కాంగ్రెస్‌ కూటమి కుదురుకునేనా? | Is Congress, TDP Grand Alliance Work Out In Telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 9:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Is Congress, TDP Grand Alliance Work Out In Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ ఆవిర్భావం నుంచి ఆగర్భ శత్రువుగా పరిగణిస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో  తెలుగుదేశం చేతులు కలపాలనుకోవడం అవకాశవాద రాజకీయమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు సీపీఐ,  ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ని కూడా కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేయాలనుకోవడం జాతీయ రాజకీయాల్లో కీలకమైన పరిణామమే. కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతోనే 1982లో ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. 1995లో చంద్రబాబు నాయుడు పార్టీని చీల్చినప్పటికీ ఆయన తన ఉనికి కోసం కాంగ్రెస్‌ పార్టీని ప్రధాన శత్రువుగా రాజకీయాలు నడిపించాల్సి పరిస్థితి కూడా తెలిసిందే.

ముఖ్యంగా రాయలసీమలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. ఎంతగా అంటే... రాయల సీమలో 2017 వరకు ఇరు పార్టీల మధ్య కొనసాగిన రాజకీయ ఘర్షణల్లో దాదాపు 970 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, 560 మంది టీడీపీ కార్యకర్తలు మరణించినట్లు క్రై మ్‌ రికార్డు బ్యూరో లెక్కలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నాలుగేళ్లలో ఆ పార్టీ పరిస్థితి మరింతగా క్షీణించింది. టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది సభ్యులు పాలకపక్ష తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోగా, ఒక్కరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌ది అన్న కారణంగా అక్కడ ఐదు శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.


కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ నాటకీయంగా బయటకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ, ఆంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ బలబడాలన్న వ్యూహంతో ఇరు పార్టీలు పరస్పరం చేతులు కలిపేందుకు సిద్ధపడ్డాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పట్ల ప్రభుత్వం వ్యతిరేక ఓటు పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్‌కు ప్రస్తుత మహా కూటమి ఎంత మేరకు సఫలీకృతమవుతుందన్న  చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇటీవల పోలింగ్‌ ఏజెన్సీ ‘వీడీపీ అసోసియేట్స్‌’ ప్రకటించిన సర్వే ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 27 శాతం, బీజేపీకి పది శాతం, ఎంఐఎంకు ఆరు శాతం, టీడీపీకి నాలుగు శాతం ఓట్లు వస్తాయి. సీపీఐకి, తెలంగాణ జన సమితి కూడా చెరి రెండేసి శాతం ఓట్లు వస్తాయి. ఈ లెక్కన మహా కూటమికి వచ్చే ఓట్ల శాతం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే 35 శాతం ఓట్లు రావచ్చు. అంటే టీఆర్‌ఎస్‌కన్నా ఇంకా ఆరు శాతం ఓట్లు తక్కువే వస్తున్నాయి.

ఇకపోతే ఒక తెలుగు టీవీ చానెల్‌ నిర్వహించిన మరో సర్వే ప్రకారం కూడా ట్రెండ్‌ దాదాపుగా ఇలాగే ఉన్నట్లు కనిపించింది. అయితే, పార్టీ మధ్య పొత్తులను పరిగణలోకి తీసుకోకుండానే ఆ ఛానల్‌ కూడా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పొత్తు కూడిన పార్టీలకు విడివిడిగా వచ్చే ఓట్ల శాతాన్ని మొత్తంగా పరిగణలోకి తీసుకున్నా కూడా పాలకపక్షంకన్నా తక్కువ శాతం ఓట్లే వస్తున్నట్టు తెలియజేసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇతర కేటగిరీల కింద కూడా వర్గీకరించి విశ్లేషిస్తే ప్రస్తుత ఎన్నికలపై ముందస్తు అంచనాలపై ఒక అభిప్రాయానికి రావచ్చని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. 

పరిగణలోకి తీసుకోవాల్సిన వర్గీకరణ అంశాలు

  • రద్దయిన రాష్ట్ర అసెంబ్లీలో మహా కూటమి భాగస్వామ్య పక్షాలకు ఉన్న సీట్లెన్నీ?
  • 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహాకూటమి ఉమ్మడి ఓట్ల శాతం ఏయే నియోజక వర్గాల్లో ఎక్కువ?
  • ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహాకూటమి ఉమ్మడి ఓట్ల శాతం పది శాతం కన్నా తక్కువ?
  • ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహా కూటమి ఉమ్మడి ఓట్ల శాతం పది నుంచి 20 శాతం ఎక్కువ. ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకి, మహా కూటమి ఉమ్మడి ఓట్ల శాతం మధ్య వ్యత్యాసం 20 శాతం కన్నా ఎక్కువ. 
  • 2014లో ఎన్నికల్లో విజయం సాధించిన మహా కూటమి భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు ఫిరాయించడం వల్ల కోల్పోయిన సీట్లెన్నీ?

2014లో వాటికి వచ్చిన ఓట్ల శాతాన్ని రానున్న ఎన్నికల్లో కూడా దక్కించుకోగలవని భావిస్తే... ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి కచ్చితంగా బదిలీ అయితే మహా కూటమికి అదనంగా 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ విజయం సాధించిన గజ్వేల్‌ నియోజకవర్గ ఓటింగ్‌ సరళని విశ్లేషిస్తే... గత ఎన్నికల్లో కేసీఆర్‌ 44 శాతం ఓట్లతో అక్కడి నుంచి విజయం సాధించగా, అక్కడ కాంగ్రెస్, టీడీపీలకు ఉమ్మడిగా 51 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ వంటేరు ప్రతాప్‌ రెడ్డి మహాకూటమి తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయన కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంటుందా? అన్నది వేరే విషయం. 

మూడవ వర్గీకరణ కింద అదనంగా 19 సీట్లు రావాలంటే మహాకూటమికి అనుకూలంగా ఐదు శాతం ఓట్లు స్వింగ్‌ కావాలి. అప్పుడు కూడా మహా కూటమికి మొత్తం వచ్చే సీట్లు 53.  అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కన్నా ఏడు సీట్లు తక్కువే ఉంటాయి. ఫిరాయింపుల కారణంగా టీడీపీ కోల్పోయిన 12 సీట్లను, కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిన ఏడు, సీపీఐ ఒక్క సీటుతోపాటు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న రెండు సీట్లను కైవసం చేసుకోవడంతోపాటు మహాకూటమి పక్షాల మధ్య ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగి, ఐదు శాతం ఓట్ల స్వింగ్‌ ఉన్నప్పుడు గరిష్టంగా 53 స్థానాలను మహా కూటమి గెలుచుకో గలుగుతుంది. 

‘వీడీపీ అసోసియేట్స్‌’ చేసిన సర్వే ప్రకారం 2014లో టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు రాగా, ఈ సారి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి 25 నుంచి 27 శాతానికి పెరుగుతాయి. టీడీపీకి 15 నుంచి 4 శాతానికి పడిపోతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీడీపీ భారీగా దెబ్బతిన్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 150 వార్డులకుగాను 100 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుచుకొంది. టీడీపీ 44 నుంచి ఒక్క స్థానానికి, కాంగ్రెస్‌ 52 నుంచి రెండుకు పడిపోయాయి. ఈ రకంగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని  విశ్లేషిస్తే  తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 

దక్షిణాదిలో విజయావకాశాలు
కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండి టీడీపీ, సీపీఐ పార్టీల ప్రభావం కూడా బాగానే ఉన్న ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో మహా కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఉమ్మడి ఓట్ల శాతం 37 శాతం కాగా, సీపీఐ, జన సమితి ఓట్లు కలిస్తే టీఆర్‌ఎస్‌కన్నా ఎక్కువ శాతం ఓట్లు రావచ్చు. సహజంగానే ఈసారి కాస్త ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో మరింత బలపడటమే కాకుండా తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రయోజనం పొందొచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ఉండొచ్చు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement