ఆదివారం టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో భేటీ అయిన రమణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, టీజేఎస్ స్థానాలపై లెక్కలు కొలిక్కివచ్చినా, సీపీఐకి కేటాయించే స్థానాలపై పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సీపీఐ పట్టుబడుతోంది. దీనిపై సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించే అవకాశం ఉంది. పార్టీలకు ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు కేటాయించారన్న దానిపై సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నామినేషన్ ప్రకటనకు ముందే కూటమి పక్షాలకు కేటాయించే స్థానాలపై ప్రకటన చేస్తామని ఉత్తమ్ సైతం ప్రకటించారు.
జనగామ టీజేఎస్‌కే..
నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూటమి పక్షాల్లోని పార్టీలకు ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు కేటాయించారన్న అంశమై స్పష్టత కొరవడటం, దీనిపై కూటమిలో టీజేఎస్, సీపీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వీటిని కొలిక్కి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆదివారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌లు టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం హాజరయ్యారు. సీట్ల సర్దుబాటు, కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చించారు. ఈ భేటీలో టీజేఎస్‌కు జనగామ, మెదక్, దుబ్బాక, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేటలతో పాటు వరంగల్ ఈస్ట్ లేదా మిర్యాలగూడలో ఒక స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లుగా తెలిసింది. ఇందులో జనగామ నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మిర్యాలగూడలో సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది.
జానా కుమారుడి పోటీపై ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే మాత్రం ఆ స్థానం కాకుండా వరంగల్ ఈస్ట్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వనున్నారు. ఇక ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లలో మాత్రం స్నేహపూర్వక పోటీ చేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. మరోపక్క చాడ వెంకట్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు చర్చలు జరిపారు. సీపీఐకి ముందునుంచీ చెబుతున్నట్లుగా బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాలు కేటాయించేందుకు ఓకే చెప్పగా, కొత్తగూడెం, మనుగోడుపై చర్చలు జరిగాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నందున ఈ స్థానాన్ని పక్కనపెట్టి కొత్తగూడెంపై ఎక్కువ సమయం చర్చించారు. కొత్తగూడెం కాంగ్రెస్‌కే వదిలెయ్యాలని, అధికారంలోకి వచ్చాక సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు బుజ్జగించే యత్నం చేశారు. అయితే ఈ అంశంపై సోమవారం ఉత్తమ్ దగ్గరే తేల్చుకుంటామని చాడ స్పష్టం చేశారు. కాగా, సమావేశం అనంతరం శ్రీనివాస కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, చర్చలు ఫలప్రదం అయ్యాయని ప్రకటించారు.
ఐదు సీట్లు ఇస్తే ఓకే.. లేదంటే కటీఫ్: చాడ
సాక్షి, హైదరాబాద్: తమతో చర్చించేందుకు ఆదివారం తమ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూతలు పాత పాటే పాడి వెళ్లారని చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదు సీట్లు అడుగుతుంటే మూడు సీట్లే ఇస్తామని చెప్పడంపై చాడ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతీసారి తమనే సర్దుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లెందుకు సర్దుకోవడం లేదని ప్రశ్నించారు. సీట్ల విషయంలో సీపీఐకి ఉన్న ఇమేజ్‌ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోనే నేరుగా తేల్చుకుంటామని, ఐదు సీట్లు ఇవ్వకుంటే సాయంత్రానికల్లా అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ దూతలు వచ్చి చర్చించినా స్థానాలపై స్పష్టత రాలేదని సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు.
అన్ని పార్టీలకు భాగస్వామ్యం: ఉత్తమ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉత్తమ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలూ అసంతృప్తిగా ఉన్నాయని, హరగోపాల్, విమలక్క, గద్దర్ వంటి ఉద్యమకారులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఉద్యమకారులను విస్మరించి, కేవలం నలుగురు వ్యక్తులే నాలుగు కోట్ల ప్రజలను శాసిస్తున్నారని ఆరోపించారు. అటువంటి టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓటమి తప్పదని, డిసెంబర్ 11న మహాకూటమి అఖండ విజయం సాధిస్తుందని, 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీలూ భాగస్వాములుగా ఉంటాయన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత రాష్ట్ర ప్రజల అకాంక్షలను నెరవేర్చడమే తమ తొలి ప్రాధాన్యమని, ఉద్యమ అజెండా అమలుచేసే చట్టబద్ధమైన కమిటీకి కోదండరాం కన్వీనర్‌గా ఉంటారని తెలిపారు. ఉద్యమంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కోదండరాంను కేసీఆర్ అవమానించారని విమర్శించారు.
టీజేఎస్‌తో సీట్ల సర్దుబాటు చర్చల అనంతరం ఆయన రమణ, కోదండరాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కూటమి పక్షాలకు ఎన్ని సీట్లు, ఏయే సీట్లు కేటాయించామన్న విషయం ప్రకటిస్తామన్నారు. కూటమిలోని అన్ని పార్టీల్లో ఆశావహులు ఉన్నారని, పోటీచేసే అవకాశం రాని నేతలకు ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాలతో గౌరవం, సుముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి గెలుస్తుందని, అందరికీ తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ, కూటమితో ప్రకంపనలు మొదలయ్యాయని, సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కుటుంబంలో మాదిరే కూటమిలోనూ చిన్నచిన్న సమస్యలున్నా అవన్నీ త్వరలో సర్దుకుంటాయని తెలిపారు. ఏయే సీట్లలో ఏ పార్టీ పోటీ చేయనుందన్న మీడియా ఆసక్తికి త్వరలోనే ఫుల్‌స్టాఫ్ పెడతామని ఓ ప్రశ్నకు కోదండరాం సమాధానమిచ్చారు.
ఉద్రిక్తత..
నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ టికెట్ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేశ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కోదండరాం వారిని బుజ్జగించారు.
Comments
Please login to add a commentAdd a comment