పొత్తులకు కోర్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ | Green Signal From Congress Core Comittee Regarding Alliances | Sakshi
Sakshi News home page

పొత్తులకు కోర్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌

Published Wed, Sep 26 2018 2:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Green Signal From Congress Core Comittee Regarding Alliances - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీలతో కలసి వెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈ మేరకు ఏఐసీసీ కోర్‌ కమిటీ టీపీసీసీకి అధికారికంగా అనుమతిచ్చింది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డితో ఏఐసీసీ కార్యాలయంలోని వార్‌రూమ్‌లో కోర్‌ కమిటీ సభ్యులు గులాంనబీ ఆజాద్, ఆంటోని, జైరాం రమేశ్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఇప్పటివరకు జరిగిన చర్చలు, సీట్ల పంపకాలపై ఆయా పార్టీల ప్రతిపాదనలు, రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఉత్తమ్, జానాలు పార్టీ అధిష్టానానికి వివరించారు.

దీంతో పొత్తులకు కోర్‌కమిటీ లాంఛనంగా ఆమోదం తెలిపింది. అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై కూడా కసరత్తు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీకి 10–14 సీట్లు, సీపీఐకి 3, టీజేఎస్‌కు 3 సీట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించింది. స్థానికంగా కూర్చుని మాట్లాడాక దీనిపై తుది నిర్ణయం తీసుకుని తమకు తెలపాలని ఆదేశించింది. సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించాం. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కోర్‌కమిటీ కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశమవుతోంది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, పొత్తుల అంశాలపై కమిటీ ఆరా తీసింది.

మున్ముందు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించాం’అని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, పార్టీ లక్ష్మణ రేఖను దాటితే ఏ స్థాయి నేతలపై అయినా చర్యలకు వెనుకాడబోమని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాగా, త్వరలోనే ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరంలతో పాటు కేరళ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో కోర్‌కమిటీ వరుసగా చర్చలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీలతో కుదుర్చుకోవాల్సిన పొత్తులపై చర్చిస్తోంది. అందులో భాగంగానే అధిష్టానం పిలుపు మేరకు ఉత్తమ్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. సోమవారమే ఢిల్లీ వెళ్లిన జానా కూడా అధిష్టానం వద్ద జరిగిన సమావేశానికి హాజరయ్యారు. 

అవన్నీ అంతర్గత విషయాలు: ఉత్తమ్‌ 
కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఉత్తమ్‌ తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర పీసీసీ అనుసరించాల్సిన వ్యూహాలపై కోర్‌కమిటీ ఆరా తీసిందన్నారు. పొత్తులపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం మేరకు కుటుంబంలో ఒక్కరికే టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం సంకేతాలివ్వడంపై ఉత్తమ్‌ను ప్రశ్నించగా.. అవన్నీ పార్టీ అంతర్గత విషయాలని, తాము చూసుకుంటామని వ్యాఖ్యానించారు. 

వ్యక్తిగత పనిమీదే వచ్చా: జానారెడ్డి 
తన కుమారుడికి టికెట్‌ ఇప్పించేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు ఊహించుకొని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత, వ్యాపార పనిమీదే ఢిల్లీ వచ్చానని, ఇప్పుడు కోర్‌కమిటీ సమావేశానికి కబురు రావడంతో హాజరైనట్లు చెప్పారు. మిర్యాలగూడ నుంచి తన కుమారుడు పోటీ చేయడంపై అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement