సిటీ సెంటర్‌లో సీన్‌ ఎవరిది? | Who will going to win in the City | Sakshi
Sakshi News home page

సిటీ సెంటర్‌లో సీన్‌ ఎవరిది?

Published Thu, Dec 6 2018 5:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Who will going to win in the City - Sakshi

‘చార్‌ సౌ సాల్‌’ చారిత్రక భాగ్యనగరంలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. ఒకవైపు చూస్తే ఆకాశహార్మ్యాలు.. మరోవైపు వందలాదిగా వెలిసిన మురికివాడలు.. తీరైన రహదారులు ఒకదిక్కు.. దారీతెన్నూ లేనివి మరో దిక్కు.. స్విమ్మింగ్‌పూల్స్‌ ఒకవైపు.. వర్షమొస్తే మురుగు, వర్షపునీరు కలిసి సుడిగుండంలా మారిన ముంపు ప్రాంతాలు మరోవైపు. ఇలా పేదా–గొప్ప తారతమ్యం లేకుండా అందరినీ అక్కున చేర్చుకొని ఆదరిస్తోన్న విశిష్ట సంస్కృతికి ఈ భాగ్యనగరం సొంతం. పాత, ప్రధాన నగరాలతో కూడి, శివార్లతో అలరారుతోన్న రాజధానిలో ప్రధాన నగరం (కోర్‌సిటీ)లో ఎన్నికల పోరు పతాకస్థాయికి చేరింది.  రాజకీయాలు రసవరత్తరంగా మారాయి.

సనత్‌నగర్‌: ‘సీన్‌’ రిపీట్‌?
దేశంలోనే మొదటి పారిశ్రామికవాడగా ఖ్యాతి చెందిన సనత్‌నగర్‌ పేరుతోనే ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్న తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్‌ మధ్య ప్రధాన పోటీ ఉంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పద వి చేపట్టారు. నియోజకవర్గంలో 30 శాతం మురికివాడలే ఉన్నాయి. వారి ఓట్లే కీలకం. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని తలసాని భావిస్తున్నారు. హైటెన్షన్‌ వైర్ల తొలగింపు, మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం తనకు కలిసివస్తుందని ఆశ పెట్టుకున్నారు. టీడీపీ నుంచి పోటీలో ఉన్న కూన వెంకటేష్‌గౌడ్‌.. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ దక్కకుండా అన్యాయం జరిగిందన్న సానుభూతి ప్రజల్లో ఉందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు తోడు పార్టీ ఓట్‌బ్యాంక్‌ పదిలంగా ఉందన్న అంచనాతో ఉన్నారు. 

అంబర్‌పేట: ఎవరిదో సంబరం!
ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ఓటర్లతో మినీ ఇండియాను తలపించే ఈ నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలుపొందిన కిషన్‌రెడ్డికి నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లతో ముఖాముఖి పరిచయం ఉంది. సౌమ్యునిగా, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరున్న ఆయన తన గెలుపు నల్లేరు మీద నడకేనని భరోసాతో ఉన్నారు. అయితే, మూడుసార్లు గెలిచినా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదనే అసంతృప్తి కూడా ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌.. కేసీఆర్‌ సంక్షేమ పథకాలే  తనకు శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లపై ఆయన అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఎంఐఎం బరిలో లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే పార్టీలో అసమ్మతి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ట్రాఫిక్, నాలాల సమస్యలు ప్రభావం చూపనున్నాయి. 

ఖైరతాబాద్‌: రాజెవరు? పేదెవరు?
మురికివాడలు, ఆధునిక కాలనీలు, పేదా గొప్ప తారతమ్యం స్పష్టంగా కనిపించే ప్రాంతాలతో కూడిన ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ), దానం నాగేందర్‌ (టీఆర్‌ఎస్‌),  దాసోజు శ్రవణ్‌ (కాంగ్రెస్‌) హోరాహోరీ తలపడుతున్నారు. ప్రచారంలో మూడు పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బస్తీలపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ దృష్టి పెట్టగా, కాలనీలు, అపార్ట్‌మెంట్లపై బీజేపీ కన్నేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు ఓట్ల చీలిక చిక్కులు ఎదురుకానున్నాయి. టీఆర్‌ఎస్‌ రెబెల్‌.. బీఎస్పీ తరఫున బరిలో ఉన్న  మన్నె గోవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానం నాగేందర్‌ మైనార్టీ ఓట్లను పెద్ద మొత్తంలో కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి చింతల రాంచంద్రారెడ్డి విద్యావంతులు, అపార్ట్‌మెంట్లు, కాలనీవాసుల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇతర పార్టీల అసంతృప్తులపై ఆయన దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి దాసోజు శ్రవణ్‌కు టీడీపీ సహకారం ఇప్పుడిప్పుడే లభిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ ఎంతగా పుంజుకుంటే ఆయనకు అంతగా లాభం. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ ఓట్లు ఎటుపడితే వారిదే విజయం. 

కంటోన్మెంట్‌: ‘ట్రిపుల్‌’ ఫైట్‌
దేశ రక్షణశాఖకు ఆయువుపట్టుగా నిలిచిన నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. బరిలో మొత్తం 19 మంది ఉన్నా.. ప్రధాన పార్టీలకు చెందిన జి.సాయన్న (టీఆర్‌ఎస్‌), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్‌), ఎన్‌.శ్రీగణేశ్‌ (బీజేపీ) మధ్యే పోటీ ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న, ఒకసారి ఎమ్మెల్యే, రెండుమార్లు  ఎంపీ అయిన సర్వే సత్యనారాయణ 24 ఏళ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీ బరిలో ముఖాముఖి తలపడుతున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు నలుగురు తనవైపు ఉండడం, పార్టీ బలగం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, టీడీపీ–టీజేఎస్‌ ఓట్లు తనకు కలిసి వస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే భావిస్తున్నారు. ఇక కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుల్లో ఎనిమిది మంది తనవైపు ఉండడం, స్థానిక కార్పొరేటర్‌ మద్దతు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని సాయన్న భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీగణేష్‌ నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై తాను చేసిన పోరాటాలు, బీజేపీ ఇమేజ్‌ కలిసివస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. 

ముషీరాబాద్‌: ముగ్గురు ‘బాస్‌’ల పోరు
ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ మధ్య పోరు రసవత్తరంగా ఉంది. ముగ్గురికి గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏడోసారి పోటీ చేస్తున్న లక్ష్మణ్‌.. గతంలో రెండుసార్లు గెలిచి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఠా గోపాల్‌ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి రాత్రికి రాత్రే టికెట్‌ దక్కించుకున్నారు. నాడు  లక్ష్మణ్‌పై పోటీచేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. హోం మంత్రి నాయినిని కాదని ఈసారి మళ్లీ టికెట్‌ దక్కించుకున్న గోపాల్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ తొలిసారి పోటీలోనే తలపండిన రాజకీయ నాయకులను ఢీకొంటున్నారు. తండ్రి నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులైన ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌ తెరవెనక ఉండి చక్రం తిప్పుతున్నారు. పోటీలో ఉన్న ముగ్గురూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఇక్కడ మైనార్టీల ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి. వీరు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. నియోజకవర్గంలోని బూత్, డివిజన్‌ స్థాయి కార్యకర్తల బలం, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్‌ తనకు కలిసివస్తుందన్న నమ్మకంతో లక్ష్మణ్‌ ఉన్నారు. గతంలో ఓడిపోయాననే సానుభూతి, ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అండతో గట్టెక్కుతానని ముఠా గోపాల్‌ భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఓటుబ్యాంక్, యువత ఓట్లు తనకు దక్కుతాయని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అంచనా వేసుకుంటున్నారు. 14 బస్తీల్లో నివసిస్తున్న వారికి ఇళ్లపట్టాల సమస్య, హుస్సేన్‌సాగర్‌ నాలా కాలుష్యం, అశోక్‌నగర్‌ బ్రిడ్జి వెడల్పు, మినీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటివి ఇక్కడ ప్రభావం చూపే అంశాలు. 

‘హిల్స్‌’లో పాగా కోసం
ఒకవైపు సంపన్నుల నివాసాలు.. ఆ పక్కనే మురికివాడల్లోని పూరిగుడిసెలతో ఉండే ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్యెల్యే  మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నవీన్‌యాదవ్‌ పోటీ పడుతున్నారు. 80వేలకు పైగా ఉన్న ముస్లిం ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పార్టీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తనకు కలిసివస్తాయని గోపీనాథ్‌ భావిస్తున్నారు. అయితే ఆయనకు పార్టీ నేతల నుంచి వ్యక్తమౌతోన్న వ్యతిరేకత చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక  దివంగత నేత పీజేఆర్‌ కుమారునిగా తనకు పేదల్లో ఆదరణ ఉందని, టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి అంచనా. అయితే కిందిస్థాయి క్యాడర్‌తో సఖ్యత లేదన్న విమర్శ ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా క్యాడర్‌ ఉంది. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. మైనార్టీల ఓట్లు భారీగా తనకు లభించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

లష్కర్‌లో తళుక్కుమనేదెవరు?
సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఆపద్ధర్మ మంత్రి టీ.పద్మారావుగౌడ్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్థి బండపెల్లి సతీష్‌కుమార్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ముందుండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఆలస్యంగా ఖరారు కావడం, మహాకూటమి నేతలను కలుపుకుపోవడంలో జ్ఞానేశ్వర్‌ కాస్త వెనుకబడ్డారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ముస్లిం మైనార్టీ ఓట్లే తనను గట్టెక్కిస్తాయని పద్మారావు ఆశతో ఉన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యమకారులను ఆదరికంచకపోవడం వంటి అంశాలపై కొంత అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో ముదిరాజ్‌ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో వారి ఓట్లపైనే జ్ఞానేశ్వర్‌ ఆశ పెట్టుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఆయన మహాకూటమి నాయకులను కలుపుకుపోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి బండపెల్లి సతీష్‌.. నియోజకవర్గంలో తాను చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలతో యువత ఓట్లు భారీగా పొందుతానని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ముగురునీటి సమస్య ప్రధానమైనది. భారీ వర్షాలు కురిసినపుడు నాలా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవడం రివాజుగా మారింది. రహదారుల విస్తరణ కూడా ప్రభావం చూపనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement