అంతా ‘వారసత్వ’ మయం | Dynastic Politics In Medak District | Sakshi
Sakshi News home page

అంతా ‘వారసత్వ’ మయం

Published Thu, Nov 15 2018 2:04 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Dynastic Politics In Medak - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వారసత్వం దశాబ్ధాల తరబడి కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన వారు, దగ్గరి బంధువులు ఎన్నికల బరిలో నిలుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ వారసత్వంగా తెరపైకి వచ్చిన వారిలో కొందరు స్వల్ప కాలానికే తెరమరుగు కాగా, మరికొందరు తమ సొంత రాజకీయ వ్యూహ చతురతతో నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన దామోదర రాజనర్సింహ, హరీశ్‌రావు వంటి నేతలు రాష్ట్ర స్థాయిలో కీలక నేతలుగా ఎదిగారు. రామలింగారెడ్డి వంటి నేతలు బంధుత్వం ఉన్నా, తమ స్వీయ శక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వంపై ‘సాక్షి’ కథనం.

మామ సిద్దిపేట.. నేటి అల్లుడి కంచుకోట..
సిద్దిపేటలో కేసీఆర్, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. టీఆర్‌ఎస్‌ను స్థాపించిన అనంతరం కేసీఆర్‌ తిరిగి 2001 ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో కరీంనగర్‌ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి కేసీఆర్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలో కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీ సాధిస్తూ విజయ పరంపర సాగిస్తున్నారు.

తండ్రి బాటలో సంజీవరెడ్డి..
దివంగత బాగారెడ్డి బంధువు కిష్టారెడ్డి ఖేడ్‌ నుంచి నాలుగు సార్లు గెలు పొందారు. కిష్టారెడ్డి మరణంతో 2016 ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సంజీవరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్తిత్వాన్ని ఆశిస్తున్నారు.

అప్పట్లో అన్న.. నేడు తమ్ముడు
పాత్రికేయుడిగా ఉంటూ 2004లో, 2008 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన దొమ్మాట నుంచిసోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి చెందారు. తిరిగి 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన విజయం సాధించారు.  ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 1972లో దొమ్మాట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికైన సోలిపేట రామచంద్రారెడ్డి రామలింగారెడ్డికి వరుసకు సోదరుడు అవుతారు. 

నర్సాపూర్‌లో నాడు.. నేడు చిలుముల వారు
1957లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా, ఆ తర్వాత నుంచి సీపీఐ పక్షాన 1994 వరకు వరుసగా పది ఎన్నికల్లో నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చిలుముల విఠల్‌రెడ్డి 1962, 1978, 1985, 1989, 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలై,2014లో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి గెలుపొందిన మదన్‌రెడ్డి మరోమారు పోటీ పడుతున్నారు. విఠల్‌రెడ్డికి  మదన్‌రెడ్డి వరుసకు కుమారుడు అవగా, విఠల్‌రెడ్డి సొంత కుమారుడు కిషన్‌రెడ్డి 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

ఖేడ్‌లో ‘మహా’ కుటుంబం..
1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఖేడ్‌ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన ఎం.వెంకటరెడ్డి 1972, 1983లో గెలుపొందారు. 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వెంకటరెడ్డి కుమారుడు విజయపాల్‌రెడ్డి గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి వెంకట్‌రెడ్డి మరో కుమారుడు భూపాల్‌రెడ్డి 2016 ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి 2016 ఉప ఎన్నికలో గెలుపొందారు.

అందోల్‌లో నాడు నాన్న.. నేడు కుమారుడు..
1962లో సదాశివపేట ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలు పొందిన రాజ నర్సింహ, 1967, 1972, 1978లో అందోలు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. తిరిగి 1985లో ఇండిపెండెంట్‌గా బరి లోకి దిగి ఓటమి చెందిన రాజనర్సింహ స్థానంలో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ 1989 ఎన్నికల్లో ఆరంగేట్రం చేశారు. 19 89, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి ప్రస్తుతం పోటీలో ఉన్నారు.

మెదక్‌లో భార్యాభర్తలు..
1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మెదక్‌  స్థానం నుంచి పోటీ చేసిన కరణం రామచంద్రరావు 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన మరణంతో 2002లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య ఉమాదేవి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీ చేసిన కరణం ఉమాదేవి ఓటమి చెందడంతో వారి కుటుంబం క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించింది.

మెదక్‌లో పట్టు తగ్గని ‘పటోళ్ల’..
1989లో కాంగ్రెస్‌ నుంచి మెదక్‌ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన పీ.నారాయణ రెడ్డి,  1994లో ఓటమి పాలయ్యారు. 2002 ఉప ఎన్నికలో పోటీ చేసిన పీ.నారాయణరెడ్డి కుమారుడు శశిధర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందగా, 2009 ఎన్నికల్లో పరాజయం పొందారు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు.


మూడు తరాల నేతలు..
1952లో బీదర్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న నారాయణఖేడ్‌ నుం చి కాంగ్రెస్‌ పక్షాన అప్పారావు షెట్కార్‌ తొలిసారిగా ఎన్నికయ్యారు. 1957లో గెలుపొం దిన ఆయన, 1962లో ఓటమి చెందారు. ఆయన స్థానంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతని సోదరుడు శివరావు షెట్కార్‌ 1967, 1978, 1985 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో శివరావు షెట్కార్‌ కుమారుడు సురేశ్‌ షెట్కార్‌ కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 2009లో జహీరాబాద్‌ ఎంపీగా గెలుపొందిన షెట్కార్‌ 2014లో మరోమారు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన షెట్కార్‌ ప్రస్తుతం నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.


అప్పుడు అమ్మ.. ఇప్పుడు గీతమ్మ
1989లో కాంగ్రెస్‌ నుంచి గజ్వేల్‌ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసిన గీతారెడ్డి విజయం సాధించారు. తిరిగి 1994, 1999 ఎన్నికల్లో వరుస ఓటమి అనంతరం 2004లో మరోమారు గజ్వేల్‌ నుంచి గెలుపొందారు. జహీరాబాద్‌ నుంచి 2009, 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
గీతారెడ్డి తల్లి జె.ఈశ్వరీబాయి 1983 ఎన్నికల్లో అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 1962లో ఆర్‌పీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఈశ్వరీబాయి, అదే నియోజకవర్గంలో 1967 ఎన్నికల్లో విజయం సాధించారు. తిరిగి 1972 ఎన్నికల్లోనూ ఎల్లారెడ్డి నుంచి ఎన్‌టీపీఎస్‌ పార్టీ తరపున గెలుపొందారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement