12 ఓరుగల్లు కోటలో..స్తంభాలాట | There is heavy competition in twelve Constituencies in Warangal | Sakshi
Sakshi News home page

12 ఓరుగల్లు కోటలో..స్తంభాలాట

Published Thu, Nov 29 2018 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

There is heavy competition in twelve Constituencies in Warangal - Sakshi

సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటం, రాణి రుద్రమదేవి ప్రతాపం, ప్రతాపరుద్రుడి పాలన ఈ గడ్డ సొంతం. పోరుగల్లుగా పేరొందిన ఈ జిల్లా ఘనమైన వారసత్వ సంపదకూ పుట్టినిల్లు. వెలుగు పంచే కాకతీయ థర్మల్‌ స్టేషన్‌.. కొంగుబంగారమై విలసిల్లే ‘నల్ల బంగారు’ గనుల భూపాలపల్లి.. రాజకీయంగానూ, ఉద్యమాలపరంగానూ చైతన్యం వెల్లివిరిసే ఖిల్లా ఇది. తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత రెండో పెద్ద నగరం వరంగల్‌. పట్టణ జనాభా అధికంగా ఉండే జిల్లా ఇది. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే.. జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, తెలుగుదేశం రెండు, కాంగ్రెస్‌ ఒకచోట, మరో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల నుంచి నగరానికి వచ్చే రహదారులు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సామాన్య ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అలాగే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం  వేగం పుంజుకోవాలని ఓటర్లు అంటున్నారు.  

వర్ధన్నపేట (ఎస్సీ): వార్‌ వన్‌సైడ్‌!
వరంగల్‌ నగర ప్రభావం ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీ నామమాత్రంగానే ఉంది. ఇక్కడ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ (టీఆర్‌ఎస్‌) మరోసారి పోటీకి దిగగా, కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పగిడిపాటి దేవయ్య, బీజేపీ నుంచి కొత్త సారంగరావు రంగంలో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అరూరి రమేష్‌కు కలిసి వచ్చే అంశం. టీజేఎస్‌ నుంచి పోటీ చేస్తున్న దేవయ్య నియోజకవర్గానికి కొత్త. ఆయనకు కూటమి పార్టీల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇక్కడ పోటీ పెద్దగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 


నర్సంపేట: వస్తాద్‌ ఎవరట
నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి సత్తా చాటిన దొంతి మాధవరెడ్డి ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈసారీ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యే పోటీ ఉండబోతోంది. ఓంకార్‌ తనయుడు మద్దికాయల అశోక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి రంగంలో ఉన్నా.. ప్రభావం అంతంతే. టీడీపీకి చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. కూటమి అభ్యర్థి ‘దొంతి’కి పూర్తిగా సహకరిస్తే.. గెలుపు సులువవుతుందని అంచనా.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ): కూత పెట్టేది ఏ పార్టీ?
నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య (టీఆర్‌ఎస్‌), ఇందిర (కాంగ్రెస్‌) ప్రధానంగా పోటీ పడుతుండగా. బీఎస్పీ నుంచి రాజా రపు ప్రతాప్‌ కూడా గట్టి పోటీనిస్తున్నారు. మొదట టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి.. రాకపోవడంతో ప్రతాప్‌ బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఇది రాజయ్యకు ఇబ్బందికరమే. ప్రతాప్‌ టీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చే పక్షంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇందిరకు సానుకూలంగా మారనుంది. 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రాజయ్య.. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదన్న అపవాదు ఉంది. రాజకీయాలకు కొత్త అయిన ఇందిర ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు.



ములుగు (ఎస్టీ): తేలేదెవరు?
ఆపద్ధర్మ మంత్రి చందూలాల్‌ (టీఆర్‌ఎస్‌) – కూటమి అభ్యర్థి సీతక్క (కాంగ్రెస్‌) మధ్య ప్రధాన పోటీ ఉంది. మంత్రిగా ఉన్నా.. చందులాల్‌ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న అసంతృప్తి ప్రజ ల్లో కనిపిస్తోంది. ములుగును జిల్లా కేంద్రంగా చేయడంలోనూ విఫలమయ్యారన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితి సీతక్కకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోనే సమ్మక్క, సారలమ్మ వనదేవతలు కొలువున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం సరిగా లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

భూపాలపల్లి: ప్రధాన పార్టీలకు ‘సింహ’స్వప్నం
నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సింగరేణి కార్మికులు, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కార్మికులు, రైతన్నలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గండ్ర సత్యనారాయణరావు వణుకు పుట్టిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఈయన సింహం గుర్తు (ఏఐఎఫ్‌బీ) నుంచి బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి స్పీకర్‌ మధుసూదనాచారి, కాంగ్రెస్‌ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నియోజకవర్గంలో ఉధృతంగా చేస్తున్న ప్రచారం ఎవరికి చేటు తెస్తుందోనన్న ఆందోళన ఉంది. 

జనగామ: ‘పథకం’ ప్రకారం..
వ్యవసాయధారిత ప్రాంతమైన జనగా మలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్‌ఎస్‌), మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్‌) పోటీపడుతున్నారు. ము త్తిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నా.. ఆయనపై భూములకు సంబంధించిన ఆరోపణలున్నాయి. పొన్నాల ఎన్నికలప్పుడు తప్ప.. నియోజకవర్గాన్ని పట్టిం చుకున్నది లేదన్నది సామాన్య ప్రజల ఆవేదన. ఇటీవల కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేరికతో కాస్త కాంగ్రెస్‌ బలం పెరిగింది. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్న అభిప్రాయం ఉంది. సీఎం కేసీఆర్‌ను చూసే ఓటేస్తామని ప్రజలు అంటున్నారు.

డోర్నకల్‌: గెలిచే వారే ‘నాయక్‌’
నియోజకవర్గంలో చెయ్యి గుర్తంటే రెడ్యానాయక్‌.. రెడ్యానాయక్‌ అంటే చెయ్యి గు ర్తన్నట్టు భావించే ఇక్కడి గిరిజన ఓటర్లు ఈసారి ఎటు మొగ్గుతారనేది ఆసక్తికరం. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రె డ్యా.. తరువాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడా పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి యువనేత డాక్టర్‌ రామచంద్రు నాయక్‌ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లక్ష్మణ్‌నా యక్‌ కూడా పోటీలో ఉన్నా.. రెడ్యా, రామచంద్రు మధ్యే హోరాహోరీ ఉండనుంది. గిరిజనం రెడ్యానాయక్‌ గుర్తు చేయి అని పొరబడితే.. ఇబ్బందే. నియోజకవర్గ అభివృద్ధిపైనా అసంతృప్తి ఉంది.



వరంగల్‌ (తూర్పు): ఎవరికి పొద్దుపొడుపు?
వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఈ నియోజకవర్గం అంతర్భాగం. ఇక్కడ నగ ర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ (టీఆర్‌ఎస్‌)తో వద్దిరాజు రవిచంద్ర (కాంగ్రెస్‌) తలపడుతున్నారు. కూటమిలోని టీజేఎస్‌ నుంచి గాదె ఇన్నయ్య కూడా రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఖరారు కాకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణ తరువాతే ప్రచారం వేడెక్కింది. మేయర్‌గా రెం డున్నరేళ్లు ఉన్న నరేందర్‌ ఆశించిన మేర కు అభివృద్ధి చేయలేదన్న విమర్శ ఉంది. రవిచంద్ర స్థానికుడు కాదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. గాదె ఇన్నయ్య ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.

వరంగల్‌ (పశ్చిమ): ముగ్గురి నడుమ..
ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ (టీఆర్‌ఎస్‌), కూటమి అభ్యర్థిగా  రేవూరి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ధర్మారావు (బీజేపీ) పోటీ పడుతున్నారు. ఇక్కడ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గం నుంచి 1994 తరువాత ఏనాడూ టీడీపీ గెలవలేదు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిం చిన నాయిని రాజేందర్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్నారు. ఆయన సహకారం రేవూరికి ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన వినయ్‌భాస్కర్‌కు నియోజకవర్గంపై పట్టుంది. అదే సమయంలో ఆయన అనుచరగణం వ్యవహారశైలిపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. 


పరకాల: తాజా మాజీల పోరు
ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ (కాంగ్రెస్‌), చల్లా ధర్మారెడ్డి (టీఆర్‌ఎస్‌) పోటీపడుతున్నారు. గతంలో పరకాల ఎమ్మెల్యేగా ఉన్న సురేఖ 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున వరంగల్‌ తూర్పు నుంచి గెలిచారు. ఈసారి ఆ పార్టీ టికెట్‌ లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ తన పాత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.



మహబూబాబాద్‌: ‘మానుకోట’ రహస్యం
నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయ త్నించి విఫలమైన హుస్సేన్‌నాయక్‌ బీజేపీ నుంచి బరిలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఈయన.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల్లోని ద్వితీయ శ్రేణిని తన వైపు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ పోటీ పడుతున్నారు. హుస్సేన్‌నాయక్‌ కాంగ్రెస్‌ ఓట్లు ఎంత ఎక్కువ చీలిస్తే.. శంకర్‌నాయక్‌కు అంత సానుకూలం.. ఇక్కడ బీఎల్‌ఎఫ్‌ కూటమి నుంచి పోటీ చేస్తున్న మోహన్‌లాల్‌ సంప్రదాయ కమ్యూనిస్టుల ఓట్లను కొంత వరకు రాబట్టుకుంటారు. 

పాలకుర్తి: పోటీ రసవత్తరం
టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉంటూ.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘కారు’ గుర్తుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి జంగా రాఘవరెడ్డి, బీజేపీ నుంచి సోమయ్య రంగంలో ఉన్నారు. కాని ఇక్కడ ప్రధాన పోటీ దయాకర్‌రావు–రాఘవరెడ్డి మధ్యే ఉంది. ఇద్దరికీ నియోజకవర్గంపై పూర్తి పట్టుండటం.. విజయం కోసం ఎంతవరకైనా పోరాడే మన స్తత్వాలు కావడం.. ఆర్థికంగా ఇద్దరూ బలమైన వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గానికి సాగునీటి జలాలు తీసుకురావడమే కాక అభి వృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని దయాకర్‌రావు భావిస్తున్నారు. ఎలాగైనా గెలుపొందాలని జంగా రాఘవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిది ప్రేక్షక పాత్రే.

ఇంకా.. ఇంకా కావాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. పెన్షన్లు, షాదీ ముబారక్‌ పథకాలు పేదలకు ఉపయోగపడతాయి. భూమి లేని వారికి భూమి పంపిణీ చేయాలి. తాగునీటి సమస్య పరిష్కరించాలి. హోటల్‌ నడిస్తేనే మాకు జీవనాధారం. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికసాయం అందించాలి.
– సలీమాబేగం, ఖానాపురం

అంతన్నారు.. ఇంతన్నారు
పోడు భూములకు పట్టాలిచ్చినా అక్కడ వ్యవసాయం చేసుకోనివ్వకుండా అటవీ అధికారులు ట్రెంచింగ్‌లు కొడుతున్నారు. రైతుబంధు కింద పైసలొచ్చినా సాగంటేనే భయమేస్తోంది. మా ఊరును గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి.. ఆ తరువాత జాడలేరు. రోడ్లు లేవు. తాగునీరు లేదు. 
– ధన్‌సింగ్‌నాయక్, గండితండ, గూడూరు

భక్తులకు సౌకర్యాలేవి?
లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తుంటారు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అటవీ పర్యాటక ప్రాంతంగా మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ములుగును జిల్లా చేయాలి.
– జైపాల్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ తాడ్వాయి

అధికారుల నిర్వాకానికి..
అసైన్డ్‌ భూముల పేరిట మాకు రైతుబంధు సాయం అందలేదు. ఒకే సర్వేనంబర్‌లోని మరికొందరికి మాత్రం ఇచ్చారు. మాకు తెలియకుండానే నాకున్న ఎకరా భూమిని అసైన్డ్‌ భూమిగా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. అది మార్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. 
– సత్యం, బుధరావుపేట

అలాచేస్తే పంట పండినట్టే!
ఏ ప్రభుత్వమొచ్చినా.. ఏముంది? మేం కూలీ చేసుకుంటేనే పొట్టనిండుతది. కోతలు కోయడం, వరికుప్పలు వేయడం, వరిగింజలు చేసి సంచుల్లో నింపడం మా పని. ఎకరా ఆరున్నర వేలకు గుత్త తీసుకుంటాం. పది మందితో కూడిన మా బృందం వరికోతలు ముగిసే నెలన్నరలో రూ.6 వేలు సంపాదిస్తది. పాకాల రిజర్వాయర్‌ నుంచి మా భూములకు నీళ్లిస్తామంటున్నారు. అలా చేస్తే మా పంట పండినట్టే. 
– బుచ్చయ్య, బుధరావుపేట  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement