సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలపై గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణ జన సమితి పార్టీకి కేటాయించిన స్థానాలు క్షణక్షణానికి మారుతున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమకు కేటాయించిన స్థానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ కూడా ఆగ్రహంగా ఉంది. ఇక ఆశావహులు తమ పార్టీల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంపై ఆందోళనలకు దిగుతున్నారు.
హస్తినలో టెన్షన్ టెన్షన్
కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. నోటిఫికేషన్ వచ్చినా ఇంకా చర్చలేనా అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాయంత్రానికి తుది జాబితా సిద్ధం చేసి.. మరోసారి ఆయనతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. 70 మంది అభ్యర్థులకు ఆమోదం లభించినట్టు సమాచారం. మరోవైపు జానారెడ్డి, రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్యారాచుట్‌లకు చెక్
టికెట్ కోసం చివరి నిమిషంలో పార్టీలో చేరిన నేతలకు బ్రేక్ వేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. అభ్యర్థులు ఎప్పుడు పార్టీలో చేరారు, సర్వే వివరాలు చెప్పాలని రాష్ట్ర నాయకులను రాహుల్ అడిగారు. అధినేత ఆదేశాలతో దాదాపు 15 స్థానాల్లో ‘ప్యారాచుట్’ అభ్యర్థుల పేర్లను మరోసారి పరిశీలించినట్టు తెలిసింది. మరోవైపు తమకు టిక్కెట్లు దక్కుతాయో, లేదోనని కాంగ్రెస్‌లో చేరిన నేతలు ఆందోళన చెందుతున్నారు. జంప్ జిలానీలకు చెక్ పెట్టాలన్న నిర్ణయంతో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
పట్టువీడని సీపీఐ
తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. తమకు 5 స్థానాలు కట్టబెట్టాలని కమ్యూనిస్ట్‌లు డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. టీడీపీకి కేటాయించిన 15 స్థానాల్లో 11 సీట్లలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. మిగతా స్థానాలు ఎక్కడ కేటాయిస్తారో ప్రకటించాలని సైకిల్ పార్టీ కోరుతోంది. టీజేఎస్‌కు కేటాయించిన 6 స్థానాలు ఎక్కడిస్తారో ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఆశావహుల ఆందోళన
వర్ధన్నపేట టికెట్‌ను కాంగ్రెస్ కే కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ముందు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అనుచరుల ధర్నాకు దిగారు. పొత్తులో భాగంగా ఈ సీటును టీజేఎస్‌కు కేటాయిస్తున్నారని ప్రచారం జరగడంతో ఈ ఆందోళన చేపట్టారు. అటు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద కూడా పలువురు నేతల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. వీరిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్వయంగా వీరిని సముదాయించారు. టిక్కెట్లు రానివారిని తర్వాత తగు విధంగా గౌరవిస్తామని, అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయడమే ప్రధాన లక్ష్యమని కార్యకర్తలకు ఉద్బోధించారు.
కొసమెరుపు
జాబితాపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, అభ్యర్థుల ప్రకటన ఈ రోజా, రేపా అనేది చూడాల్సి ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం రాత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment