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. 

నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ.. నేడోరేపో మలిజాబితా..?
ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం మరో ఐదు స్థానాలపై సస్పెన్స్‌ పెట్టింది. తొలి జాబితాలో తమ పేర్లుంటాయని భావించిన హుజూరాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, కేకే.మహేందర్‌ రెడ్డి (సిరిసిల్ల), మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (హుస్నాబాద్‌)కి నిరాశ మిగిలింది. కోరుట్ల, ధర్మపురి అభ్యర్థుల ప్రకటన విషయమై కూడా సస్పెన్స్‌ నెలకొంది. మంగళవారం కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య జరిగిన సంప్రదింపులు, చర్చల నేపథ్యంలో హుస్నాబాద్‌ సీపీఐకే కేటాయిస్తామని పేర్కొనగా.. ఇప్పుడు నాలుగు స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. 

సిరిసిల్లలో కేకే.మహేందర్‌ రెడ్డి పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. దాదాపుగా టికెట్‌ ఖాయమైందన్న భరోసాతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చివరి నిమిషంలో ఆయన పేరు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. ఇక్కడినుంచి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం గట్టిగా పట్టుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధర్మపురిలో వరుసగా ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్థానంలో డాక్టర్‌ కవ్వంపెల్లి సత్యనారాయణ, దరువు ఎల్లయ్యతోపాటు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోరుట్ల నుంచి కొమొరెడ్డి రామ్‌లు తదితరులు గతంలో దరఖాస్తు చేసుకోగా.. టికెట్‌ కమిట్‌మెంట్‌పై కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు జువ్వాడి నర్సింగ్‌రావు పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరిగింది. ఆ టికెట్‌ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తంగా నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ నెలకొనగా, నేడో, రేపో ప్రకటించే మలి జాబితాతో తెరపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement